మాజీ మంత్రి , తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు అయిన లోకేష్ రాయలసీమ పాదయాత్ర పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలో ప్రవేశించారు. రాయలసీమలో ఆయన చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలను గమనిస్తే తన తండ్రి చంద్రబాబు నాయుడు వైఫల్యాలను అడుగడుగునా ఎత్తి చూపినట్లుగా ఉంది. బహుశా ఆ విషయం లోకేష్ కు తెలియకపోవచ్చు. వినేవారికి అర్ధం అవుతుంటుంది. అంతేకాదు. లోకేష్ చేసిన వాగ్దానాలు చూస్తే తండ్రిని మంచి ఉత్తిత్తి హామీలు ఇవ్వడానికి పోటీపడుతున్నారనిపిస్తుంది. ఎల్లో మీడియా అండ ఉంది కనుక ఆయన ఏమి మాట్లాడినా ప్రముఖంగా ప్రచారం చేస్తుంటారు . దాంతో అంతవరకు ఆయన సంతృప్తి చెందవచ్చు.
అర్థం పర్థం లేని సవాళ్లు
అంతకుమించి లోకేష్ యాత్రలో పస కనిపించదు. కాకపోతే తరచుగా జగన్‌ను నువ్వేరా.. చూసుకుందాం.. వంటి అసందర్భ సవాళ్లు ఉంటున్నాయి. మరో విషయం కూడా ఉంది. ఇంతకీ తాను ముఖ్యమంత్రిని అవుతానని హామీలు ఇస్తున్నారా?లేక తన తండ్రి సీఎంఅయితే తాను చేయిస్తానని చెబుతున్నారా?అన్న కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. లోకేష్ కు తనను సీఎంఅభ్యర్దిగా ప్రకటించడం లేదన్న బాధ మనసులో ఉండి ఉండాలి. లేదా తనను సీఎంఅభ్యర్దిగానే టీడీపీ క్యాడర్ భావించాలని అనుకుంటుండాలి. ఒకసారేమో తానే అన్ని చేసేస్తా అని అంటారు.
మేము గానీ అధికారంలోకి వస్తే..
మరోసారి తెలుగుదేశం చేస్తుందని చెబుతారు. ఈయన ఏ హోదాలో చేస్తారో చెప్పరు. ఇదేదో అనువంశిక రాజరికంగా లోకేష్ తలపోస్తున్నట్లు అనిపిస్తుంది. తన తండ్రి తర్వాత తానే టీడీపీ అధినేతనని చెప్పుకోవడానికి కొంతమేర ఈ యాత్ర ఉపకరించవచ్చు. అంతకు మించి ప్రజలకు ఒనగూరేదేమీ లేదు. మిషన్ రాయలసీమ అని ఒక కార్యక్రమాన్ని లోకేష్ ప్రకటించారు.
మరిచిపోయారా మీ చరిత్ర
సీమ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా.. అని ఆయన అన్నారని ఎల్లో మీడియా రాసింది. పెద్ద,పెద్ద హెడింగ్ లు పెట్టింది. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తా, అభివృద్ది బాట పట్టిస్తా .. అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారని ఆయన అనుకుంటున్నారనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ ఇప్పుడు చెబుతున్న సమస్యలు, హామీలు ఎందుకు చంద్రబాబు టైమ్లో పరిష్కారం కాలేదు అన్నదానికి ఆయన సమాధానం ఇవ్వగలిగితే బాగుంటుంది. లేదూ చంద్రబాబు అన్నీ సమస్యలు తీర్చేస్తే, ఆ తర్వాత వచ్చిన పాలకులు మళ్లీ ఆ సమస్యలను తెచ్చిపెట్టారా? ఆ మాటకు వస్తే లోకేష్ కూడా ఆరేళ్లు ఎమ్మెల్సీగా, సుమారు రెండున్నర ఏళ్లు మంత్రిగా ఉన్నారు కదా! అప్పుడు ఆయన ఏమి చేసినట్లు?టీడీపీ అదికారంలోకి వచ్చాక మూడేళ్లలోనే వాటన్నిటిని స్వయంగా ఆయనే తీర్చుతారట. లేదంటే నిలదీయాలట.
మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావ్?
ఆ ప్రకారం ఈయన మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానికి ప్రజలు ఎన్నిసార్లు నిలదీయాలి? సమస్యలనేవి ఎప్పటికప్పుడు కొత్తవి వస్తుంటాయి. వాటివరకు అయితే చెప్పడం తప్పు కాదు. కాని గతంలో అసలు ఏమీ జరగనట్లు, ఆయనకు అధికారం ఇస్తే అన్నీ చేసేస్తానని అనడమే ఆయనలోని అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా ఉంటుంది. అయితే లోకేష్ ఇందుకు ఒక కండిషన్ పెట్టారు. గత ఎన్నికలలో వైసీపీకి ఇచ్చిన 49 అసెంబ్లీ సీట్లను రాయలసీమ వాసులు టీడీపీకి ఇవ్వాలట. అలా కాకపోతే చేయరన్నమాట.
రైతులకు మీరా న్యాయం చేసేది.?
గతంలో చంద్రబాబు సి.ఎమ్.గా ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీకు తాను పనులు ఎందుకు చేయాలని అనేవారు. ఇప్పుడేమో లోకేష్ మరో అడుగు ముందుకేసి మొత్తం సీట్లు రాసిస్తే కన్నీళ్లు తుడుస్తానని అంటున్నారు. ప్రజలు నమ్మవచ్చా! ఆయన ఇచ్చిన హామీలలో మొదటిది సీమలో సాగునీటి ప్రాజెక్టులన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తామని చెప్పారు. మంచిదే. కాని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారో చెప్పి ఉండాలి క దా! పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విస్తరించబోతే టీడీపీ నేతలతో విజయవాడ ప్రకాశం బారేజీపైన ఎందుకు ధర్నాలు చేయించారు.
బాబు లోకేషా.. వెళ్లి మీ నాన్నను అడుగు
బహుశా లోకేష్ అప్పటికి చిన్న పిల్లాడు కనుక తెలియకపోవచ్చు. లేకపోతే తన తండ్రిని అడిగి రాయలసీమకు నీరిచ్చే ఆ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నారని అడగాలి. అసలు సీమలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో లోకేష్ చెప్పగలిగితే విశేషమే అవుతుంది. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో మూడు సాగునీటి ప్రాజెక్టులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనులు చేయిస్తుంటే, వాటిని టీడీపీకి చెందినవారు ఎందుకు అడ్డుకున్నారు? వలస కూలీలకు ఉపశమనం కలిగిస్తాం అని లోకేష్ మరో మాట చెప్పారు. ముందుగా 35 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సీఎంచంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడ వలసలను నివారించలేకపోయారు? బిందు, తుంపర సేద్యాలను 90 శాతం రాయితీతో ప్రోత్సహిస్తామని అన్నారు. ఇలాంటి స్కీములు ఇప్పటికే ఉన్నాయి కదా? కాకపోతే ఆయన ఒకటి మర్చిపోయినట్లున్నారు. తన తండ్రి రెయిన్ గన్‌లు తెచ్చి రాయలసీమ కరును తీర్చేశానని అనేవారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, అవి అమలు అయిన తీరును ఒకసారి పరిశీలిద్దాం.
ఓట్ల కోసం పాట్లు
ఆ మాట విన్న జనం బిత్తరపోయేవారు. రెయిన్ గన్ ల గురించి ఈయన హామీ ఇచ్చినట్లు లేరు. టమోటాకు వాల్యూచైన్, గుజ్జు పరిశ్రమ, ఉద్యానవన పంటలు,, ఇలా పలు హామీలు గుప్పించారు. రైతులకు ఏడాదికి ఇరవైవేలు ఇస్తామని చెప్పిన ఆయన గతంలో రుణమాపీ హామీ ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలి కదా! పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు ఇస్తామని, పశువుల కొనుగోలు నుంచి దాణావరకు అన్ని రాయితీలు ఇస్తామని చెప్పారు. ధరలు తగ్గిస్తామని, పరిశ్రమలు స్థాపిస్తామని , సీమలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పెడతామన్నారు. అక్కడితో ఆగలేదు. దేశానికి క్రీడా రాజధానిగా రాయలసీమను చేస్తారట. అన్నిరకాల టూరిజం అభివృద్ది చేస్తారట. ఇలా లెక్కకు మిక్కిలిగా మిషన్ రాయలసీమ హామీలను అమలు చేయడానికి ఎంత వెచ్చిస్తారో చెప్పి ఉండాలి. ఆయన సమావేశానికి రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున మేధావులు తరలివచ్చారని ఎల్లో మీడియా రాసింది.
సీమకు ద్రోహం చేసిన చరిత్ర ఎవరిది?
మరి వారిలో ఎవరికి ఏ సందేహం రాలేదా? ఆ సంగతులేవీ కనిపించలేదు. కర్నూలుకు హైకోర్టు రాకుండా ఎందుకు అడ్డుపడ్డారు. క్రీడానగరం రాయలసీమలో కాకుండా అమరావతిలోనే పెడతామని లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు ఎందుకు గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్లాన్ మార్చుకున్నారా? అమరావతిలోనే మొత్తం లక్షల కోట్లు వ్యయం చేస్తామని ఇంతవరకు చెప్పారు కదా! ఆ సంగతులేవీ ఎందుకు ప్రస్తావించ లేదు? తుని వద్ద రైలు దగ్దం అయితే రాయలసీమ రౌడీలని, కడప గూండాలని చంద్రబాబు అనడం ద్వారా ఆ ప్రాంత మనో భావాలను దెబ్బతీయలేదా? ఒకవైపు జగన్ రాయలసీమలో పలు పరిశ్రమలు తేవడానికి యత్నిస్తుంటే, అసలేవీ పరిశ్రమలు రాలేదని చెబితే జనం విశ్వసిస్తారా? అన్నిటికి మించి ఏ హోదాలో లోకేష్ ఈ హామీలు ఇస్తున్నారు? వాటికి ఎవరు గ్యారంటీ ? గతంలో టీడీపీ మానిఫెస్టో లో 400 హామీలు ఇచ్చి , వెబ్ సైట్ నుంచే మానిఫెస్టోని తొలగించిన అనుభవం నేపధ్యంలో దానికే దిక్కు లేకపోతే, ఇప్పుడు లోకేష్ ఇచ్చే హామీలకు , వాగ్దానాలకు ఏమి ఉంటుంది విశ్వసనీయత.?
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment