ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వింత, విచిత్ర ధోరణి అంతుపట్టకుండా పోతోంది. మాటలు మార్చే విషయంలో ఘనాపాఠిగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడినే మించిపోయేలా ఉన్నాయి వపన్ చర్యలు. ఈ క్రమంలోనే ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూ.. తనను తాను మోసగించుకుంటున్నారా? లేక పార్టీ కార్యకర్తలు లేదా ప్రజలందరినీ మూర్ఖులను చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. ఈ ప్రస్తావనంతా ఎందుకిప్పుడు అంటే...
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం, ఆ వెంటనే పవన్ రంగంలో దిగి దీక్ష డ్రామాకు తెర తీయడం మనం చూశాం. అయితే ఈలోపుగానే.. లడ్డూ తయారీలో జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వాడారు అనేందుకు ఆధారాల్లేనట్లు అందరికీ తెలిసిపోయింది. ఈ పరిణామంతో చంద్రబాబైనా కొంత తగ్గాడేమో కానీ.. పవన్ మాత్రం మరింత రెచ్చిపోయాడు. తానే అసలు సిసలైన హిందువు అని జనాన్ని నమ్మించేందుకు ముందు తిరుమల యాత్ర అని ఆ తరువాత వారాహి డిక్లరేషన్ అని నానా డ్రామాలూ ఆడేశారు. ఆయా సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాలు కూడా రంకెలేసినట్లుగా అరుపులతోనే సాగాయి. మత విద్వేషాన్ని ఎగదోయడమే లక్ష్యమన్నట్టుగా పవన్ మాట్లాడారని ప్రజలు చాలా మంది అభిప్రాయపడ్డారు.
సనాతన ధర్మమంటూ మాట్లాడి, అదేమిటో చెప్పకుండా, హిందూ మతాన్ని తానే ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెట్టారు. తిరుమలేశుని భక్తుణ్ణి అని చెప్పుకుంటూనే ఆయనకు అపచారం జరిగేలా లడ్డూ పై ప్రజలలో విశ్వాసం పోయేలా మళ్లీ మాట్లాడారు.
అధికారంలో ఉన్నప్పుడు మన మాటలు, చేష్టలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఎన్నికల ముందు ఎన్ని అబద్దాలు చెప్పినా చెల్లిపోయింది కదా అని, ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళితే జనానికే కాదు.. జనసేన కార్యకర్తలకు సైతం విసుగొచ్చే ప్రమాదముంది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలోనే లడ్డూ కల్తీ ప్రస్తావనను టీటీడీ తీసుకురాకపోతే.. ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న పవన్ లేనిపోని ఆరోపణలను వల్లెవేయడంలో ఆంతర్యమేమిటో ఆయనకే తెలియాలి.
ఎర్ర కండువా నుంచి కాషాయానికి మారడం తప్పు కాదు కానీ తాను గతంలో ఏం మాట్లాడింది? ఇప్పుడు మాట్లాడుతున్నదేమిటి? అన్నది కూడా ఆలోచించుకుని ఉండాల్సింది. ఆ విజ్ఞతతో ప్రసంగించాలి. అంతే తప్ప సనాతన ధర్మ పరిరక్షకుడిని తానే అన్నట్టుగా మాట్లాడినా, పోజు పెట్టినా ప్రజల్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది.
2014లో అసలు జనసేన సిద్దాంతాలుగా ఆయన ప్రకటించిందేమిటి? చెప్పిన ఏడు పాయింట్లలో మొదటిది కులాలను కలిపే ఆలోచనా విధానం అనే కదా ఉంది? ఆ తరువాత కులాల గురించి మాటలు ఎన్ని మార్చారో అందరికి తెలుసు. ఎన్నికల సందర్భంగా ఆయన చివరకు తన కులపు వాళ్లయినా తనకు మద్దతివ్వాలని అడిగిన వైనం ప్రజల మనసుల్లో తాజాగానే ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలుగా పవన్ ప్రకటించిన వాటిల్లో రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఈ సిద్ధాంతం కూడా ఇప్పుడు అధికారం వచ్చాక మారిపోయింది. తాను హిందూమతం కోసం పాటు పడతానని, సనాతన ధర్మం కోసం పని చేస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వీటినిబట్టే కులం, మతం విషయాలలో పవన్ వైఖరి ఎంత దారుణంగా మారిందో అర్థమవుతుంది. ఆయన నిజంగా స్వామి అవతారం ఎత్తదలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పార్టీ రాజకీయాలను వదలిపెట్టి అలాగే చేసుకోవచ్చు. అలా కాకుండా వేషం మాత్రం మార్చి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే దొంగ బాబాగా మిగిలిపోతారు.
పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన మాటల్ని ఒకసారి గుర్తుకు చేసుకుందాం.... ఒకసారి తాను బాప్టిజం తీసుకున్నానని, ఇంకోసారి తన భార్య, కుమార్తె క్రైస్తవులని ఒకసారి చెప్పుకొచ్చారు ఆయన. పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు కొదవేలేదు. వీడియోలు అనేకం కనిపిస్తున్నాయి. సనాతన దర్మంలో తండ్రి మతం కాకుండా తల్లి మతం కుమార్తెకు ఎలా వస్తుందన్న ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వగలరా? ఏదో పబ్లిసిటీ కోసం తన కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి తన పరువు తాను తీసుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలోకి వెళ్లితే సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెబుతున్న ఈయన చేసిన నిర్వాకాలేమిటో అందరికీ తెలుసు.
అయినా ఎలాంటి భేషజం లేకుండా పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే, ఆయన మోసపూరిత రాజకీయం చేస్తున్నారని తెలిసిపోతుంది. రాజకీయంగా మాటలు మార్చితే ఒక పద్దతి.అలా కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేలా అధికారంలో ఉన్న పెద్ద మనిషి వ్యవహరిస్తే అది సమాజానికి ప్రమాదం అవుతుంది. సనాతన ధర్మం అంటే తోచిన అబద్దం చెప్పడమా? తిరుపతి సభలో ఆయన మాట్లాడుతూ సనాతన దర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా తుడిచిపెట్టుకు పోతారని హెచ్చరించారు. సనాతన ధర్మం ప్రకారం విడాకుల ప్రసక్తి ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చెబుతున్నారు.మరి పవన్ ఏమి చేశారు. రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. రెండుసార్లు హిందూ స్త్రీలకు విడాకులు ఇచ్చి మూడోసారి క్రైస్తవ మహిళను వివాహమాడారు. అంటే హిందూ ధర్మంపై దాడి చేసింది పవనే అవుతారు కదా! చట్టం ప్రకారం ఆయన చేసింది తప్పు కాకపోవచ్చు.
కానీ ఆయన చెబుతున్న సనాతనం ప్రకారం అయితే అది నేరం కాదా?ఇందులో ఇతర అంశాల జోలికి వెళితే బాగుండదు. అవన్ని కూడా సనాతన ధర్మానికే కాదు..హిందూ మత విధానాలకే వ్యతిరేకంగా చేశారు. ఆయన ఇప్పుడు వచ్చి ఈ ధర్మం గురించి బోధిస్తుంటే ఏళ్ల తరబడి హైందవ ధర్మం కోసం పనిచేస్తున్న స్వామీజిలు బిత్తరపోతున్నారు.
తాము ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదానిపై పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారట. ఎన్నికల ముందు ఆలోచించకుండా ఇష్టారీతిలో అబద్దపు వాగ్దానాలు చేయడం సనాతన ధర్మంలో ఉందా? హిందూ మతంలో ఉందా? కలియుగ దైవానికి అపచారం చేస్తే ఎందుకు ఊరుకుంటాం అని పవన్ ప్రశ్నించారు. అపచారం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే కదా? జంతు కొవ్వు కలిసిన నేతిని లడ్డూ తయారీలో వాడారని ఆధారం లేని సంగతి చెప్పింది వారే కదా? అది నిజమే అయితే రెండు నెలలపాటు మౌనంగా ఉండడం నేరం కాదా? అయోధ్యకు పంపిన లడ్డూలు కల్తీ అయ్యాయని పవన్ చేసిన ఆరోపణకు నిదర్శనం చూపించాలి కదా? ఈయన స్వయంగా అక్కడకు వెళ్లారు కదా.అప్పుడు ఎవరైనా ఈయనకు ఫిర్యాదు చేశారా? చేస్తే వెంటనే ప్రకటన ఇచ్చేవారు కదా? అంటే అసత్యం చెప్పారనే కదా!
'ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం.." అని అంటారు. ఇది మతాలను రెచ్చగొట్టడం కాదా? హైందవ ధర్మంలో ఇదేనా ఉంది? సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అని పవన్ అన్నారు. గొడవలు సృష్టించడానికే ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారా? అసలు ఎవరైనా సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడారా? కేవలం పవన్ కళ్యాణ్ లేని వివాదం తెచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. జగన్ పాలనలో ఏదో జరిగిందని పచ్చి అబద్దాలు చెప్పి హిందూ మతానికి ఈయన మరింత అప్రతిష్ట తెస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల రధం దగ్దం చేయడం వంటివి కొన్ని జరిగాయి. అలాగే మహిళలపై ఈ నాలుగు నెల్లోనే జరిగినన్ని అత్యాచారాలు,ప్రత్యేకించి చిన్న పిల్లలపై జరిగిన ఘోరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి.వాటి గురించి మాట్లాడే ధైర్యం లేని పవన్ ఎంతసేపు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, సనాతన ధర్మం అంటూ కొత్తపాట ఎత్తుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. నిజానికి ఆయనకు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదనేదే విద్యాధికుల స్పష్టమైన భావన. ఏపీ ప్రజలలో మత భావాలను పెంచి బీజేపీ ఎజెండా ప్రకారం ఇలాంటి కుట్రలకు పవన్ పాల్పడుతున్నారన్నది మరికొందరి అనుమానం.
చంద్రబాబే అవకాశ వాదంతో రకరకాల వర్గాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారంటే, ఆయనను దాటి పోవాలని ఏమైనా అనుకుంటున్నారా? అన్నది తెలియదు. కానీ హనుమంతుని ముందు కుప్పి గంతులా అన్నట్లు చంద్రబాబు ఈయన తోక కట్ చేయగలరు. తన మీడియా బలంతో భ్రష్టు పట్టించగలరు. చంద్రబాబు, లోకేష్ లు తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఇరికించి పరువు తీస్తున్నారా? అన్నది మరికొందరి సందేహం. ప్రస్తుతానికి ఇద్దరూ కలిసి జనాన్ని మోసం చేయడానికి ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment