జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త చరిత్ర చెబుతున్నారు.తద్వారా చరిత్రకు ఆయన వక్ర భాష్యం చెబుతున్నారు. విశాఖలో ఆయన వారాహి యాత్ర చేస్తూ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దూషణలకు ఇచ్చిన ప్రాధాన్యత తాను అధికారంలోకి వస్తే ఏమి చెస్తానో చెప్పలేకపోయారు.రాష్ట్ర విభజనకు జగన్ కారణమని ఆయన కనిపెట్టారు. జగన్ వర్గం అక్కడ భూములను ఎలా దోచుకుందో చూశారట. జగన్ వర్గం చేసే దాడి తట్టుకోలేక ఆంధ్రా వాళ్లు వెళ్లిపోవాలని తన్ని తరిమేశారని పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణ చేశారు.
పవన్ కళ్యాణ్ అమాయకుడనుకోవాలా?లేక అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అనుకోవాలా? లేక ద్వేషంతో లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారా? జగన్ వర్గం అంటే ఏమిటి అర్దం? ఆయన కులం గురించి మాట్లాడాలన్నది పవన్ ఉద్దేశమా?లేక ఇంకేమైనా ఉందా? అదేదో ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోయారు?
అందులో నిజం ఉంటే గత ఇరవై ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరోపణ చేయలేదు?ఇప్పుడు ఎవరో రాసిస్తే దానిని చదివితే సరిపోతుందా? అప్పట్లో ఆంద్ర పెట్టుబడిదారులు, ఆంధ్రా సినిమా నిర్మాతలు, హీరోలు ఇలా ఒకరేమిటి? అనేక వర్గాలపై తెలంగాణ ఉద్యమకారులు విమర్శలు చేసేవారు. వారు కులాల వారీగా చూసి ఆందోళనలు చేయలేదు. కాని ఇప్పుడు మాత్రం ఒక కులానికి ఇలాంటి పిచ్చి ఆరోపణలు ఆపాదించడం పద్దతి కాదు. అప్పట్లో ఆంధ్రా వారు తీసే సినిమా షూటింగ్ లపై కూడా దాడులు చేశారు.
మరి దానిని దోపిడీగానే పవన్ చెబుతారా?
దాంతో కొన్నిసార్లు వాటిని రద్దు చేసకోవలసి వచ్చింది. అంటే దానర్ధం పవన్ కళ్యాణ్ తో సహా పలువురు ఆంధ్రా నటులు దోచుకున్నట్లు అంగీకరిస్తారా? ఆమాట కు వస్తే హైదరాబాద్ చుట్టు పక్కల ఆంద్రావారికి సంబంధించి కులాలతో నిమిత్తం లేకుండా ఫామ్ హౌస్ లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు చిరంజీవి వంటివారికి కూడా ఉన్నాయి.మరి వారు తెలంగాణ భూములను దోచుకున్నట్లే అవుతుందా?అప్పట్లో విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ కు చెందిన కంపెనీ వేలంపాటలో ప్రభుత్వ భూమి కొనుగోలు చేసి నిర్మిస్తున్న అపార్టుమెంట్ల వద్ద కూడా ఆందోళన చేశారు.
మరి దానిని దోపిడీగానే పవన్ చెబుతారా? ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ను కేసీఆర్ ఏమని తిట్టారో అందరికి తెలుసు. అంతేకాదు.. తాను నాయకత్వం వహించిన ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణకు మద్దతు అంటూ విభజనకు అనుకూలంగా మాట్లాడింది. తదుపరి రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి విభజనను వ్యతిరేకించి ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీ అయితే రెండుసార్లు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చింది. విభజన సమయంలో తెలంగాణలో ఒకరకంగాను, ఆంద్రలోను మరోరకంగాను చంద్రబాబునాయుడు మాట్లాడేవారు. అంతేకాదు. విభజన తర్వాత చంద్రబాబు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని రాత్రికి రాత్రే బిషాణ సర్దుకుని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేశారు. మరి ఎవరు ఎవరిని తరిమినట్లు? ఆ విషయాలేవీ గుర్తులేనట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అందుకే ఆయనను చంద్రబాబుకు దత్తపుత్రుడు అని వైసీపీవారు విమర్శిస్తుంటారు.
ఆ రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఉపసబాపతిగా కేసీఆర్ ఉండేవారు. కేసీఆర్ టీడీపీకి ,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ఆరంభించారు. దాని అర్ధం ఏమిటి? ఎవరికి నిరసనగా ఉద్యమం మొదలైందో తెలియని అమాయకత్వంలో పవన్ ఉంటే ఏమి చేయాలి?లేదా ద్వేషంతో జగన్ వర్గం అంటూ ఒక కులానికి ఆపాదిస్తూ అసత్యపు ఆరోపణ చేయడం ఏ మాత్రం పద్దతికాదు.కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే విభజన పరిణామాలు జరిగేవి కావని చాలామంది అంటారు.
విభజన లేఖను విత్ డ్రా చేసుకోకుండా బాబు డబుల్ గేమ్
అప్పట్లో జగన్ రాజకీయాలలోనే లేరు. జగన్ రాజకీయంగా క్రియాశీలం అయ్యాక , సొంత పార్టీ పెట్టుకున్నాక, ఆర్టికిల్ 3 ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవాలని వైసీపీ చెప్పేది. కాని ఆ తర్వాత పూర్తి సమైక్యవాద పార్టీగా మారి ఆ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. చంద్రబాబు మాత్రం డబుల్ గేమ్ ఆడారు కాని విభజన లేఖను విత్ డ్రా చేసుకోలేదు. అంతెందుకు!కాంగ్రెస్ తో పాటు తాను పొత్తులో ఉన్న భారతీయ జనతా పార్టీ విభజన చేయాల్సిందేనని పార్లమెంటులో పట్టుబట్టిన విషయం పవన్ కు తెలియదా? ఇవన్ని వదలిపెట్టి చరిత్రను వక్రీకరిస్తూ ముఖ్యమంత్రిపై నిందలు మోపుతున్నారు.వలంటీర్లను అడ్డం పెట్టుకుని జగన్ ప్రజల డేటాకొట్టేస్తున్నారని మరోసారి ఆరోపించారు. ఇదంతా ప్రజలను మోసపుచ్చే విషయం తప్ప ఇంకొకటికాదు. ఒకసారి వలంటీర్లను తిడతారు.
ఇంకోసారి..అబ్బేబ్బే ..మిమ్మల్ని కాదు.. మీకు జీతాలు తక్కువ అని వారినే ప్రాధేయపడినట్లు మాట్లాడతారు. మళ్లీ డేటా చౌర్యం అని తప్పుడు ప్రచారం చేస్తారు. ఆయనకు కేంద్రంలో చాలామందితో సంబందాలు ఉన్నాయట.కేంద్రంతో జగన్ ను ఒక ఆట ఆడిస్తాడట. ఏ మాత్రం విజ్ఞత ఉన్నవారైనా ఇలా చెబుతారా?నిజంగానే జగన్ పై ఏవైనా ఆరోపణలు ఉంటే చంద్రబాబుకాని, పవన్ కాని నిర్దిష్టంగా చెప్పి అల్లరల్లరి చేసేవారు కాదా?ఒక్క స్కామ్ కూడా లేకపోవడంతో వారికి ఏమి చేయాలో తోచక ఉన్నవి,లేనివి పిచ్చి ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు.
బీజేపీతో బంధం, టీడీపీతో అక్రమ సంబంధం!
కేంద్రానికి వేరే పని లేనట్లు, ఈయన మోసుకువచ్చే పితూరిలపైనే ఉండబోతున్నట్లు చెబుతున్నారు. అసలు ఇంతకీ ఈయన బీజేపీతో నిజమైన బందంలో ఉన్నారో,లేదో వీరెవ్వరికి తెలియదు. బీజేపీతో బంధం, టీడీపీతో అక్రమ సంబంధం నెరపే పవన్ కళ్యాన్ చేసే సినీ రాజకీయ ఉపన్యాసాలు విని జనం మోసపోతారా?జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వని మరోసారి పాత పాట పాడారు. అదెలాగో చెప్పలేరు. తాను ఎన్ని సీట్లలో పోటీచేస్తానో ఆయనకే తెలియదు. సి.ఎమ్. పదవి కావాలని ఒకసారి, తానందుకు పనికిరానని మరోసారి..ఇలా గందరగోళంగా మాట్లాడతారు. టీడీపీ నేతల మాదిరే కీళ్లు తీస్తా? కాళ్లు విరగకొడతా అంటూ చట్టం అంతా వీరి చేతిలోనే ఉన్నట్లు చెబుతారు.
జగన్ రుషికొండలో కాకుండా పరవాడ ఫార్మా హబ్ లో కూర్చోవాలని సలహా ఇస్తున్న పవన్ తాను పరవాడలోనే ఉంటానని చెబితే బాగుండేదికదా! ? పోనీ నాలుగేళ్ల క్రితం వరకు సి.ఎమ్.గా ఉన్న చంద్రబాబుకు ఎందుకు ఈ సలహా ఇవ్వలేదు.విశాఖపై ఎప్పటిమాదిరి రియల్ ఎస్టేట్ దందా అంటూ విషం కక్కారు. పవన్ కళ్యాణ్ నోటికి వచ్చిన ఆరోపణల్లా చేస్తే ఎవరు పట్టించుకుంటారు? జగన్ పై ఇన్ని విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ తాను ఎలా అధికారంలోకి రాగలిగేది?వస్తే ఏమి చేసేది ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయారు. అది ఆయన గొప్పతనం. ఇలాంటివారిని ఎన్నుకుంటే ప్రజలకు ఒరిగేది గుండుసున్నా తప్ప మరొకటి కాదు..పవన్ కళ్యాణ్ పేరుకు తగ్గట్లు గాలి మాటలు మాట్లాడుతున్నారన్న విమర్శకు ఆస్కారం ఇస్తున్నారని చెప్పక తప్పదు.
--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment