సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. అలాగే, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. కానీ, నేడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరామ్‌ను ఎలా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్ తమిళిసై ఆగమేఘాల మీద స్పందించారు.
రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు. రాజభవన్ నడుస్తుంది.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు రేవంత్ రెడ్డికి కాదు బాధ్యులు కాదు.. రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం.. ఈరోజు ఎందుకు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే విషయం చెప్పాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారం, చేష్టలు చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారు. రేవంత్ రెడ్డి వెళ్లి అమిత్ షాను కలవగానే ఒకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బీఆర్‌ఎస్‌కు, మరొకటి కాంగ్రెస్‌కు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తోంది. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారు. నిన్న గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment