అధికారంలో లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తొస్తారా!  | Malladi Vishnu Comments On Chandrababu and Yellow Media | Sakshi
Sakshi News home page

అధికారంలో లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తొస్తారా! 

Published Wed, Apr 27 2022 5:01 AM | Last Updated on Wed, Apr 27 2022 5:01 AM

Malladi Vishnu Comments On Chandrababu and Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో లేనప్పుడే ఎల్లో మీడియా ఈనాడుకు బ్రాహ్మణ మేధావుల మాటలు బాగా రుచిగా ఉంటాయని, వారు అనకపోయినా అన్నారని అర్థం వచ్చేలా ఆ పత్రికలో హెడ్డింగ్‌లు పెట్టి వార్తా కథనాలు అల్లుతున్నారని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉండవల్లి అరుణ్‌కుమార్, దువ్వూరి సుబ్బారావు, ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారంతా ఈనాడుకు, రామోజీరావుకు, చంద్రబాబుకు బంధువులు అన్నట్లుగా వారి పేరిట వార్తలు రాసే బదులు.. చంద్రబాబు, రామోజీల సామాజిక వర్గం వారి వ్యాఖ్యలనే మేధావుల వ్యాఖ్యలుగా ఇప్పుడెందుకు రాయడం లేదని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరికి వాక్‌ స్వాతంత్య్రం ఉందని, కాకపోతే ఈనాడుకు, టీడీపీకి రెండు మూడు వాక్‌ స్వాతంత్య్రాలు ఉన్నట్లు కనబడుతోందని ఆయన అన్నారు. అందులో ఒకటి అనని మాటలు అన్నట్లు చెప్పే వాక్‌ స్వాతంత్య్రం, రెండోది తమకు అనుకూలంగా మాట్లాడితే దాన్ని పదింతలు చేసి ప్రచురించే వాక్‌ స్వాతంత్య్రం, మూడోది తమకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే తమకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకునే వాక్‌ స్వాతంత్య్రం అని ఎద్దేవా చేశారు. దువ్వూరి సుబ్బారావు ఏపీ ప్రభుత్వాన్ని ఏమీ అనకపోయినా అన్నట్లుగా భావించేలా హెడ్డింగ్‌ పెట్టి వార్త రాశారన్నారు. ఇదే బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కానీ, టీడీపీ కానీ ఆలోచించే పరిస్థితి లేదన్నారు.  

అప్పుడు అవమానించి..  
టీడీపీ అధికారంలో లేకపోతే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యలను ఫ్రంట్‌ పేజీలో వేస్తారని, ఐవైఆర్‌ కృష్ణారావు వ్యాఖ్యలు టీడీపీ అనుకూలంగా ఉంటేనే ప్రచురిస్తారని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐవైఆర్‌ కృష్ణారావును ఏ విధంగా అవమానపర్చారో ఈనాడు పత్రికకు కానీ, ఎల్లో మీడియాకు కానీ గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం వారికి ఐవైఆర్‌ గుర్తుకొస్తున్నారన్నారు. వారు ప్రభుత్వంపై ఏం మాట్లాడకపోయినా మాట్లాడినట్లు రాసే పరిస్థితి తయారైందన్నారు. ప్రజలను కులాలు, మతాల వారీగా విడగొట్టి సీఎం జగన్‌ ప్రభుత్వంపై లేనివి పోగేసి కించపర్చే విధంగా, ప్రజల్లో తేలికయ్యే విధంగా వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement