సాక్షి, హైదరాబాద్: ‘సంపదతో కూడిన మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్టంగా మార్చారు. కృష్ణా, గోదావరి నుంచి ఓ చుక్క నీటినైనా తెచ్చారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా? రూ.లక్షల కోట్లు వృథా చేశారు. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా ఇచ్చారా? రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం చేశారు. స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజలు స్వేచ్ఛ ఇచ్చేటువంటి తీర్పునిచ్చారు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పాం’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేస్తుండగా భట్టి విక్రమార్క పలుమార్లు అడ్డుపడి మాట్లాడారు. ‘మనం తెలంగాణ శాసనసభలో చర్చిస్తున్నాం. 2014 జూన్ 2 నుంచి జరిగిన పనుల గురించే మాట్లాడుకోవాలి’అని చెప్పారు. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలన వద్దనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. నాడు కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేశారని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించారని చెప్పారు. పార్లమెంట్‌లో సరైన బలం లేకపోయినా కాంగ్రెస్ మిగిలిన పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు.
చర్చ తొలిరోజే దాడితో ప్రసంగాన్ని మొదలుపెడితే ప్రభుత్వం తగిన రీతిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆర్‌డబ్ల్యూఎస్ పథకం కింద 70–80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు ఇచ్చామని భట్టి గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.43 వేల కోట్లు్ల ఖర్చు పెట్టి నీళ్లు ఎక్కడ ఇచ్చారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నల్లగొండకు 2014కు ముందు నీళ్లు రాలేదా? అని పేర్కొన్నారు.
సీఎం ఎంపిక హైకమాండ్‌దే: మంత్రి దామోదర
కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుడు సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించే సంప్రదాయం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తామంతా శిరసావహిస్తామని ప్రజలకు కూడా తెలుసన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని రేవంత్‌రెడ్డిని సీఎం చేయడంపై కేటీఆర్ చేసిన విమర్శకు దామోదర ఈ మేరకు స్పందించారు.
పైన పటారం.. లోన లొటారం: మంత్రి పొన్నం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందనే తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామని కేటీఆర్‌కు సూచించారు. మా తాత మీసాల మీద నిమ్మకాయ పెట్టాడంటే నడవదని పొన్నం చెప్పగా.. దీనికి కేటీఆర్ గట్టిగా స్పందించారు. ‘మా తాతలు నెయ్యి తాగిన్రు.. మా మూతులు వాసన చూడండి’అంటే కుదరదని కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టామని క్రెడిట్ మాత్రమే తీసుకుంటామంటే నడవదని, కాంగ్రెస్ దురాగతాలను బరాబర్ చెప్తామని పేర్కొన్నారు.
మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో సైతం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించే చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం, పేదలకు న్యాయం జరిగాయని, ఇళ్లు, భూములు, పోడు భూములొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రభుత్వం కోసమే మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఉమ్మడి ఏపీలో 1999లో 91 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారంటూ.. కాంగ్రెస్‌ను తామే గెలిపించామన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘నాడు మీరెంత మంది ఉన్నారు? ఎన్ని సీట్లలో పోటీ చేసి ఎంత మంది గెలిచారు? మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది’అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment