![Manipur Violence Centre Extends Ban On 9 Meitei Extremist Groups For 5 Years - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/13/Meitei%20Extremist%20Groups.jpg.webp?itok=qCQAV_Et)
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తొమ్మిది మైతీ తీవ్రవాద గ్రూపులు, వాటి అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ సంస్థలపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. వేర్పాటువాద, విధ్వంసక, తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మణిపూర్‌లో భద్రతా బలగాలు, పోలీసులు, పౌరులపై దాడులు సహా, దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు హానికరమైన కార్యకలాపాలను చేపడుతున్న తొమ్మిది మైతీ తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపలు, భద్రతా బలగాలపై ప్రాణాంతకమైన దాడులకు పాల్పడుతున్నారంటూ పీఎల్‌ఏ( పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ )తోపాటు దాని రాజకీయ విభాగం, రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ సహా తొమ్మిది సంస్థలు, అనుబంధ విభాగాలపై ఐదేళ్లపాటు నిషేధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) దాని రాజకీయ విభాగం రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్(ఆర్‌పీఎఫ్)తో పాటు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) దాని సాయుధ విభాగం, మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపీఏ), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్‌ఈపీఎకే), రెడ్ ఆర్మీ అని పిలవబడే దాని సాయుధ విభాగం కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ(కేసీపీ), రెడ్ ఆర్మీ విభాగం, కంగ్లీ యావోల్ కాన్బలుప్ (కేవైకేఎల్), కోఆర్డినేషన్ కమిటీ (కేఓఆర్కామ్), అలయన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ (ఎఎస్‌యూకే)లను చట్టవిరుద్దమైన సంఘాలుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఈ సంస్థలపై విధించిన నిషేధం సోమవారం నుంచి ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సాయుధ పోరాటం ద్వారా మణిపూర్ ను భారతదేశం నుండి వేరు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థానిక ప్రజలను ప్రేరేపించడమే ఈ సమూహాల లక్ష్యంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కాగా ఈ ఏడాది మే 3నుంచి మణిపూర్ మైతీ గిరిజన కుకీ కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా కనీసం 50వేల మంది నిరాశ్రయులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment