సాక్షి, అమరావతి: విదేశీ విద్యా దీవెన పథకం అమలులో అనేక తప్పులకు ఆస్కారమిచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ పథకం ఆగిపోయిందంటూ కుప్పి గంతులు వేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2016–17 నుంచి ఎంపికైన 3,326 మంది విద్యార్థులకు రూ.318 కోట్ల బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విదేశీ విద్యా పథకం అమల్లో అనేక అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలిందని చెప్పారు.
కొందరు విద్యార్థులు డబ్బులు పొంది కోర్సు పూర్తి చేయకుండానే రాష్ట్రానికి తిరిగి వచ్చేశారన్నారు. ఇదే కాకుండా లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితి పాటించకపోవడం, ఇంట్లో ఒకరికి మించి లబ్ధి కలిగించడం, ఒక చోట సీటు అని చెప్పి మరొక చోట చేరడం, ఎక్కడ చదువుతున్నారో కనీసం చిరునామా కూడా తెలియకపోవడం, అధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకపోవడం వంటి అనేక అక్రమాలు జరిగినట్టు గుర్తించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇటువంటి అక్రమాలకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తోందని మంత్రి చెప్పారు.
రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకాన్ని నూతన మార్గదర్శకాలతో రూపొందించినట్లు చెప్పారు. క్యూఎస్ ర్యాంకింగ్ పొందిన 200 ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన నిరుపేద విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన వారికి పూర్తిగా, 100 నుంచి 200 ర్యాంకింగ్‌లో ఉన్న విద్యాలయాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు రూ.50 లక్షల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనున్నట్లు తెలిపారు. సంతృప్త స్థాయిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.
తప్పు చేసిన బాబు కుప్పి గంతులా!
Published Fri, Jul 15 2022 5:10 AM | Last Updated on Fri, Jul 15 2022 5:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment