‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’ | Minister Chelluboina Venugopala Krishna Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’

Published Wed, Mar 6 2024 10:28 AM | Last Updated on Wed, Mar 6 2024 3:18 PM

Minister Chelluboina Venugopala Krishna Comments On Chandrababu - Sakshi

బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు

2014లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశావూ బాబూ!

అదే హామీలతో సరికొత్త బీసీ డిక్లరేషన్ పేరుతో బాబు పవన్‌ల కొత్త వేషం

బీసీ బిడ్డలు ఇంగ్లీష్ విద్యను ఎందుకు అడ్డుకున్నావు బాబూ

బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో ఇంజనీర్లు, డాక్టర్లైన బీసీలు

బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్న సీఎం జగన్‌

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

సాక్షి,  తూర్పుగోదావరి: సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్‌  బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.

మంత్రి శ్రీ  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో ఏం మాట్లాడారంటే:

చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ఒక కాపీ, పేస్ట్. 
ప్రతి ఐదేళ్లకు ఒకసారి బీసీలను మోసం చేయటం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలసి బీసీ డిక్లరేషన్‌ అని మరోసారి మోసపూరిత వాగ్దానాలు ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాలు, లక్ష్యాలు అన్నీ ఆయనతోనే వెళ్లిపోయాయి. 1995 తరువాత ఎన్టీఆర్ ఆశయాలను ఒక అత్యాశపరుడు తుంగలోకి తొక్కాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలను విస్మరించి.. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ, పేస్ట్ ప్రోగ్రాంను చంద్రబాబు ప్రదర్శించాడు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదు. బీసీలను అతిఘోరంగా టీడీపీ మోసగించింది. 1995 నుంచి 2004లో వరకు బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులపై చంద్రబాబు ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు. బీసీలు పేదరికం నుంచి ఎదగాలంటే.. విద్యమాత్రమే మార్గమని రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ బీసీలను దగా చేసిన వారిలో ప్రప్రథముడు చంద్రబాబే. 2014లో బీసీల కోసం 142 హామీలు చంద్రబాబు ఇచ్చారు. జనం మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఒకవేళ చంద్రబాబు మర్చిపోయారేమో ఆ మేనిఫెస్టో తెప్పించుకుని చూడండి. 2014లో 142 హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు చేయలేదు. 

ప్రతి ఐదేళ్లకో ఒక వేషం వేసి బీసీలను చంద్రబాబు మోసం చేస్తాడు
ప్రతి ఐదేళ్లకు ప్రజలను మోసం చేయటానికి చంద్రబాబు ఒక వేషం వేస్తుంటాడు. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. ఉచిత విద్యుత్ అంటే కాల్పులు జరిపించి.. మళ్లీ ఉచిత విద్యుత్ ఇస్తానని చంద్రబాబు నోట వైఎస్ఆర్‌ అనిపించారు. వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు చంద్రబాబు ఏమి విమర్శలు చేశారో గుర్తు చేసుకో. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. బీసీల వెనుకబాటుతనానికి కారకుడు, బీసీల ద్రోహి చంద్రబాబే. 1992లో ఆర్థిక సంస్కరణలు వస్తే.. 1997లో ఐటీ బూం వస్తే.. బీసీ విద్యార్థి, యువకుడు ఐటీలోకి రాలేకపోయారు. 2007లో వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టిన తరువాతే బీసీ బిడ్డ ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత విద్యలు చదివారు. 

చంద్రబాబుది మనువాదం అయితే జగన్‌ది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ దారి 
బీసీలను బానిసలుగా చూడటానికి కులవృత్తులను చంద్రబాబు ప్రోత్సహించాడు. రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను జగన్‌ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం మను సిద్దాంతాన్ని అనుసరిస్తున్నారు. కల్లుగీత గీసుకునేవారు.. అదే వృత్తి చేయాలి. నేత నేసుకునేవారు  దానికే పరిమితం కావాలి. అలా బీసీలు కులవృత్తులకే పరిమితం అవ్వాలి తప్ప సమాజంలో ఎదగకూడదనేది చంద్రబాబు నిజస్వరూపం. 

బీసీల తోకలు కత్తిరిస్తా... జడ్జిలుగా బీసీలు పనికిరారు అన్నావ్
బీసీ కులాల్లో ఉపకులాలు చంద్రబాబు నోట వచ్చింది. మరి, గతంలో నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తాను, జడ్జీలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు అన్నారు. ఇవేమీ ప్రజలు మరిచిపోలేదు. 

సీఎం జగన్ హయాంలో బీసీలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు
బీసీలు సమాజానికి వెన్నెముక అని వారి వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పిన నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే. బీసీ డిక్లరేషన్ ఇచ్చి ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు జగన్. బీసీల ఆత్మగౌరవం ఎక్కడా తాకట్టు పెట్టకుండా.. కుదవ పెట్టకుండా.. రక్షించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. 

సీఎం జగన్ హయాంలో లక్షా 73 వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో నేరుగా..
డీబీటీ ద్వారా రూ.4.38లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. బీసీల కోసమే రూ.1.73 లక్షల కోట్లు లబ్ది బీసీల ఖాతాల్లో నేరుగా చేర్చింది సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అది బీసీలకు తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు సబ్ ప్లాన్ పేరిన ఒక డ్రామా ఆడాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల ముందు కూడా ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు ఇచ్చి అంటగట్టాలని అనుకున్నావు. రోజూ లోకేశ్, చంద్రబాబు 34% రిజర్వేషన్లు ఉన్నాయి అని చెబుతారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణను పి.వి.నరసింహారావు 33.3% అమలు చేశారు. దానికి మరో 0.7% కలిపి 34% అని చంద్రబాబు చెబుతారు. 2014-19 మధ్యన స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహించని కారణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్‌ పాలకుడు అఫిడవిట్‌ ఇచ్చారు. అతనికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు. 34% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రతాపరెడ్డి అనే అతన్ని సుప్రీంకోర్టుకు పంపి రిజర్వేషన్లు అడ్డుకుంది బాబు కాదా? స్థానిక సంస్థల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి.. 50% రిజర్వేషన్లు.. నామినేటెడ్ పోస్టులు, దేవాలయ ఛైర్మన్లలోనూ సీఎం జగన్ ప్రకటించి అమలు చేశారు. 

సీఎం జగన్‌ కులగణన చేయించారు.. త్వరలోనే ప్రకటన చేస్తారు
ఒక అబద్ధం చెప్పేసి వెళ్లిపోతే ప్రజలు మర్చిపోతారు అని చంద్రబాబు అనుకుంటారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి అనుకుంటారు. ప్రజలు మర్చిపోరు. చంద్రబాబును మర్చిపోయేలా బీసీలే చేస్తారు. కులగణన ఎందుకు చేస్తున్నారని పవన్ కల్యాణ్‌ చేత చంద్రబాబు ప్రకటన చేయించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. త్వరలో కులగణన మీద సీఎం జగన్ ప్రకటన చేస్తారు. 

బీసీ బిడ్డలు ఇంగ్లీష్ చదవకూడదా... ఎందుకు అడ్డుపడ్డావ్ 
బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు. చంద్రబాబు చేసిన ప్రతి పనిలో బలైంది బీసీలే. ఈ విషయంలో అచ్చెన్నాయుడు వాపోతున్నారు. తప్పులు చేయించింది చంద్రబాబు న్యాయస్థానం ముందు దోషిగా అచ్చెన్నాయుడును నిలబెట్టాడు. ఈరోజు తప్పులు చేసిన చంద్రబాబును కూడా సీఎం జగన్ దోషిగా నిలబెట్టారు. అడ్డదారిలో వచ్చిన లోకేశ్ కూడా వేల సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిందని హాస్యాస్పదం. అసలు బీసీల జీవితాలు మారింది.. ఆనాడు వైఎస్ఆర్‌ నేడు వైఎస్ జగన్ వచ్చిన తరువాతే. బీసీల జీవితాలు మారాలంటే విద్య అందాలి. ఇంగ్లీషు మీడియం అందాలి. ఇంగ్లీషు మీడియం పెడితే గగ్గోలు ఎందుకు పెట్టారు. నీ మనవడు ఇంగ్లీషులో చదవాలి. బీసీ బిడ్డ ఇంగ్లీషులో చదివితే ఎదిగిపోతాడని  నీ భయమమా? ఒక్కసారి ఈ విషయం బీసీలు ఆలోచించాలి. 

సీఎం జగన్ కేబినెట్‌లో పదిమంది బిసీ మంత్రులున్నారు
ఇవాళ కేబినెట్‌లో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలు ఉన్నారు. యాదవ, కురుబ సామాజిక వర్గాలు లోక్‌సభ, పార్లమెంట్‌లో ఉన్నారు. ఆ సీట్లను చంద్రబాబు తన సామాజిక వర్గానికి అమ్ముకున్నారు. బీసీ అయిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌ చేశారు. డిప్యూటీ సీఎంగా ముత్యాల నాయుడును చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? రాష్ట్రంలో 58 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఎమ్మెల్సీలుగా 69% బీసీలకు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 37% మాత్రమే ఇచ్చాడు. ఎమ్మెల్సీలకు బీసీలకు 69% శాతం ఇచ్చిన వైఎస్ఆర్‌సీపీని చంద్రబాబు విమర్శించటం ఏమిటి? అంతెందుకు 6 జిల్లా పరిషత్‌ ఛైర్ పర్సన్‌లుగా బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. మున్సిపాల్టీలలో 44 మంది బీసీలకు (53%) ఛైర్‌పర్సన్‌ పదవులు, 9 మంది బీసీలకు (64%) కార్పొరేషన్లు మేయర్లుగా బీసీలకు అవకాశం వైఎస్ఆర్‌సీపీ ఇచ్చింది. 

139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే
రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించటం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి జగన్‌ గారిపై చంద్రబాబుకు విమర్శలు చేయటం ఏమిటి? చంద్రబాబుకు సిగ్గులేదు. కుల కార్పొరేషన్లు గురించి చంద్రబాబు మాట్లాడటం ఏమిటి? ఎప్పుడూ ఒక్కటే అబద్ధాన్ని చంద్రబాబు వల్లె వేస్తున్నారు. 56 కార్పొరేషన్లకు కుర్చీలు లేవంట. సీట్లు లేవంట. మీడియా మిత్రులు లారా రండి. వారు ఎంతో హుందాగా ఉన్నారో.. బీసీ భవన్‌ ఎలా ఉందో చూపిస్తాం. చులకన చేసిన వాడు గొప్పవాడు.. గొప్పగా చూసేవాడు.. చులకన చేసినట్లు అని..  కొత్త భాష్యం.. కొత్త భాషతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్‌ నభూతో నభవిష్యత్ అని దేశమంతా చెప్పుకుంటోంది. కులగణన, సోషల్ ఇంజనీరింగ్‌లో జగన్ గారికి ఎవ్వరూ సాటి లేరు. 

4% సామాజిక వర్గానికి 21 సీట్లు 45% బీసీలకు 18 సీట్లా బాబూ!
అంతెందుకు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే చూస్తే.. 4% ఉన్న చంద్రబాబు సామాజిక వర్గానికి 21 సీట్లు.. 45% ఉన్న బీసీలకు 18 సీట్లు కేటాయించారు. చంద్రబాబు దృష్టిలో కులం అంటే తన సామాజిక వర్గమే.  తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్‌ను కలిపేసుకుని బీసీలను అణగదొక్కేయవచ్చనేది చంద్రబాబు ఆలోచన. కానీ, కాపులు విజ్ఞులు. ఈ జిల్లాలో 2008, 2024లోనూ బీసీలు, శెట్టి బలిజలు, గౌడలు, యాదవులు, దేవాంగులు, కుమ్మరి, కమ్మరి, ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు చంద్రబాబుకు కళ్లు తెరిపించటానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్, రామచంద్రపురం, పాలకొల్లు, నర్సాపురం పార్లమెంట్‌ బీసీలకు జగన్ కేటాయించారు.

కాపులను బీసీల్లో చేరుస్తానని వికృత క్రీడతో చంద్రబాబు మోసగించారు. అంతేకాదు.. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు హింసించాడు. డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని బాబు చేసిన ప్రయత్నాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ఒక కాపీ, పేస్ట్. మళ్లీ బీసీలను దగా చేయటానికి వంచించటానికి బాబు ప్రకటించిన డిక్లరేషన్. అసలు ఏ హామీ అమలు చేయని పార్టీకి డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత టీడీపీకి లేదు. దానికి వత్తాసు పలికే జనసేనకు అసలు లేదు. టీడీపీ వల్ల బాధించబడింది బీసీలే. రాజకీయ నాయకుడు అంటే అబద్ధం అని ఏమీ నెరవేర్చరని నాడు అనుకున్నారు. కానీ, నేడు  చెప్పినవన్నీ జగన్‌ నిజం చేస్తు్న్నారని ప్రజలు అనుకుంటున్నారు. 

బీసీలకు విద్యను అందకుండా చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు
విద్యా విధానం విషయంలో బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబే. నేడు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చటం నుంచి గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, విదేశీ విద్య ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. ఆకాశాన ఉమ్మేసినట్లే. చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను బీసీలే తిప్పికొడతారు. గతంలో మేనిఫెస్టోను దాచేసిన చంద్రబాబు మళ్లీ బీసీలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని రక్షించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఈ విషయాన్ని బీసీలు గుర్తించాలి. ఇచ్చినమాట నెరవేర్చని వ్యక్తి.. ఎన్నికకో అబద్ధం చెప్పేవాడి పట్ల తస్మాత్ జాగ్రత్త. బీసీ బిడ్డగా బీసీలు మరోసారి మోసపోవద్దని కోరుతున్నా. 

మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ
ఈరోజు రాష్ట్రంలో బీసీలు తలెత్తుకుని తిరుగుతున్నారు. బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు. అందువల్లే బీసీల వాణిని వినిపించటానికి నాలాంటి వారు ముందుకు వచ్చారు. 
చంద్రబాబు వేల మంది చనిపోయారని,బీసీలను అణగదొక్కారని అంటున్నారు. అచ్చెన్నాయుడు చేత తప్పులు చేయించింది చంద్రబాబు. ప్రజాధనం దుర్వినియోగం చేసి చంద్రబాబుకు అచ్చెన్నాయుడు అందజేస్తే ఆయనకు శిక్షపడింది.

ఇదీ చదవండి: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement