సిరిసిల్ల/నర్సాపూర్: తెలంగాణలో గల్ఫ్ కార్మీకుల కోసం ప్రత్యేక గల్ఫ్ పాలసీని తెస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. గల్ఫ్ కార్మికులకు రైతుబంధు తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మీకులు చనిపోతే, వారి కుటుంబాలకు రూ.5 లక్షలిస్తామన్నారు. జనవరిలో సమగ్ర గల్ఫ్ పాలసీ తెచ్చి వలస కార్మీకుల సంక్షేమానికి బాటలు వేస్తామని చెప్పారు.
దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మీకులుంటే ఏ రాష్ట్రంలోనూ పెన్షన్ ఇవ్వడం లేదని, తెలంగాణలోనే ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మీకుల పీఎఫ్ కటాఫ్ తేదీని మార్చి మరో లక్ష మందికైనా పెన్షన్ ఇస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, వాటిపై 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలు, సభల్లో మాట్లాడారు. ‘ఇవి మామూలు ఎన్నికలు కావు. మార్చిలో ఫెయిలైతే సెప్టెంబరులో రాసే పరీక్షల్లాంటివి కాదు.
ఐదేళ్లు మీ తలరాతను రాసే ఎన్నికలు. ఆగం కావద్దు.. సంక్షేమం.. అభివృద్ధి కొనసాగాలంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలి’అని కేటీఆర్ చెప్పారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, ధరణి తీసేసి భూమాత తెస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, మళ్లీ దళారీ వ్యవస్థను తేవాలని చూస్తున్నారని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయానికి మూడే గంటల కరెంట్ చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, పొరపాటున కాంగ్రెస్ వస్తే.. మళ్లీ పవర్ హాలిడేలు.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడాలు ఉంటాయన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కరెంటు కనిపిస్త లేదంటున్నాడని, ఎక్కడైనా కరెంటు కనిపిస్తదా అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కరెంటు లైన్‌ను పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తుందని, షాక్ కొట్టి పోతే రాష్ట్రానికి దరిద్రం పోతుందన్నారు. రైతులకు రూ.14 వేల కోట్ల రుణమాఫీ అయిందని, ఇంకా కొంత పెండింగ్‌లో ఉందని అది కూడా పూర్తవుతుందని చెప్పారు. రైతుబంధు ఒకటి, రెండురోజుల్లో జమ అవుతుందని వివరించారు.
మోదీ 15 లక్షలు వేశారా?
ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు డ్రామాలు వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 2014లో తమ ప్రభుత్వం రాగానే అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ఎవరి ఖాతాల్లోనైనా పైసలు పడ్డాయా అని ప్రజలను ప్రశ్నించారు. అలాగే, గ్యాస్ ధర తగ్గిస్తామని చెప్పి, రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1,200కు పెంచారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే రూ.400కే సిలిండర్ ఇచ్చి మిగిలిన రూ.800 తమ ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారని 50 ఏళ్లలో 11 సార్లు చాన్స్ ఇస్తే ఏం చేశారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని, బీసీ బిడ్డ గాలి అనిల్‌కుమార్ గొంతు కోసి టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో నర్సాపూర్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment