Khammam District: Minister Puvvada Ajay Kumar Progress Report - Sakshi
Sakshi News home page

వాడ వాడ పువ్వాడ! కానీ, రంగంలోకి పొంగులేటి వస్తే పరిస్థితి ఏంటి? గ్రౌండ్ వర్క్ మొదలైందా?

Published Mon, Feb 6 2023 4:34 PM | Last Updated on Mon, Feb 6 2023 6:48 PM

Minister Puvvada Ajay Kumar Progress Report Khammam District - Sakshi

ఖమ్మం జిల్లా కేంద్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. జిల్లాలోని కీలక నేతలు ఖమ్మం సీటు మీదే గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రత్యర్ధి ఎవరైనా బలంగా ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వాడ. కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. మంత్రి వువ్వాడ అజయ్ గురించి ఖమ్మం ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? 

పొలిటికల్ హాట్ సీట్
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్గా మారబోతోంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాలనే ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వాడ వాడ పువ్వాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో జనంకి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మతోన్మాద పార్టీలకు ఖమ్మంలో చోటు లేదనే స్లోగన్ తో ముందుకు సాగుతున్నారు.

బీజేపీ నుంచి ఒకవేళ గట్టి అభ్యర్థి బరిలో ఉన్నా గెలుపోందే విధంగా పక్కా కార్యాచరణ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ..2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2004లో సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం గెలుపొందారు. గత నాలుగు ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మంలో బలంగా ఉన్న కమ్మ, మైనార్టీ, కాపు వర్గాల్లో రెండు సామాజికవర్గాలు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీకే విజయం దక్కుతుంది.

కన్నేసిన పొంగులేటి
ఇదిలా అంటే బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. పొంగులేటి బీఅర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారు అయినప్పటికీ... ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఏ పార్టీలో చేరతారన్న విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరుల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు.

అయితే పొంగులేటి అనుచరుల్లో మెజారిటీ మాత్రం ఖమ్మం నుంచే పోటీ చేయాలని గట్టిగా సూచిస్తున్నారు. జనవరి ఒకటో తారీఖున నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా ఖమ్మం నుంచే పోటీ చేయాలని కోరారు. అందువల్ల ఖమ్మంకే తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది.

చేతి పార్టీలో ఎవరు?
మరో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం నియోజవర్గంపై సీరియస్ గా గురిపెట్టింది. అయితే అజయ్ లాంటి బలమైన నేతను ఢీకొట్టడానికి ప్రస్తుతం కాంగ్రెస్లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. అందుకే మాజీ ఎంపీ రేణుకచౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఖమ్మంలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని కూడా రేణుక చౌదరి ప్రారంభించారు.

కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం.. లోకల్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం బలంగా ఉండటంతో రేణుక చౌదరి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో లోకల్ గా గ్రూపుల గొడవలు ఉండటంతో వ్యతిరేక వర్గం రేణుకకు ఏ మేర సపోర్ట్ చేస్తుందన్న అనుమానాలూ ఉన్నాయి.

కారుతో కమ్యూనిస్టుల జోడి
ఇక బీజేపీకి కూడా ఖమ్మం నియోజకవర్గంలో బలమైన నేతలు ఎవరూ లేరు. ఇతర పార్టీల నుంచి నేతలు చేరితే తప్ప ఖమ్మంలో కాషాయపార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిజెపి బలం పెరిగే అవకాశం ఉంది. పొంగులేటి పోటీ చేస్తే అజయ్ కు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగానే ఉన్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీఅర్ఎస్తో పొత్తు దాదాపు ఖరారైంది. ఇది గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ , 8 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నూతన బస్టాండ్, ఐటీ హబ్, గొల్లపాడు చానల్ ఆధునీకరణ, నూతన కార్పొరేషన్ భవనం, సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలు వంటివి అజయ్ కుమార్‌కు కలిసి వచ్చే అంశాలే.

ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంను ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్లకు విస్తరింపచేశారు. రఘునాధపాలెం మండలం సాగు నీటి సమస్య తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టు చేపట్టారు. కాని ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో  రైతులకు సమస్యగా మారింది.

ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుండటంతో.. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే వర్షాకాలం వరద ముంపు సమస్య పరిష్కారం అవుతుందని..అందువల్ల ఆ విషయాన్ని ఆలోచించాలని నగరవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
చదవండి: పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా?

కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారన్న టాక్ సైతం లోకల్ గా వినిపిస్తోంది. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదనే వార్నింగ్లు ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు సైతం మంత్రికి ఇబ్బందులు తెస్తున్నాయి. 

కీలక నేతల చూపు ఖమ్మం అసెంబ్లీ సీటు వైపు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం హట్ సీట్ గా మారనుంది. ఏ పార్టీ అయినా ఖమ్మం  అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని రంగంలో దించితే దాని ఎఫెక్ట్ పాలేరు, వైరా స్థానాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement