పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు: ఆర్కే రోజా | Minister RK Roja Slams Pawan Kalyan For JSP Seat Sharing With TDP - Sakshi
Sakshi News home page

పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు: ఆర్కే రోజా

Published Sat, Feb 24 2024 3:27 PM | Last Updated on Sat, Feb 24 2024 6:47 PM

Minister Roja Slams On Pawan Kalyan Over TDP Seat Sharing - Sakshi

సాక్షి, తిరుపతి:  పవన్‌ కళ్యాణ్‌ పార్టీ ఎందుకు పెట్టారు? పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. శనివారం మంత్రి ఆర్కే రోజా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘24 సీట్లకే పవన్‌ ఎందుకు తల ఊపారో చెప్పాలి. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్‌ చెప్పాలి. పవర్‌ స్టార్‌.. పవర్‌లేని స్టార్‌ అయ్యారు. ఎవరితో పొత్తుపెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిది. పవన్ ఎక్కడ నుంచి   పోటీ చేయాలో తెలియని దుస్థితి.  రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా  ఆలోచించారా?’ అని మంత్రి రోజా మండిపడ్డారు.

టీడీపీ-జనసేనలో ఏడుపులు... వైఎస్‌ఆర్‌సీపీలో డబుల్‌హ్యాపీ
టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేసిన తర్వాత, మా పార్టీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టుగా... వై నాట్‌ 175 ఎందుకు రీచ్‌ కాలేమనేది ఎవరికీ డౌట్‌ లేదు. ఖచ్చితంగా మేము 175 స్థానాలకు 175 గెలుస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ అభ్యర్థుల జాబితా రిలీజ్‌ అయినప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటారు. అదేంటో గానీ.. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల జాబితా రిలీజ్‌ చేశాక ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఏడ్చుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం డబుల్‌ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు.

పావలా శాతం సీట్లు తెచ్చుకోలేని పవర్‌ లెస్ స్టార్
ఆ రెండు పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను చూశాక.. అసలు, పవన్‌కళ్యాణ్‌ ఎందుకు పార్టీ పెట్టాడో కూడా అర్ధం కావట్లేదు. ఇది మాకే కాదు. జనసేన నాయకత్వానికి, కార్యకర్తలకూ ఏమీ అర్ధం కాని పరిస్థితిలో, వారంతా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే, నిన్నటివరకూ.. పవర్‌ షేరింగ్‌.. సీట్‌ షేరింగ్‌.. ఓట్‌ షేరింగ్‌ అని పవన్ కల్యాణ్ ప్రగల్భాలు పలికాడు. తీరా పావలాశాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్‌స్టార్‌. వీటన్నింటినీ చూసి.. పవన్‌కళ్యాణ్‌ను పవర్‌స్టార్‌ కాదు.. పవర్‌ లెస్ స్టార్‌ అని ప్రజలు అంటున్నారు.

ఆ కుక్క బిస్కెట్లకు ఎందుకు తోక ఊపావు..?
2019లో అనుకుంటా.. ఓ సభలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ... తన పార్టీని తెలుగుదేశం ఎలా చూస్తుందో చెప్పుకొచ్చాడు. "జనసేన అంటే కుక్క బిస్కెట్లు పడేస్తే తోకూపుకుంటూ మన వెనుక తిరుగుతారు.. వీళ్లకు పది సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం పార్టీ నేతలు మనల్ని అవమానిస్తున్నారని" ఆయన తన కార్యకర్తలకు గుర్తుచేస్తూ వీరావేశంతో మాట్లాడారు. "తన పార్టీ ప్రజల కోసం పుట్టిందని.. ఎవరి బిస్కెట్లకూ తలవొంచబోమని" బీరాలు పలికాడు. అవసరమైతే, మనమే వాళ్లకు ఎన్ని కావాల్నో అన్ని సీట్లు ఇస్తామంటూ చాలా పెద్ద పెద్ద మాటలు, కోతలు కోశాడు. మరి, ఈరోజు కేవలం 24 సీట్లకు కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపుకుంటూ వెళ్లినట్టు .. చంద్రబాబుతో కలిసి ప్రెస్‌మీట్‌లో ఎందుకు కూర్చున్నాడో ఆయన తన కేడర్‌కు సమాధానం చెప్పాలి.

ఏ ప్యాకేజీ కోసం బాబు కాళ్లు పట్టుకున్నావ్‌..?
"సముద్రం ఎవరి కాళ్లు పట్టుకోదు.. పర్వతం తలవంచదని" పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన పవన్ కల్యాణ్.. మరి, ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకున్నావు..? ఆయన విసిరిన ముష్టికి ఎందుకు తలవంచావో సమాధానం చెప్పమని జనసేన కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా నిన్ను నిలదీస్తున్న పరిస్థితి.

ఎవరి చంకనెక్కాలో తెలియని గందరగోళం వారిది
40 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. విజన్‌.. విస్తరాకుల కట్ట.. కేంద్రంలో చక్రం తిప్పానని డబ్బాకొట్టుకునే చంద్రబాబు.. సినిమాల్లో పవర్‌స్టార్‌ అని చెప్పుకుంటూ.. బయట మాత్రం పవర్‌లేని స్టార్‌గా తిరుగుతూ బీరాలు పలికే పవన్‌కళ్యాణ్‌ ... వీరిద్దరూ జగన్ గారిని చూసి వణికిపోతున్నారు. పైకి కనిపించని భయం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఎటూ ఎదుర్కోలేమని.. ఆయన్ను ఓడించలేమని .. పొత్తులతో అయినా ఆయన్ను దించాలని కలలుగంటూ వారు కూటమి కట్టారు. ఇద్దరూ కలిసి కొద్దిసేపేమో బీజేపీ చంకనెక్కాలని చూస్తారు.. బీజేపీ స్పందించేలోగా నే.. మరోవైపు కాంగ్రెస్‌ చంకనెక్కాలనే ప్రయత్నాలూ చేస్తారు. ఎవరూ చంకనెక్కించుకోకపోతే... పిల్ల పార్టీల వైపు కూడా చూస్తారు. వాళ్లల్లో వారికే పెద్ద గందరగోళం నెలకొంది.

పవన్‌ స్థానాన్ని చంద్రబాబు డిసైడ్‌ చేయలేదా..?
చంద్రబాబు స్థానం కుప్పం అని ఆయన ప్రకటన చేసుకున్నాడు. బాలకృష్ణ స్థానం హిందూపురం అని ప్రకటించుకున్నారు. అలాగే, లోకేశ్‌ కూడా మంగళగిరి స్థానమని అనౌన్స్‌ చేసుకున్నారు. కానీ, పవన్‌కళ్యాణ్‌ పోటీ చేసేది ఎక్కడ .. ఏ స్థానంలో నిలబడతాడో కూడా ఇంకా చంద్రబాబు డిసైడ్‌ చేయలేదంటే అర్ధమేంటి..? ఒక చోట ఓడిపోయినోడికి మొదటి జాబితాలో ఇచ్చారు.. రెండుచోట్ల ఓడినోడి గురించి తర్వాత చూద్దాంలే అని అర్ధం చేసుకోవాలి కదా..? తన స్థానంపై ఎందుకింత కేర్‌లెస్‌గా ఉన్నావని పవన్‌కళ్యాణ్‌- చంద్రబాబును అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆ ఇద్దరి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీలేదు..
చంద్రబాబు నాయుడు గానీ.. పవన్‌కళ్యాణ్‌ గానీ ఇద్దరూ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల్ని ఎక్కడా నెరవేర్చలేదు. అలాగే, పవన్‌కళ్యాణ్‌ ఎందుకు పార్టీ పెట్టాడో తెలియదు..? తాను అధికారంలోకొస్తే ప్రజలకు ఏం చేస్తానో కూడా ఇంతవరకూ చెప్పలేదు. ఎంతసేపూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్ని ఎర్రపుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు.. అధికారంలోకొస్తే జైళ్లల్లో పెడతామని ఒకడు.. బట్టలూడదీసి కొడతానని మరొకడు.. ఇలా చెప్పుకుంటూ తిరగడమే తప్ప వీళ్ల వలన రాష్ట్రానికేమైనా ప్రయోజనం ఉందా.. అంటే శూన్యమని చెప్పాలి.

రాష్ట్రాన్ని కాపాడింది ఎప్పుడు బాబూ..?
రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ చెబుతుంటే.. అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేస్తే.. ఆ మూడుసార్లూ ఏనాడైనా రాష్ట్ర భవిష్యత్తును కాపాడాడా..? అని ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక అనుభవశాలిగా చంద్రబాబుకు అధికారమిస్తే.. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాడా..? రాష్ట్రాన్ని నిలువునా అప్పుల్లో ముంచి ప్రజాధనాన్ని దోచుకు తిన్నాడు. స్కామ్‌లతో రాష్ట్ర ఖజానాను దోచుకుని దాచుకున్నాడే తప్ప .. రాష్ట్రాన్ని ఆయన ఏనాడూ కాపాడలేదు. పైగా, రాష్ట్ర భవిష్యత్తును కూడా సర్వ నాశనం చేశాడని రాష్ట్ర ప్రజలంతా ఈరోజు గుర్తుచేసుకుంటున్నారు.

రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన బాబు
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఈ రాష్ట్రం కోసం ఏం చేశాడంటే.. ప్యాకేజీ కోసం ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టాడు. కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని నిలువునా ముంచాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అమరావతిని కూడా పణంగా పెట్టాడు. ఓటుకు నోటు కేసులో దొంగలా దొరికిపోయి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను కేసీఆర్‌కు వదిలేసి దొంగలా పారిపోయి వచ్చాడు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారనుకుంటున్నాడో.. లేదంటే, ప్రజలంతా అమాయకులని భావిస్తున్నాడో.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నామంటూ బాబు కోతలు కోస్తూ.. మాయ చేసే ప్రయత్నానికి తెగించాడు.

కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే
రాష్ట్రంలోని కాపు సోదరులంతా ఇప్పటికే మేల్కొన్నారనుకుంటున్నాను. వంగవీటి రంగాను చంపి.. ముద్రగడ పద్మనాభం గారిని తీవ్రంగా అవమానించడమే కాకుండా వారి భార్యను, కోడలిని అనరాని మాటలతో వేధించి.. ఆయన కొడుకును చిత్రహింసలకు గురిచేసి జైలుపాల్జేసిన తెలుగుదేశం పార్టీ గురించి కాపు సోదరులందరికీ తెలుసు. తుని ఘటనలోనూ కాపు సోదరులపై తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో పవన్‌కళ్యాణ్‌ ముష్టి 24 సీట్లు కోసం పొత్తుపెట్టుకోవడమనేది కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టడమనేది అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

పవన్‌కళ్యాణ్‌ చేసిన పిచ్చి పొత్తుకు సంబంధించి.. ఇన్నాళ్ళూ ఆయన సభల్లో సీఎం సీఎం.. అని కేకలేసిన జనసేన సైకోలకు వాళ్ల తలలు ఎక్కడ పెట్టుకోవాల్నో కూడా అర్ధంకాని పరిస్థితి నెలకొంది. పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి పొలిటికల్‌ లీడర్‌గా అసలు పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు. ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద గౌరవం లేదన్న సంగతి అందరూ గ్రహించాలనే విషయం నేను అనేక సందర్భాల్లో గుర్తుచేశాను.

2024ఎన్నికల తర్వాత ఆ ఇద్దరికీ శాశ్వత రెస్ట్‌

చెప్పిన మాట మీద నిలబడలేని.. ఇచ్చిన మ్యానిఫెస్టోకు కట్టుబడని నేత చంద్రబాబు. అలాగే, పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో.. ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచే ప్రజలకు అర్ధమైపోయింది. పార్టీ పెడతాడు..గానీ ఎక్కడా పోటీచేయడు. సింగిల్‌గా పోటీ చేస్తానని దిగితే పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయాడు.బీజేపీతో పొత్తులో ఉన్నానంటూ ఎన్డీఏ సమావేశాల్లో పాల్గొంటాడు.. ఇప్పుడేమో.. అసలు బీజేపీతోనే సంబంధంలేకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే పవన్‌కళ్యాణ్‌కు ఏమైనా విలువలున్నాయా..? అన్నది అందరూ ఆలోచన చేయాలి.

స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయిన సందర్భంలో.. కోర్టులో చంద్రబాబేమో నాకు హెల్త్‌ బాగలేదు.. రెస్టు కావాలన్నాడు. నిన్న కుప్పంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా "మా ఆయనకు రెస్టు కావాలన్నారు." సో.. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు రాజకీయాల నుంచి శాశ్వతంగా రెస్టు ఇవ్వడానికి రాష్ట్రప్రజలు సిద్ధంగా ఉన్నారు.

కాలరెగరేసి గర్వంగా తిరగ్గలిగే నాయకత్వం జగనన్నది..
ఒక కార్యకర్త గానీ.. నాయకుడు గానీ గౌరవంగా ఉండాలంటే అది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో జగనన్న నాయకత్వంలోనే సాధ్యమన్న విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. సొంత జెండా.. సొంత అజెండాతో ప్రజలకు మంచి చేస్తూ.. నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడ్ని .. కార్యకర్తనని కాలర్‌ ఎగరేసి గర్వంగా చెప్పుకుని మా పార్టీ కేడర్ గ్రామాలు, వార్డుల్లో తిరిగే విధంగా మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి పరిపాలన చేస్తున్నారు. అదే తెలుగుదేశం, జనసేన పార్టీ కేడర్‌ గ్రామాల్లో వార్డుల్లోకి వెళ్లి ప్రజల్ని కలవడానికి భయపడే పరిస్థితి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement