గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకే చంద్రబాబు గంజాయి, డ్రగ్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్క్‌లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని దీక్షా శిబిరం తీర్మానించింది.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ, చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడి సంక్షేమ పథకాలను అనుకరిస్తున్నారని చెప్పారు. టీడీపీ కార్యాలయం దేవాలయం కాదని, అది ఒక దెయ్యాల కొంప అని ఎద్దేవా చేశారు.
బాబు చుట్టూ ఉన్న వాళ్లంతా నాయకులు కాదని, రౌడీలు, గుండాలని పేర్కొన్నారు. చంద్రబాబు పెయిడ్ అర్టిస్ట్‌లను పెట్టుకుని సీఎం వైఎస్ జగన్‌ను తిట్టిస్తున్నారన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు పారిపోయారని పేర్కొన్నారు. అంపశయ్య మీద ఉన్న పార్టీని కాపాడుకునేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సింహమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఆయన గ్రామ సింహమని పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్‌లను, నెలవారి జీతగాళ్లను పెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని దుర్భాషలాడడం సరికాదన్నారు.
దీక్షకు న్యాయవాదుల మద్దతు...
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన జనాగ్రహ దీక్షకు న్యాయవాదులు మద్దతు తెలిపారు. కోటంరాజు వెంకటేశ్వర్లు, సీహెచ్ సాయిరాం, పిళ్లా రవి, నరహరిశెట్టి శ్రీహరి, క్రిస్టోఫర్, విష్ణు, కోటయ్య, బెవర ఉమా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీక్షలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గ, ఏపీఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు తంగిరాల రామిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు, నగర అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు, మధిర ప్రభాకరరావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment