
సాక్షి, అమరావతి: చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోందని, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్యాకేజ్‌లను కూడా పెంచామన్నారు. లబ్దిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాలనను సీఎం జగన్ ప్రజలకు చేరువ చేస్తున్నారని , రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కోదండరాం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
దళితుల కోసం చంద్రబాబు ఏనాడైనా పనిచేశాడా అంటూ ప్రశ్నించారు. దళిత రాజధాని అనేది పచ్చి అబద్ధమని, దాని కోసం ఖరీదైన లాయర్లను టీడీపీ పెట్టిందంటే ఎలా నమ్మారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం, హరగోపాల్ ఎలా పడ్డారో అర్ధం కావడం లేదని తెలిపారు. చంద్రబాబు తనకి అనుకూలమైన వారి భూములు గ్రీన్ జోన్ వెలుపల, అనుకూలం కాని వారి భూములు గ్రీన్ జోన్ పరిధిలో పెట్టినపుడు వాళ్లేందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. అంబేద్కర్ పేరిట జిల్లా ఉండాల్సిందేనని మహానాడులో చంద్రబాబు తీర్మానం ఎందుకు చేయలేదని, కోనసీమలో జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వ్యతిరేకించలేదడం లేదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment