
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ అంటూ టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘ఫ్లోరోసిస్ భూతాన్ని నల్లగొండ బిడ్డలకు శాపంలా ఇచ్చిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ, ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్‌ఎస్ పార్టీల మధ్య పోటీనా?’అని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీని విశ్వగురుగా పేర్కొంటూ మహాత్మాగాంధీని కించపరిచేలా జరుగుతున్న ప్రచారంపైనా కేటీఆర్ మండిపడ్డారు. ‘ప్రపంచమంతా ముక్తకంఠంతో విశ్వగురుగా గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీ. లక్షల సంవత్సరాల పాటు స్వయం ప్రకటిత విశ్వగురు, గాడ్సేను ఆరాధించే ఆయన శిష్యులు మహాత్ముడిని ఎంతగా అవమానించినా, ఆయన భావజాలాన్ని కించపరిచేందుకు ప్రయత్నించినా విజయం సాధించలేరు’అని పేర్కొన్నారు. కాగా, యూ ట్యూబ్‌స్టార్ గంగవ్వను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ త్వరలో ‘మై విలేజ్ షో’లో గెస్ట్‌గా పాల్గొంటానని కేటీఆర్ మరో ట్వీట్‌లో ఆమెను కలిసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment