నెల్లూరులో జనసేన శ్రేణుల పరిచయ కార్యక్రమంలో జానీ మాస్టర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ, జనసేన పొత్తులో టికెట్ అంశం కుంపటి రాజేస్తోంది. పొత్తులో భాగంగా నెల్లూరు నగర సీటును జనసేన ఆశిస్తోంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డికి టికెట్ ఇస్తారని గతంలో ప్రచారం జరిగింది. నాదెండ్ల మనోహర్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలతో పాటు ఆర్థికపరమైన లావాదేవీలు ఉండడంతో తప్పకుండా సీటు జనసేనకేనన్న ధీమా ఉంది.
దీంతో ఆయన నగర నియోజకవర్గంలో సొంతంగానే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే టీడీపీ మాత్రం నగర సీటు మాజీ మంత్రి నారాయణకేనని చెబుతుండడంతో ఇరు పార్టీల్లోనూ సందిగ్ధం నెలకొంది. మరోవైపు జనసేన తరపు నుంచి జానీమాస్టర్ పేరు తెరపైకి రావడంతో మరింత అయోమయం నెలకొంది. దీని వెనుక రాజకీయం నెరుపుతున్నది టీడీపీయేనన్నది బహిరంగ రహస్యమని జనసేన నేతలు మండి పడుతున్నారు.
అనూహ్యంగా తెరపైకి జానీ మాస్టర్
నెల్లూరుకు చెందిన సినిమా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా జనసేన తరుపున తెరపైకి వచ్చాడు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన జానీ మాస్టర్ నెల్లూరులోనే మకాం వేసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తల దీక్షలోకి ఎంట్రీ ఇచ్చి మీడియా ముందుకు వచ్చారు. రెండ్రోజుల క్రితం నెల్లూరులో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు.
జనసేనలో అగ్గి రాజేసిన టీడీపీ
నగర సీటుపై జనసేన కన్నేసిన క్రమంలో ఆ పార్టీ నేతల మధ్య టీడీపీ అగ్గి రాజేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్న మనుక్రాంత్‌రెడ్డి నగర సీటు ఆశిస్తున్న క్రమంలో అతన్ని తప్పించేందుకు నారాయణ అనుకూల టీం ఎత్తుగడ వేసింది. మనుక్రాంత్‌ను నెల్లూరు నగరం నుంచి రూరల్ వైపు మళ్లించేలా ప్రయత్నాలు చేసింది. ఇది పసిగట్టిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రంగంలోకి దిగి మనుక్రాంత్‌తో రహస్య చర్చలు జరిపారు. రూరల్ సీటు వైపు కన్నెత్తి చూడొద్దని, నారాయణ కంటే తానే ఎక్కువగా ఉపయోగపడతానని మనుక్రాంత్‌కు హితోపదేశం చేశారని తెలిసింది.
మరోవైపు నారాయణ టీం స్వయంగా రంగంలోకి దిగి తన సామాజిక వర్గ కీలక నేతల ద్వారా పవన్ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపింది. నగరం కాకుండా రూరల్ సీటుపై దృష్టిపెడితే అందుకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు అభ్యర్థికి కావాల్సిన ఎన్నికల ఖర్చు తనదేనంటూ సందేశం పంపారు. దాంతో పాటు మనుక్రాంత్‌కు నాదెండ్ల వర్గం ముద్రవేసి ఎప్పుడైనా పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని చాడీలు చెప్పి అతన్ని తప్పించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పసిగట్టిన నారాయణ వ్యతిరేకవర్గం పవన్‌కు సన్నిహితుడిగా ఉన్న జానీమాస్టర్‌ను ఉసిగొల్పింది.
జానీతో మైండ్ గేమ్
నెల్లూరుకు చెందిన జానీమాస్టర్‌తో ప్రస్తుతం నారాయణ టీం మైండ్‌గేమ్ ప్రారంభించింది. జానీతో అంటకాగే జనసేనకు చెందిన ఓ చోటా నేత నారాయణ కాంపౌండ్‌కు చెందిన వ్యక్తి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ చోటా నేతకు ఇప్పటికే రూ.30 లక్షల విలువైన వాహనాన్ని ఉచితంగా ఇచ్చారు. జనసేనలోనే ఉంటూ ఆ పార్టీలో జరిగే అన్ని విషయాలు, రహస్యాలను నారాయణకు చేరవేయడం ఆ చోటా నేత పని. జానీ మాస్టర్‌తో అంటకాగుతూ ఎలాగైనా ఆయన్ని నెల్లూరు రూరల్ సీటు వైపు మళ్లించేలా చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ కూడా కేటాయించారన్న ప్రచారం ఉంది.
ఎల్లో మీడియాలో ప్రచారం
ఓ వైపు జనసేనలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోసిన టీడీపీ టీం తాజాగా నెల్లూరు నగర సీటు మాజీ మంత్రి నారాయణకే ఖరారు చేసినట్లుగా టీడీపీ అనుకూల పత్రికలో కథనం రాయించారు. సోషల్ మీడియాల్లోనూ నారాయణకే నెల్లూరు సీటు అంటూ పోస్ట్‌లు పెట్టిస్తున్నారు. నెల్లూరు సీటుపై జనసేన ఒత్తిడి తెస్తున్న క్రమంలో ఇలా లీకులతో మైండ్ గేమ్ ప్రారంభించారు. టీడీపీ మైండ్ గేమ్‌లో చిక్కుకుని జనసేననేతలు విలవిల్లాడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment