న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై లోక్‌సభలో మాట్లాడనందుకే నీరవ్ అనే మాటను వాడాను తప్ప, ఆయన్ను కించపరచడానికి కాదని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రధాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయే సరికి ‘నీరవ్’అనే మాటను వాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు.
నీరవ్‌కు నిశ్శబ్దం అనే అర్థం ఉందన్నారు. పార్లమెంట్‌లో ఎవరినైనా అగౌరవపరచాలనే ఆలోచన తనకు లేశ మాత్రమైనా లేదని చెప్పారు. ఏదైనా మాట అన్ పార్లమెంటరీగా అనిపిస్తే తొలగించేందుకు నిబంధనల ప్రకారం స్పీకర్‌కు అధికారముందని చౌదరి తెలిపారు. ఒకరి ప్రతీకార, అహంకార వైఖరికి తానెందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షం గళం వినిపించకుండా చేసేందుకే బీజేపీ నేతలు పథకం ప్రకారం అనుచిత విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.
తన సస్పెన్షన్‌ను తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు. ఉరితీసిన తర్వాత విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో తనను ఉంచారంటూ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానన్నారు. అనుచిత ప్రవర్తన కారణంతో అధిర్ రంజన్ చౌదరిని గురువారం లోకసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్, ఇండియా ఒక్కటే అయినప్పుడు ప్రధాని మోదీ మాత్రం ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి పేరును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆధిర్ రంజన్ చౌదరి అన్నారు. ‘అంత శక్తిమంతుడైన మోదీకి ఇండియా పదంతో వచ్చిన ఇబ్బందేమిటి? భారత్, ఇండియా రెండూ ఒక్కటేనని రాజ్యాంగం కూడా చెప్పింది. అయినా బీజేపీ నేతలు రెండింటి మధ్య తేడాలు చూపిస్తున్నారు’అని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఘర్షణలకు మణిపూర్ పరిణామాలకు పోలిక లేదని, అక్కడ మానవీయ సంక్షోభం నెలకొని ఉందని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితులు దేశంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రం భావిస్తే పరిష్కరించేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment