టీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ తప్పిందా.. పెద్ద నేతలను ఒకలా చిన్న నేతలను మరోలా చూస్తోందా? స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కమిటీ ఇతర నేతల జోక్యంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందా? టీ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కమిటీ గురించి ఏం చర్చ జరుగుతోంది?
అబ్బే.. వాళ్లు మనవాళ్లు
పార్టీ నేతలు క్రమశిక్షణగా, పార్టీ లైన్ దాటకుండా చూడాల్సిన బాధ్యత క్రమశిక్షణ కమిటీకి ఉంటుంది. చిన్న స్థాయి నేత నుంచి సీనియర్ మోస్ట్ నేతల వరకు ఎవరు పార్టీ గీత దాటినా చర్యలు తీసుకునే అధికారం క్రమశిక్షణ కమిటీకి ఉంటుంది. పార్టీలో అంత పవర్ ఉన్న కమిటీ క్రమశిక్షణ కమిటీ. కానీ ఈ మధ్య ఆ కమిటీ తీసుకున్న క్రమశిక్షణ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కొందరికి అనుకూలంగా, మరి కొందరికి వ్యతిరేకంగా క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిట్టినా.. కొట్టినా మనోడేలే.!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ వేటు వేసింది. బీజేపీ పెద్దలను కలవడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం బహిష్కరణకు కారణాలుగా చూపించింది క్రమశిక్షణ కమిటీ. అయితే, ఇదే సమయంలో మీడియా ఎదుట రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంఛార్జి ఠాగూర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా క్రమశిక్షణ కమిటీ కనీసం షోకాజ్ నోటీసులు జారీ చేయలేకపోయింది.
జూమ్ బరాబర్.. జూమ్ నోటీస్
ఇక ఇదే సమయంలో పార్టీ జూమ్ మీటింగ్‌కు హాజరుకాలేదని 11 మంది అధికార ప్రతినిధులకు నోటీసులు పంపించారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తమ లాంటి చిన్న స్థాయి నేతలకు నోటీసులు ఇస్తున్న కమిటీ పీసీసీని, పార్టీని బాహాటంగా తిడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీ పెద్దలను కలిసారూ కదా అలాంటప్పుడు కోమటిరెడ్డికి కేవలం నోటీసులు ఇచ్చి.. అదే మర్రి శశిధర్ రెడ్డికి కనీసం నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలా చూస్తారంతే.!
ఇక కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ కమిటీ ఉందా అనే అనుమానం కలుగుతుంది. దాసోజు శ్రవణ్, రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు రోజుల కొద్దీ రేవంత్ రెడ్డిని విమర్శించినా కనీసం నోటీసులు ఇవ్వలేని దుస్థితి. పార్టీ నుంచి వారంతట వారు పోయాక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం క్రమశిక్షణ కమిటీ పనైపోయిందన్న చర్చ జరుగుతోంది. ఇక కమిటీలోనూ బోలెడు లుకలుకలు ఉన్నాయనేది మర్రి సస్పెన్షన్ తర్వాత బయట పడింది. మర్రి సస్పెన్షన్ ను క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యామ్ మోహన్ తప్పు పట్టారు. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోకుండా సీనియర్ నేతను సస్పెండ్ చేయడం సరికాదన్నారు శ్యామ్ మోహన్. మొత్తానికి పార్టీ నేతలను క్రమశిక్షణలో ఉంచాల్సిన కమిటీ.. తానే క్రమశిక్షణ తప్పిందన్న అభియోగాలు ఎదుర్కొంటోంది. సొంతంగా వ్యవహరించాల్సి కమిటీ .. కొందరి నేతల కనుసన్నల్లోనే పనిచేయడం వల్ల ఇలాంటి దుస్థితి వచ్చిందంటుంన్నారు గాంధీభవన్ నేతలు.
Comments
Please login to add a commentAdd a comment