భీమవరం కాదు, గాజువాక కాదు..
ఈసారి అసెంబ్లీకి వెళ్లాలంటే పిఠాపురమే దిక్కు
91వేల కాపు ఓటర్ల కోసం పిఠాపురానికి పవన్
సాక్షి, కాకినాడ జిల్లా: ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై జనసేన పార్టీలో సందిగ్ధత నెలకొంది. ఏ చోటకు వెళ్తే అక్కడ పోటీ చేస్తానని నిన్నటి వరకు ప్రకటనలు చేసిన పవన్.. ఎట్టకేలకు పిఠాపురం దగ్గర ఆగిపోయారు.
ఓటు కోసం ఎందాకైనా
2019లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశాడు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ 70 వేలకు పైగా కాపు ఓట్లు ఉన్నాయి. అయినా పవన్‌ను చిత్తుగా ఓడించారు ఓటర్లు. నీకింకా అసెంబ్లీకి వెళ్లే అర్హత రాలేదని సూటిగా ఓటుతో చెప్పేశారు.
ఓడినా అవే చిలుక పలుకులు
- కొండ ఎవరికీ తల వంచదు,
- సముద్రం ఎవరి కాళ్ల వద్దకు పోదు
- జాతీయ జెండాకు ఉన్నంత గుండె ధైర్యం నాకు ఉంది
ఇలాంటి సినిమా డైలాగ్స్ ఈ మధ్య కాలంలో పవన్ నోటి నుంచి చాలా విన్నాం. అబ్బో పవన్ మారిపోయాడని అనుకున్నారు కూడా కొందరు. అదేమీ లేదు కానీ.. అసెంబ్లీకి దారేదీ అంటూ మళ్లీ కాపుల వైపు చూస్తున్నారని ఇవ్వాళ్టి ప్రకటనతో స్పష్టమయింది. పిఠాపురంలో మొత్తం ఓటర్లు 2.28 లక్షలు. ఇందులో 91 వేల మంది కాపు ఓటర్లున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లు చెప్పే చేగువేరా సిద్ధాంతాలు కేవలం చెవుల్లో క్యాబేజీ పువ్వుల్లా పెట్టుకోడానికి తప్ప.. ఓట్లు కావాలంటే మళ్లీ కులాన్ని నమ్ముకోవడమే తన మార్గమని పవన్ చెప్పకనే చెప్పేశాడు.
పవన్ ఓ పార్ట్‌టైం పొలిటిషయన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తవుతోంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ గేటు వరకు కూడా రాలేకపోయాడు. నిత్యం సినిమాల్లో బిజీగా ఉండే పవన్... ఎప్పుడయినా షూటింగ్‌లో బ్రేకప్ ఉంటే, మేకప్ తీసేసి ఓ పొలిటికల్ టూరేసుకుంటాడు. 2009, 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీ చేసిందే లేదు. 2019లో పోటీ చేస్తే ఫలితాలు ఎలా వచ్చాయన్నది ఈ కింది ఎన్నికల సంఘం రికార్డు చూస్తే బాగా అర్థమవుతుంది.
(చదవండి : అజ్ఞాత వాసి పొలిటికల్ సినిమా)
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు
- భీమవరం ఆంజనేయులుకు ఇచ్చేశా
- తిరుపతి సీటు శ్రీనివాసులుకు ఇచ్చా
- గాజువాక టికెట్ టీడీపీ తీసుకుంది
- పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తా
- పొత్తు కోసం నా అన్న నాగబాబు సీటు త్యాగం చేశా
- నా అన్న నాగబాబు కి క్షమాపణ చెప్తున్నా
- 21 సీట్లలో ప్రచారానికి అంగీకరించాడు
- నేను పొత్తు కోసం నా అన్నకు సీటు ఇవ్వడం లేదు
- కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు అండగా ఉన్న వ్యక్తులు ఇవాళ జనసేనకు మూలస్తంభాలయ్యారు
- 150 మందితో ప్రారంభించాం, ఇవాళ 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు నాయకులయ్యారు
- ఒక ఆశయం కోసం వచ్చిన వాణ్ని... ఓడిపోతే శూన్యమనిపించింది
- నేను బద్ధకస్తుడిని కాదని చెప్పడానికే సినిమాల్లోకి వచ్చా
- నేను సమాజం కోసం ఆలోచిస్తే...త్రివిక్రమ్ శ్రీనివాస్ నా కోసం ఆలోచించారు
- నేను రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నచ్చలేదు
- సినిమాలు చేస్తే వచ్చే డబ్బును కౌలు రైతుల సంక్షేమానికి వినియోగిస్తున్నాను
- ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టాలో కూడా నాకు సలహాలు ఇచ్చేస్తారు
- నటుడిగా...ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు
- కుటుంబంలోని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇబ్బంది పెడతారని చాలామంది చెప్పారు
- నేను అధికారం కోసం కాదు...మార్పు కోసం వచ్చా
- వైసీపీపై గానీ...జగన్ పై గానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు
- మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు
- నేను ఎప్పుడూ దేహీ అని అడగను...ఇష్టంగా ఇస్తే మాత్రమే స్వీకరిస్తా
- మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైంది
- బీజేపీ పొత్తుతో కొన్ని సీట్లు త్యాగం చేశాం
- పెద్దమనసుతో వెళ్తే చిన్నవాళ్లం అయ్యాం
- పార్టీ కోసం చాలా మంది కష్టపడుతున్నారు
- కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయా
పిఠాపురం అసెంబ్లీ బరిలో వంగా గీత వర్సెస్ పవన్ కల్యాణ్
- 2009లో పిఠాపురంలో త్రిముఖ పోటీ జరిగింది. అప్పుడు వంగా గీత 1036 ఓట్లతో విజయం సాధించారు.
- 2014లో ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ 47 వేల 80 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- 2019లో వైసీపీ అభ్యర్ధి పెండెం దొరబాబు 14 వేల 92 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఏ రకంగా చూసినా.. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కు విషమ పరీక్షే. పొత్తులో భాగంగా వచ్చిన 21లో పిఠాపురంను ఎంచుకున్నారు కానీ.. పవన్ మనసు నిండా తిరుపతి ఉన్నట్టు అనిపిస్తోంది, ఇప్పుడు పిఠాపురంలో 92వేల మంది కాపు ఓటర్లు ఉన్నా ఓడిపోతే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.
గత ఎన్నికల్లో గ్లాసు బోల్తా.!
- గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ
- గాజువాకలో 16753 ఓట్ల తేడాతో పవన్ ఓటమి
- భీమవరంలో 8357 ఓట్ల తేడాతో పవన్ ఓటమి
గతంలో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు పవన్. పార్టీ అధ్యక్షుడిగా బరిలో దిగి రెండు చోట్లా ఓడిపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు.
(భీమవరం)
(గాజువాక)
Comments
Please login to add a commentAdd a comment