సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నిజాయితీపరుడే అయితే కోర్టు పర్యవేక్షణలో మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని నారా లోకేశ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య) సవాల్ విసిరారు. చంద్రబాబు నిజాయితీపరుడంటూ ఆయన కుటుంబం చెబుతున్న సొల్లు కబుర్లను కట్టిపెట్టాలన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గంధపు చెక్కల దొంగ వీరప్పన్ తాను అడవులను సంరక్షిస్తున్నానంటూ నమ్మబలికినట్లుగానే ఖజానాకు కన్నం వేసి తాను ప్రజల కోసం పని చేస్తున్నానంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ నీతులు వల్లించారన్నారు.
స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబును కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపితే తల్లిని, భార్యను రాజమండ్రిలో రోడ్ల మీద వదిలేసి ఢిల్లీకి ఎందుకు పరిగెత్తావని లోకేశ్‌ను ప్రశ్నించారు. తండ్రిని రక్షించుకోవడానికి ఎవరి కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్లావని నిలదీశారు. దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొనగాడు ఎవరని లోకేశ్ ఆయన డ్రైవర్‌ను అడిగినా చంద్రబాబు పేరే చెబుతారన్నారు. సీమెన్స్ ఇస్తుందని మీరు చెప్పిన రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు. ఖజానా నుంచి కాజేసిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు సిగ్గు లేకుండా టీడీపీ ఖాతాలో వేసుకున్నారని ధ్వజమెత్తారు.
పెడన సభలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చానని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముదినేపల్లికి వచ్చేసరికి మాట మార్చారని పేర్ని నాని గుర్తు చేశారు. ‘నువ్వు ఎన్డీఏలోనే కొనసాగుతుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చావ్? తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో సంప్రదించకుండా ఏకపక్షంగా 32 సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాస్ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఎందుకు కోరావ్?’ అని పవన్‌ను నిలదీశారు. తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్న చోటే ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించిన మేరకే ఆ స్థానాల్లో పోటీ చేస్తున్నావా? అని నిలదీశారు.
రాష్ట్రానికి మహమ్మారులు పవన్, చంద్రబాబే
‘జనసేనను స్థాపించాక 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చావ్. తమను బీసీల్లో చేర్చుతామన్న హామీని నిలబెట్టుకోని చంద్రబాబుపై కాపులు ఆగ్రహంతో ఉన్నందున వారి ఓట్లను చీల్చేందుకు 2019లో విడిగా పోటీ చేశావ్. ఎన్నికలు పూర్తవగానే బీజేపీ పంచన చేరావు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే టీడీపీతో కలిసి పోటీ చేస్తానని ప్రకటించావ్. దీన్ని బట్టి చంద్రబాబుకు అమ్ముడుపోయే నిన్ను ప్యాకేజీ స్టార్ అనక మరేమంటారు సన్నాసిన్నర సన్నాసి..!’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రానికి పట్టిన మహమ్మారులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లేనని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీకి..
సీఎం వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. ‘దివంగత వైఎస్సార్‌పైనే పోరాటం చేశానని బీరాలు పలుకుతున్నావ్ కదా..! అలాంటి పోరాటం చేశానని మీ అన్న చిరంజీవి దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకురాగలవా?’ అని పవన్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. కేంద్రంతో చర్చలు జరిపి ఒప్పించి రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.12 వేల కోట్లు రాబట్టారని, పోలవరానికి నిధులను రాబడుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment