‘మోసం, దగా.. ఇవే చంద్రబాబు విజన్‌’ | Perni Nani Comments On Chandrababu Vision 2047 | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కొత్త రాగం.. అదో దిక్కుమాలిన విజన్‌: పేర్ని నాని

Published Wed, Aug 16 2023 2:41 PM | Last Updated on Wed, Aug 16 2023 8:48 PM

Perni Nani Comments On Chandrababu Vision 2047 - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఓట్ల కోసం విజన్‌-2047 పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు ఎర వేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) విమర్శించారు. ఓట్ల కోసం ముసలి పూతన వేషంలో వస్తున్న చంద్రబాబు పట్ల ప్రజలు చిన్నికృష్ణుడిలా వ్యవహరిస్తూ తమ పని తాము చేసుకుని పోతారన్నారు. ముసలి పూతన వేషంలో ప్రజల ముందుకు వచ్చినా, శకటాసురిడిలా జగన్‌ మీదకు వచ్చినా చంద్రబాబుకు తగిన శాస్తి ఖాయమని తేల్చి చెప్పారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు విజన్‌-2047పై నిప్పులు చెరిగారు. మోసం, దగా.. ఇవే చంద్రబాబు విజన్‌ అంటూ దుయ్యబట్టారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఐదేళ్లలో వారికి ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చామనేది నాయకుడిగా విజన్‌ ఉండాలని.. మాయా విజన్‌లు, కాలజ్ఞానాలు, చిలకజోస్యాలు పనికి రావనేది చంద్రబాబు గ్రహించాలని సూచించారు. 14 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజలను ఇలాంటి విజన్‌ డాక్యుమెంట్లతో నయవంచన చేయడం ధర్మం కాదని హితవు పలికారు.

కరెంట్‌ తీలపై బట్టలారేసుకోవాల్సిందేనన్న విజనరీ 
విజన్‌-2047 అనే కాగితాల కట్టలను ప్రజలపై చిమ్మి.. తద్వారా తెలుగు ప్రజలను ప్రపంచ పటంలో నిలపడమే తన లక్ష్యమని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీకి అధికారం ఇస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని చెబుతున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. విద్యుత్‌ చార్జీలు తగ్గించమని కోరితే హైదరాబాద్‌ నడిబొడ్డున ముగ్గురిని పిట్టలు కాల్చినట్లు కాల్చి చంపారు. అలాంటి విజనరీ విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానంటే జనం నమ్మాలా? రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని 2004 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెబితే.. కరెంటు తీగలపై బట్టలారేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన విజనరీ చంద్రబాబు.
విద్యుత్‌ శాఖపై 2014లో ఉన్న రూ.20 వేల కోట్ల అప్పును రూ.80 వేల కోట్లకు తీసుకెళ్లిన చంద్రబాబు.. 2019 నాటికి విద్యుత్‌ కొనుగోళ్ల బకాయిలు రూ.22 వేల కోట్లను ప్రజలపై మోపారు. 
మాట్లాడితే తనది 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పే చంద్రబాబు, నాడు ఆర్భాటంగా ప్రకటించిన విజన్‌-2020తో పొడిచేసిందేంటి? 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, సీఎం పదవిని లాక్కున్నాక  మెకన్సీ అనే వారితో ఒక పుస్తకం రాయించి.. దాన్నే విజన్‌-2020 డాక్యుమెంటుగా విడుదల చేశాడు. వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలను వేరే రంగాల్లోకి మళ్లించాలని, వారి సంఖ్య తగ్గించాలని విజన్‌- 2020లో చెప్పాడు. రాష్ట్రంలో ఈ రోజుకీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 63 శాతం ఉంటే ఏం తగ్గించినట్లు? 
► చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడంటే చినబాబుకు కోపం వస్తుంది. ఆధారం ఏమిటి అంటున్నాడు. మీ తండ్రి ఇచ్చిన విజన్‌-2020 డాక్యుమెంటే దానికి ఆధారం లోకేష్‌. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వారిని తగ్గించాలంటే దాని అర్థం వ్యవసాయం దండగనే. నేటికీ భారతదేశంలో, ఏపీలో అత్యధిక జనాభా వ్యవసాయ ఆధారితం. మన రాష్ట్రం భారతదేశం మొత్తానికి ధాన్యాగారం అంటారు. అలాంటి రాష్ట్రంలో వ్యవసాయం దండగన్నారు చంద్రబాబు.

14 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టావా?
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు.. రాష్ట్రంలో డిజైన్‌ చేసి, పనులు ప్రారంభించి.. పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? చివరకు నీ సొంత నియోజకవర్గం కుప్పానికి అయినా నీళ్లిచ్చావా? గాలేరు-నగరిని గాలికి వదిలేసింది నువ్వు కాదా? చిత్తూరుకే దిక్కు లేదు. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడనేది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నిస్సిగ్గుగా చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టాడు. విజన్‌-2020 అయిపోయింది. ఇప్పుడు విజన్‌-2047 అట. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్టుంది చంద్రబాబు తీరు.
ప్రస్తుతం చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఇప్పుడు ఆయన విజన్‌-2047 అంటున్నాడు. అప్పటికి ఆయన విజన్‌ ఉంటుందా? జయంతి, వర్ధంతులు ఉంటాయా.. అనేది భగవంతుడికే తెలియాలి. ప్రజలు నవ్వుకుంటారని కూడా గుర్తించకుండా ఇలాంటివన్నీ చెబుతున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న నీవు.. నీకంటూ చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్క పథకాన్ని అయినా అమలు చేశావా? చంద్రబాబు విజన్‌ కేవలం పబ్లిసిటీ మాత్రమే.

నారావారిపల్లెలోనైనా పాఠశాలను బాగు చేశావా?
విద్యా వ్యవస్థలో మీ దార్శనికత ఎక్కుడుంది చంద్రబాబూ? ఏనాడైనా కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్‌ను అయినా బాగు చేద్దామని ఆలోచించావా? చివరికి నారావారిపల్లెలోనైనా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని అనుకున్నావా? 
నారాయణ, చైతన్య స్కూళ్ల ఎదుగుదల చూసి మురిసిపోయావుగానీ, ఒక్క ప్రభుత్వ స్కూల్‌ వైపైనా చూశావా? ఇదా విజనంటే? చివరికి ప్రభుత్వ స్కూళ్లలో ఎలా పాఠాలు చెప్పాలో కూడా పర్యవేక్షణ నారాయణ సంస్థలకు అప్పజెప్పావు. ఇది దిక్కుమాలిన విజన్‌ కాదా? విజన్‌-2020 పూర్తయ్యేసరికి అక్షరాస్యతలో రాష్ట్రానిది చివరి స్థానం. స్కూల్‌ డ్రాపవుట్స్‌లో నంబర్‌ వన్‌. 
► ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు వైద్యం చేరువ చేయాల్సింది పోయి.. చంద్రబాబు యూజర్‌ చార్జీల మోత మోగించాడు. పేదలు మందులు కొనుగోలు చేయాలన్నా డబ్బు పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిందే. అది దివాళా కోరు విజన్‌ కాదా?

ఇదీ విజన్‌ అంటే.. 
108.. 104.. ఆరోగ్యశ్రీ.. అవన్నీ డాక్టర్‌ వైఎస్‌ విజన్‌. కాకిలాగా ఎన్నాళ్లు బతికితే ఏం ఉపయోగం చంద్రబాబూ? 2047 వరకూ బతకాలా? 2014-19లో 108 అంబులెన్స్‌లను షెడ్లలో పెట్టాడు. ఇది చంద్రబాబు మార్కు విజన్‌. 1,540 కొత్త అంబులెన్స్‌లను కొని ప్రజలకు అందించడం వైఎస్‌ కుమారుడు సీఎం జగన్‌ విజన్‌.
► కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తయ్యే సరికి ఆరోగ్యశ్రీ కింద వెయ్యి జబ్బులు ఉంటే చంద్రబాబు ఒక్క జబ్బు కూడా పెంచలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 3,600 జబ్బులకు వైద్యం చేయించేందుకు ఆరోగ్య శ్రీలో చేర్చారు. 2019లో జనం చీ కొట్టి నిన్ను ఇంటికి పంపేనాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.900 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు. ఇది ది గ్రేట్‌ చంద్రబాబునాయుడు విజన్‌. 
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీ నిర్మించలేదు. యువ ముఖ్యమంత్రి జగన్‌ మూడేళ్లలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టి.. ఈ ఏడాది నుంచి 5 కాలేజీల్లో బోధన మొదలు పెడుతున్నారు. వైద్యం పేదవానికి ఉచితంగా అందాలని డాక్టర్ల సంఖ్యను, ఆస్పత్రుల బెడ్‌ల సంఖ్యను పెంచారు. 53 వేల మంది సిబ్బందిని వైద్య ఆరోగ్య శాఖలో నియమించారు. ఇదీ విజన్‌ అంటే.

ఆడబిడ్డల బంగారం వేలంలో బాబు నంబర్‌ వన్‌
► మహిళా సాధికారత కోసం విజన్‌-2047లో తన విధానమేంటో చంద్రబాబు చెప్పలేదు. 2014లో అధికారం కోసం మహిళలకు సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. బాబు వస్తే అప్పులు తీరిపోతాయి.. బ్యాంకుల్లో బంగారం కూడా విడిపిస్తాడంటూ ప్రచారం చేసుకున్నాడు. చివరికి దేశంలో 2014-18 మధ్య అతి ఎక్కువగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 
2047లో నంబర్‌ వన్‌ కాదు.. ఇప్పటికే చాలా విషయాల్లో నంబర్‌ వన్‌గా నిలిపాడు. బ్యాంకుల్లో బంగారం వేలం వేయడంలో, డ్రాపవుట్స్‌లో నంబర్‌ వన్‌. 2019 నాటికి సకాలంలో చెల్లింపుల ద్వారా కేవలం 19 శాతం డ్వాక్రా సంఘాలు మాత్రమే ఏ, బీ గ్రేడుల్లో ఉన్నాయి. చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల డ్వాక్రా మహిళలు అప్పులు కట్టకుండా వడ్డీలకు చక్రవడ్డీలై దారుణంగా మోసపోయారు. నేడు జగన్‌ వచ్చాక 91 శాతం డ్వాక్రా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌ లలో ఉన్నాయి.

నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావ్‌?
ప్రభుత్వ ఉద్యోగులను గణనీయంగా తగ్గించాలి.. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను పెంచాలనేది చంద్రబాబు విజన్‌-2020. 1995 - 2019 మధ్య 14 ఏళ్ల పాటు నిరుద్యోగ యువతకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు బాబూ? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ అక్కర్లేదు అన్న విజన్‌ చంద్రబాబుదే. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కారుణ్య నియాకం వద్దన్న విజన్‌ కూడా ఆయనదే. 
కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే విజన్‌ కూడా చంద్రబాబుకు లేదు. 2014లో రాష్ట్రం విడిపోతే తెలంగాణను కాపీ కొట్టడం తప్ప చంద్రబాబు చేసిందేమిటి? కేసీఆర్‌ ముఖ్యమంత్రి.. నేను ముఖ్యమంత్రి అన్నావ్‌.. కేసీఆర్‌ కొడుక్కి మంత్రి పదవి ఇచ్చాడు.. ఈయన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు.  తెలంగాణలో జిల్లాల విభజన జరిగితే మన రాష్ట్రంలో వికేంద్రీకరణ ఎందుకు చేయలేదు? 
వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు నడిబజార్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. దాన్ని పరిష్కరించే విజన్‌ ఏమైపోయింది బాబూ? చిన్న చిన్న సర్టిఫికెట్ల కోసం కూడా మండల కేంద్రాలకు వెళ్లి పడిగాపులు పడాల్సిన దుస్థితిపై విజన్‌ ఎందుకు లేదు? ఈ పబ్లిసిటీ విజనరీ చివరికి కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌ చేయమని అడుక్కునే దుస్థితి. మన చుట్టూ ఉన్న ఆర్తులను చూడలేని, చూసినా ఉద్దరించలేని విజన్‌ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అది విజన్‌ కాదు.. అంధత్వం అవుతుంది. ఒక పాలకుడికి అది గుడ్డితనమే. 

అధికారం ఉంటే ఇక్కడ.. లేదంటే ప్రవాసం
► రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. వారి చేతిలో పనిముట్లు.. వారి ఓట్లు మనకు అన్నదే చంద్రబాబు విజన్‌. అణాగారిన వర్గాల ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్ది.. పేదరికం నుంచి గట్టెక్కిద్దామనే ఆలోచన ఏనాడూ చంద్రబాబు చేయలేదు.
వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనేది డాక్టర్‌ వైఎస్‌ విజన్‌. ఉచిత విద్య భవిష్యత్తుపై పెట్టుబడి అనేది నేటి సీఎం జగన్‌ విజన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది.. పేదరికం నుంచి గట్టెక్కించేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టారు. 
2014లో అధికారం కోసం బీసీలకు చంద్రబాబు 143 హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఫొటోల్లో మాత్రం పక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండాలి. ఐదేళ్లలో ఒక ఎస్టీ వర్గానికి మంత్రి లేడు.. ఒక మైనార్టీలకు మంత్రి లేడు.. వారు మనుషులు కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? వారికి అధికారం ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదు. 
► ఎన్నికల్లో ఓడిపోయి అధికారం పోగానే పారిపోయే నీకు ఈ రాష్ట్రం పట్ల ఏం విజన్‌ ఉందో చెప్పాలి.  అధికారం ఉంటే ఇక్కడ నివాసం.. అధికారం పోతే ప్రవాసం.. ఇదే చంద్రబాబు విజన్‌. కొల్లేరు, పులికాట్‌లో సీజనల్‌గా వచ్చే విదేశీ పక్షులకు.. అవసరం ఉన్నప్పుడు వచ్చే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు తేడా ఏమీ లేదు.

బాబు మోసగాడు.. పవన్‌ గజ మోసగాడు 
చంద్రబాబు మామూలు మోసగాడైతే.. పవన్‌ కల్యాణ్‌ గజమోసగాడు. సినిమా డైలాగులతో కవులు రాసిస్తే దాన్ని సభల్లో ప్రజలకు అప్పచెబుతుంటాడు. సుత్తి కబుర్లు ఆపి చిత్తశుద్ధితో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రానికి పవన్‌ కళ్యాణ్‌ ఏం చేశాడో చెప్పాలి? 2019 నుంచి బీజేపీతో ఉంటున్నాడు కదా.. ఈ రాష్ట్రానికి ఏం చేశాడు? ప్రజాకోర్టు అంటూ సినిమా టైటిళ్లు బాగానే ఉంటాయి.. ముందు వీటికి సమాధానం చెప్పు పవన్‌?
2014లో చంద్రబాబుకు ఓటేయండని పవన్‌ అడిగాడు. ప్రజలకు క్షవరం అయ్యింది. మళ్లీ రేపు అదే చెప్తాడు. కచ్చితంగా పవన్‌ కల్యాణ్‌ అనే రాజకీయ మోసగాడు ముసుగుతో వస్తున్నాడు. తేల్చీ తేల్చనట్లు.. ఖుషీ సినిమా తరహాలో వ్యవహరిస్తాడు. కాసేపు మన ప్రభుత్వం.. నేను ముఖ్యమంత్రి అంటాడు. కాసేపు సంకీర్ణ ప్రభుత్వం అంటాడు.. మళ్లీ మనకు సీట్లు, ఓట్లు ఎక్కడ? మనం ముఖ్యమంత్రి ఏంటి అంటాడు. 
దమ్ముంటే.. నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను అని చెప్పు పవన్‌.. లేదా మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. 
నీ కులపోడి కోసమే ‘ఈనాడు’లో అబద్ధాలను అచ్చేస్తున్నావన్నది ప్రజలందరికీ తెలుసు రామోజీ? మార్గదర్శి చిట్స్‌లో మీరు తప్పు చేశారా? లేదా? అనేది స్పష్టంగా చెప్పగలవా? నిజాయితీగా దానిపై ఒక్క వార్త రాయలేని మీదీ జర్నలిజమా? అని పేర్ని నాని నిలదీశారు.

ఇదీ చదవండి:జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement