సాక్షి, అమరావతి: ‘‘రా.. కదలిరా అని పిలవగానే నీకోసం జనం ఎందుకు కదలి రావాలి. నువ్వు ఎవరికి ఏం మంచి చేశావని జనం వస్తారు’’ అంటూ చంద్రబాబునాయుడిపై మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఇప్పుడొచ్చి హైదరాబాద్, బెంగళూరు తరహాలో కనిగిరిని అభివృద్ధి చేస్తానని, పేదరికం లేని సమాజాన్ని సృష్టిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలు వస్తే నీకు బీసీలు గుర్తు వస్తారు. కానీ వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వవు. సరైన పథకాలు అమలు చేయవు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చి మేనిఫెస్టో మాయం చేశావ్. చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా? బీసీలకు గుర్తుండే ఒక మంచి పథకం అయినా తీసుకొచ్చారా? ఎంత సేపు ఇస్త్రీ పెట్టెలు, మేకలు, గొర్రెలు, కల్లు కార్మికులకు కొడవళ్లు ఇచ్చారు. వీటితో వారి బతుకులు మారాయా? జయహో బీసీ కార్యక్రమం కేవలం ఓట్లు కోసమే కదా? బీసీలతో ఓట్లు వేయించుకుని వాళ్ల బతుకులను మాత్రం మార్చలేదు. విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచింది నీ పాలనలోనే కదా? నిత్యావసర వస్తువులు నీ హెరిటేజ్ బజార్లలో తక్కువకు ఇస్తున్నావా?
ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా?
నువ్వు, పవన్ కళ్యాణ్ 2014లో అధికారం కోసం ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చారు కదా! ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి. కనీసం ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా?. వైఎస్ జగన్ సీఎం అయ్యాక లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయి. మద్యం తాగమంటూ పేదలను ప్రోత్సహిస్తావా? అందుకేనా బ్రాందీ తక్కువ ధరకు ఇస్తానని.. ఇంటికే సరఫరా అని అంటున్నావు. ఇదేనా నువ్వు పేదలకు చేసే మేలు? ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎక్కడికైనా మార్చవచ్చు.
మేము మారిస్తే తప్పా. జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు ఎందుకు మార్చారు? నువ్వు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మారావు? నీతులు చెప్పడానికి సిగ్గుండాలి. ఇప్పుడు నువ్వు కొత్త హామీలిస్తూ ప్రజల చెవిలో పూలు పెట్టడానికి రెడీ అయ్యావు.ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తా అని 2014 మేనిఫెస్టోలో చెప్పావు? ఒక్కరికైనా డిపాజిట్ చేశావా? గతంలో నువ్వు ఇచి్చన హామీలు ఒక్కటైనా నెరవేర్చావా?జగన్ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, రోడ్లు, ప్రైవేటు పరిశ్రమలొచ్చాయి. ఇది అభివృద్ధి కాదా?
నిన్నెవరు నమ్ముతారు..
నీ హెరిటేజ్ వస్తువుల అమ్ముకోవడం కోసం రంజాన్ తోఫా తెచ్చావు. సీఎంగా ఉన్నప్పుడు చదువు ప్రభుత్వ బాధ్యత కాదన్నావు. నాడు పేదల చదువును అవహేళన చేసి.. ఇప్పుడు అధికారంలోకి వస్తే విమానాల్లో విదేశాలకు తీసుకెళ్తానంటే నిన్ను ఎవరు నమ్ముతారు. నీకు పవన్‌కు సిగ్గులేదు. గతంలో తిట్టుకుని, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు.
అది షర్మిల వ్యక్తిగతం..
షర్మిల ఒక రాజకీయ నాయకురాలు. చాలా మంది పార్టీలు మారుతూనే ఉన్నారు. ఆమె పార్టీ పెట్టి.. కాంగ్రెస్‌ను విమర్శించారు. తర్వాత అదే పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. వైఎస్సార్‌సీపీ వైఎస్ జగన్ నాయకత్వంలో ఏర్పడింది. మేమంతా జగన్ నాయకత్వం చూసి వచ్చాం. నాయకత్వం నచ్చలేదంటే ఉన్నవారుంటారు. వెళ్లే వారు వెళ్తారు. ఎవరితో ప్రయాణం చేయాలి అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడే వద్దని జగన్ చెప్పారు. నా ఇష్టం అన్నపుడు ఇక వారి రాజకీయ ప్రయాణంతో జగన్‌కు ఏ సంబంధం ఉంటుంది?
Comments
Please login to add a commentAdd a comment