Perni Nani Serious Comments On Pawan Kalyan And Chandrababu - Sakshi
Sakshi News home page

ఇంతకు దిగజారుతారా.. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారా?: పేర్ని నాని

Published Mon, Jul 10 2023 4:07 PM | Last Updated on Mon, Jul 10 2023 7:04 PM

Perni Nani Serious Comments On Pawan Kalyan And TDP Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక, పవన్‌ వ్యాఖ్యలపై పేర్నినాని సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదే సమయంలో..‘సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలిస్తే మేం కూడా అదే రీతిలో మీకు సమాధానం చెబుతాం. పవన్‌కు మాత్రమే నోరుందా.. మేం కూడా మాట్లాడుతాం. పవన్‌.. చంద్రబాబు కాళ్లు మొక్కితే మాకేం ఇబ్బంది లేదు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

కాగా, పేరి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్‌ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్‌కు భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనను వీరిద్దరూ ఓర్వలేకపోతున్నారు. పేద, బలహీన వర్గాలకు వాలంటీర్లు ఎనలేని సేవ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్‌కు మంచి పేరు రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అబద్దాలు చెప్పను అంటూ పవన్‌ అవాస్తవాలే మాట్లాడుతున్నారు. పవన్‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. వాలంటీర్లు చేస్తున్న సేవ పవన్‌కు కనిపించడం లేదా?. వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తామని మీ మేనిఫెస్టో‍లో పెట్టాలని సవాల్‌ చేస్తున్నా. వాలంటీర్లలో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు. అలాంటి వాలంటీర్లపై ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతారా?. 

రాజకీయాల కోసం ఇంతకు దిగజారుతారా?..
పవన్‌ మాటల్లో చంద్రబాబుపై ఎల్లలు లేని ప్రేమ కనిపిస్తోంది. పవన్‌ ప్రసంగాల్లో చంద్రబాబు స్క్రిప్ట్‌నే చదువుతున్నారు. పవన్‌ ఆధారాల్లేకుండా విషపు లెక్కలు చెబుతున్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్‌కు చలిజ్వరం. చంద్రబాబుకు లబ్ధికోసమే పవన్‌ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామనే ధైర్యం బాబు, పవన్‌కు ఉందా?. చంద్రబాబు, పవన్‌కు ఈనాడు, ఏబీఎన్‌ తప్పుడు లెక్కలిస్తున్నారు. మీకు తప్పుడు లెక్కలిస్తున్న రామోజీ, రాధాకృష్ణను అడగండి. ప్రభుత్వం ఇచ్చే ప్రతీ పథకాన్నీ పేదలకు వాలంటీర్లు అందిస్తున్నారు. మనిషి జన్మనెత్తినవాడెవడూ ఇలా మాట్లాడడు. రాజకీయ పదవుల కోసం ఇంత దిగజారి మాట్లాడతారా?. చంద్రబాబు, పవన్‌లవి నీచ రాజకీయాలు. చంద్రబాబు మెప్పు కోసం వాలంటీర్లపై పవన్‌ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్‌కు విజ్ఞత ఉంటే వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. వైఎస్సార్‌సీపీ ఏరోజూ మీ తల్లి, భార్య గురించి తప్పుగా మాట్లాడలేదు. రాజకీయంగా రెచ్చగొట్టేందుకు ఇలా మాట్లాడుతున్నారు. 

పేర్ని నాని ఏమన్నారంటే..

నిజమే..ఆ లెక్కలు ఎన్సీబీ(నారా చంద్రబాబు)వే
ఆటవిడుపుగా జనసేన అధ్యక్ష బాధ్యతలు చూస్తున్న మహనీయులు పవన్‌ కళ్యాణ్‌ గారు నిన్న ఏలూరులో ప్రసంగం చేశాడు. 
ఒక రాజకీయ నాయకుడు చేసే రాజకీయ ప్రసంగంలా కాకుండా రాక్షస రాజకీయ ఎత్తుగడగా మాటలకు విషం కలిపి చిమ్మాడు. 
వైఎస్‌ జగన్‌ గారిపై విద్వేషం, చంద్రబాబుపై ఎల్లలు లేని ప్రేమ నిన్న ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కన్పించింది. 
30 వేల మంది ఒంటరి మహిళలు రాష్ట్రంలో అదృశ్యమయ్యారు..ఈ లెక్క నాకు ఎన్సీబీ నుంచి వచ్చింది అని చెప్పాడు..
నిజమే...ఆ లెక్క ఆయనకు ఎన్సీబీ నుంచే వచ్చింది. ఎన్సీబీ అంటే నారా చంద్రబాబునాయుడి నుంచే వచ్చింది. 
వాస్తవంగా భారతదేశంలో నేషనల్‌ క్రైం రికార్డ్‌ బ్యూరో సంస్థ ఉంది. 
పవన్‌ కళ్యాణ్‌ ఆ లెక్కలు చెప్పేటట్లయితే అన్నీ కరెక్టుగానే చెప్పేవాడు...
కానీ ఈయన మాత్రం నారా చంద్రబాబు అనే ఎన్సీబీ ఇచ్చిన లెక్కలు చెప్పాడు. 
ఆ లెక్కలన్నీ ఆయన 2 లక్షల పుస్తకాలు చదివానని చెబుతున్న లెక్క...ఈ 30 వేల లెక్క ఒకటే...
చంద్రబాబు మత్తులో పడి ఆయనిచ్చే తప్పుడు లెక్కలతో జగన్‌ గారిపై విషం చిమ్మడంలో భాగంగా ఇష్టారాజ్యంగా నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నాడు. 
ఎవరైనా 18 ఏళ్లు లోపు వారు, 18 ఏళ్లు పైబడిన వారు సాధారణంగా ప్రేమ వ్యవహారంలో గానీ, పెళ్లి మీద పెళ్లి చేసుకునే వాడు ఆమ్మాయిల్ని మాయమాటలతో మోసం చేసి తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకుని వెళ్తారు. 
తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కి వెళితే బాలికలు, ఉమెన్‌ మిస్సింగ్‌ కింద కేసు నమోదు చేస్తారు. 
కొంత మంది ఇంట్లో అమ్మానాన్నపై అలిగి కూడా వెళ్తుంటారు..
ఇలాంటి కేసులను ట్రేస్‌ చేసి పట్టుకుంటారు..అన్ని పోలీసు స్టేషన్లను అలెర్ట్‌ చేస్తారు. 
ఏ ప్రభుత్వమైనా పోలీసులు చేసే పని ఒకే విధానంలో ఉంటుంది. 
అమ్మాయి వెనక్కి వస్తే కేసు క్లోజ్‌ చేసుకుంటారు. లేదు అమ్మాయి మైనర్‌ అయితే పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తారు.
ఆ అమ్మాయి ఇష్టమైతే ఇంటికి పంపుతారు..లేదంటే గవర్నమెంట్‌ హోమ్‌కి పంపుతారు. 

బాబు హయాంలో 16,765 మంది మిస్సింగ్ అయ్యారు.. ఏనాడైనా ప్రశ్నించావా?
2015 సంవత్సరంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంయుక్త ప్రభుత్వం ఉన్నప్పుడు 18 ఏళ్లు దాటిన ఆడవాళ్ల మిస్సింగ్‌పై దాఖలైన కేసులు 3,216 మంది. 2016 లో 3,089 మంది, 2017లో 3,744 మంది, 2018లో 4,232 మంది, 2019 జనవరి నుంచి మే ఆఖరు వరకూ 2,484 మంది.
మొత్తం 16,765 మంది 18 ఏళ్ల పైబడిన మహిళలు మిస్సయినట్లుగా కేసులు నమోదు అయ్యాయి. 
అయితే 2015లో ట్రేస్‌కాని వారు 263 మంది. 2016లో 484, 2017లో 491, 2018లో 463 మంది, 2019లో వారి ప్రభుత్వం ఉన్నంత కాలం 313 మంది ట్రేస్‌ అవలేదు. 
మా ప్రభుత్వం వచ్చాక 2020లో 381 మంది, 2021లో 469 మంది, 2022లో 392 మంది ట్రేస్‌ కాలేదు. 
మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి...మీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది పవన్‌ కళ్యాణ్‌ తెలుసుకోవాలి. 
మరి పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన 30 వేల మంది లెక్క ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పాలి. 
ఏదో నోటికొచ్చింది వాగితే సరిపొద్ది అనుకుంటున్నాడు. విషపు మాటలతో చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నాడు. 
విలేకరుల సమావేశం పెట్టి ఏదంటే అది మాట్లాడి సమాధానాలు చెప్పకుండా పారిపోవడం కాదు.
అందుకే ఈ మధ్య విలేకరులు డొక్క తీస్తున్నారని, కార్యకర్తలను పోగేసి చెప్పదలుచుకుంది చెప్పేసి వెళ్లిపోతున్నాడు. 
దాన్నే రికార్డు చేసేసి మీడియాకు లింకులు ఇచ్చేసి వెళ్లిపోతున్నాడు..ఈ లింకుల బాగోతం ఎవరికీ తెలియదనుకుంటే ఎలా..? 
ఇలాంటి ఈయన జగన్‌ గారు ప్రెస్‌మీట్‌ పెట్టలేదని మాట్లాడుతున్నాడు.

వాలంటీర్‌ సిస్టమ్‌ అంటే వారికి చలిజ్వరం
జగన్‌ గారు ఏర్పాటు చేసిన వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అంటే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు భయంతో చలిజ్వరం పట్టుకుంది. 
ఇద్దరూ గజగజ వణుకుతూ దడిచి చస్తున్నారు. 
ఇద్దరూ కలిసి జగన్‌ గారిని 2014 నుంచి అసత్యాలను మాట్లాడుతూ తిట్టేపనిలోనే ఉన్నారు. 
రాజశేఖరరెడ్డి గారిని అడ్డంపెట్టి జగన్‌ గారు అవినీతి చేశాడంటూ సోనియాగాంధీతో కలిసి తప్పుడు కేసులు పెట్టించారు. 
కానీ ఏమైంది...జగన్‌గారు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 
మేం ఏం మాట్లాడినా జగన్‌ గారిని ఏం చేయలేకపోతున్నామని ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. 
జగన్‌గారి బలం పారదర్శకమైన పరిపాలన- సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు, ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేస్తున్నారు. 
జగన్మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వానికి వీరు మంచి పేరు తెస్తున్నారని అక్కసు, దుగ్ధ, ఆక్రోశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 
వాలంటీర్లను చెడ్డవారిగా చిత్రీకరించాలని నువ్వు చేసిన ప్రయత్నం ధర్మమా..పవన్‌ కళ్యాణ్‌..? ఇది రాజకీయ నీతా..? 
పేరుకేమో నేను చాలా నీతిమంతుడిని అంటాడు..నిజాలు మాట్లాడతాను అంటాడు..ఇవి నిజాలా పవన్‌ కళ్యాణ్‌..? 
నరం లేని నాలుక ఉంది కదా అని చంద్రబాబు లబ్ధి కోసం ఎటుపడితే అటు తిప్పడం, ఎంత మాట పడితే అంత మాట్లాడటం సబబు కాదు. 
ఈ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎలాంటివో మీకు తెలియదా.?
పవన్, చంద్రబాబులకు చాలెంజ్‌ చేస్తున్నా... "మేమొస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలను తెస్తామని" మీ మేనిఫెస్టోలో పెట్టండి. 

మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..?
వాలంటీర్లలో ఎంత మంది మహిళలు ఉన్నారో అసలు లెక్కలైనా మీకు తెలుసా..? 
2.50 లక్షల మంది వాలంటీర్లలో సగానికి పైగా మహిళలే. 
చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణలు మీకు తప్పుడు లెక్కలు ఇస్తే వాటిని లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌. 
వాలంటీర్లు తెల్లవారుజామునే వృద్ధులకు, వితంతువులకు వారి చేతిలో డబ్బులు పెట్టి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. 
మనిషి జన్మ ఎత్తినవాడు ఎవడైనా వాలంటీర్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? 
2.60 లక్షల మంది నిస్వార్ధంగా ప్రజా సేవ చేస్తున్న వారి గురించి నీచంగా మాట్లాడటానికి పవన్‌ కళ్యాణ్‌ మీకేమన్నా నైతిక విలువులు ఉన్నాయా..? 
ఎంతో మంది రాజకీయ నాయకులకంటే గొప్పగా సేవ చేస్తున్న వారిపై మీరు చేసిన వ్యాఖ్యలు హేయం కాదా..? మీ జీవితానికి ఇది ఒక మాయని మచ్చ కాదా..? 
దిక్కుమాలిన ఒక రాజకీయ పదవి కోసం ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడాలా..? 
దిగజారి మాట్లాడాలా..? దిగజారి ఇంత నీచానికి ఒడిగట్టాలా..? 
నిస్వార్ధంగా పనిచేస్తున్న అభం శుభం తెలియని యువతీ యువకులపై ఇంత నీచంగా మాట్లాడటం కరెక్టేనా..? 
చంద్రబాబు, పవన కళ్యాణ్‌ వాలంటీర్ల పేరు చెప్తే గజగజలాడిపోతున్నారు. 
జగన్‌ బలం వాలంటీర్లే అన్నది వాళ్లు నమ్ముతున్నారనేది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్ధం అవుతోంది. 
పోలీసుల మీద, సమాజం మీద, ప్రభుత్వం మీద, ప్రత్యేకించి అభం శుభం తెలియని వాలంటీర్లపై ఇంత కక్ష పూరితంగా మాట్లాడుతున్నారు. 
తక్షణం పవన్‌ కళ్యాణ్‌...నిజంగా నీలో విజ్ఞత ఉంటే...దోసకాయ గింజంతా మంచితనమైనా ఉంటే.. వాలంటీర్ల గురించి మీరు పేలిన తప్పుడు మాటలను వెనక్కి తీసుకోమని వైఎస్సార్సీపీ డిమాండ్‌ చేస్తోంది.

మీ తల్లి, భార్యను అన్నారని బాధ పడుతున్నారే..వాలంటీర్లకు ఆ బాధ ఉండదా..?
వైఎస్సార్సీపీ ఆయన తల్లిని, భార్యను, పిల్లలను తిడుతున్నామని మాపై లేనిపోని నిందలు వేస్తున్నాడు. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీ తల్లి, భార్య, పిల్లల గురించి ఏ రోజూ పల్లెత్తి మాట అనలేదు. 
కేవలం రాజకీయం కోసం,  చంద్రబాబు  లబ్ధికోసం, సానుభూతి కోసం, మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం మీరు మాట్లాడుతున్నారు. 
ఎవరో కొంత మంది తప్పుడు వెధవలు మీ తల్లి, భార్య గారి గురించి సోషల్ మీడియాలో మాట్లాడారని మీరు బాధపడుతున్నారు కదా...
బహిరంగంగా లారీ ఎక్కి మీరు మీ బాధను వెలిబుచ్చుకుంటున్నారు కదా...
మరి ఇంత నిస్సిగ్గుగా అహర్నిశలు నిస్వార్ధంగా పనిచేస్తున్న వాలంటీర్లను కించపరుస్తూ మీరు మాట్లాడే భాషకు ఎవరు సమాధానం చెప్తారు..? 
ఎవరో ఫేస్‌బుక్, సోషల్‌ మీడియాల్లో మీ కుటుంబం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్న వెధవలతో మీరు కూడా సమానమే కదా..? 
వైఎస్సార్సీపీ ఇలాంటి తప్పుడు పనులు ఏనాడూ చేయదు కూడా..
సమాజ హితం కోసం పనిచేస్తున్న వాలంటీర్ల గురించి వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మీరు మాత్రం దాడిచేయవచ్చా..?
రాష్ట్రంలో ఒంటరి మహిళలను రెడ్‌ లైట్‌ ఏరియాలకు అమ్మేస్తున్నారు అని మీరు చెప్పే సూక్తి ముక్తావళి మేము వినాలా..? 
ఈ గెటప్‌ చూస్తుంటే అత్తారింటికి దారేదిలో స్వామీజీ గెటప్‌లా ఉంది. 
నీ వ్యక్తిత్వం మాత్రం దైవత్వం.. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యక్తిత్వం గురించి మాత్రం నీచంగా మాట్లాడుతావా?
నీ నోటితో వాళ్లని కించపరుస్తూ మాట్లాడి... అర్ధరాత్రి ట్వీట్లో వారిపై కపట సానుభూతి చూపుతూ ద్వంద నీతి ప్రదర్శిస్తున్నావు. 

కొల్లేరు విషతుల్యం అవుతుంటే మీ ప్రభుత్వంలో ఏం చేశావ్‌..?
కొల్లేరు పరిరక్షణకు జనసేన నిలబడుతుంది..జనసేన మూలసిద్ధాంతమైన పర్యావరణ పరిరక్షణ అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం అంటున్నాడు. 
ఈయన పర్యావరణ పరిరక్షణకు వాలంటరీ ఆర్గనైజేషన్‌ ఏమైనా పెట్టాడా..?
కొల్లేరు విషతుల్యం అవుతుంటే 2014 నుంచి 2019 వరకూ ఏం చేశావ్‌ పవన్‌ కళ్యాణ్‌..?
అప్పుడు మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది..
అసలు కొల్లేరు గురించి నీకు తెలుసా..ఎన్ని గ్రామాలున్నాయి...దారెటో నీకు తెలుసా..? 
రామోజీ తప్పుడు రాతలు రాస్తే వాటిని పట్టుకుని మీరు బయలుదేరతారు. 
నీరు ఉప్పనై...నేలకు ఉప్పెనై అని రామోజీ రాతలు రాశాడు..
రామోజీ తగ్గుతున్న పక్షులు అంటే..పవన్‌ కళ్యాణ్‌ తానే లెక్కేసినట్లు 20 లక్షల పక్షులు అంటూ లెక్క చెప్పుకొస్తున్నాడు.
రామోజీ రాస్తాడు..చంద్రబాబు స్క్రిప్టు నీకిస్తాడు..నువ్వు లారీ ఎక్కి చదివేస్తావు. 
2006 తుపాను సందర్భంలో తప్ప ఎప్పుడు ఊర్లలోకి నీళ్లొచ్చాయో చెప్పండి. 
జగన్‌ గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకూ ఒక్క గ్రామామైన మునిగిందా..? 
చంద్రబాబు హయాంలో కొల్లేరు ఎండిపోయింది..జగన్‌ గారు వచ్చిన తర్వాత కొల్లేరు నిండుతోంది. 
ఇంకా అక్కడి వారు కొల్లేరుకు గేట్లు పెట్టి వచ్చిన నీరు నిలిచేలా చర్యలు తీసుకోండని కోరుతున్నారు. 
దాన్ని మంజూరు చేసి త్వరలో ప్రభుత్వం పనులు మొదలుపెడుతుంది. 
అసలు పవన్‌ కళ్యాణ్‌కు ఆటపాక అనే ఊరు పేరు తెలుసా..? అక్కడికి పక్షులు వస్తున్నాయా..? 
వాస్తవాలు ఏంటో..  నిజమా కాదా.. అనేది కూడా అధ్యయనం చేయకుండానే పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నాడు. 

జీవోలు బయటపెడితే కోర్టులకెళ్లి స్టేలు తీసుకురావడానికా..?:
జీవోలను బయటపెట్టలేని ప్రభుత్వం అంటున్నాడు. బయటపెడితే నువ్వూ, చంద్రబాబు వెంటనే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొస్తారు. 
ప్రజలకు అవసరమైన, వారి జీవితాల్లో మార్పు తెచ్చే మంచి జీవోలు ఉంటే కాన్ఫిడెన్షియల్‌గా పెడతారు. 
చంద్రబాబు ప్రభుత్వం కూడా కాన్ఫిడెన్షియల్‌ జీవోలు పెట్టారు. 
మా ప్రాంతంలో పోర్టు నిర్మాణం పేరుతో 33 వేల ఎకరాల బలవంతపు భూసేకరణ జీవోలన్నీ చంద్రబాబు కాన్ఫిడెన్షియల్‌గానే పెట్టాడు. 
పవన్‌....మీరెప్పుడు వస్తారో చెప్పండి...ఎన్ని కాన్ఫిడెన్షియల్‌ జీవోలు ఉన్నాయో నేను చూసిస్తా. 
జగన్‌గారు ప్రజల సౌలభ్యం కోసం చేస్తే ... చంద్రబాబు తన పార్టీ లబ్ధి కోసం మాత్రం కాన్ఫిడెన్షియల్‌ జీవోలు ఇచ్చాడు. 

చంద్రబాబు నిధులు మళ్లిస్తే అప్పుడు నీ నోరేమైంది?
లెక్కలు కనిపించడం లేదని కాగ్‌ చెప్పిందట..ఎవరన్నారు కాగ్‌ చెప్పిందని..? 
2018లో వచ్చిన 2016 కాగ్‌ రిపోర్ట్‌ ప్రకారం జమా ఖర్చు లేని లెక్కను రూ.  42,999 పీడీ ఎకౌంట్లకు బదిలీ చేశారని ఆనాడు కాగ్‌ చెప్పింది. 
అప్పుడు మీ ప్రభుత్వమే కదా...అప్పుడు ప్రశ్నిస్తానన్న నీకు మాట్లాడటానికి ఏమి అడ్డం వచ్చింది..? 
ఇప్పుడు ఊగిపోతున్నావు కదా...అప్పుడు ఊగడానికి ఊపు రాలేదా..? 
కేవలం జగన్‌ గారు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లుగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి పంపిన సొమ్ము రూ.2.25 లక్షల కోట్లు.
మీ ప్రభుత్వం కూడా అప్పు చేసింది..మేమూ చేశాం...
చంద్రబాబు హయాంలో ముందున్న ప్రభుత్వం కంటే 20.17 శాతం అదనంగా అప్పు చేశారు. 
చంద్రబాబు హయాంతో పోల్చి చూస్తే మేం చేసిన అప్పు 16 శాతం మాత్రమే.  
అలాగే ఓవరాల్‌గా అన్ని కలిపి పవన్, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 21.87 శాతం. 
ఈ రోజు మా ప్రభుత్వం 12.6 శాతం మాత్రమే అప్పు చేసింది. 
మేం చేసిన అప్పులతో 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.. ఒక్కొక్క కాలేజీకి రూ.550 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. 
సుమారు రూ.15వేల కోట్లతో మూడు పోర్టుల నిర్మాణం చేస్తున్నాం. 
రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మూడు పోర్టులను అంకితం చేయబోతున్నాం. 
వేల సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలను నిర్మాణం చేశాం. మరి మీరు చేసిన నిర్మాణాత్మక కార్యక్రమం ఒక్కటైనా ఉందా..? 

మీరు చేసిన అప్పులకు లెక్కెక్కడా...?
మరి మీరు చేసిన అప్పు ఏమైంది..? మీ హయాంలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5వేల కోట్లు, రోడ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా 2018–19లో అప్పులు తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు..? 
ఆ నిధులు పసుపు కుంకానికి తరలించింది నిజం కాదా..? 
ప్రజల డబ్బుతో ఓట్లు కొనేప్రయత్నం చేశారా లేదా..? 
జగన్‌ గారు చేసే ప్రతి అప్పునకు, ప్రతి పైసాకి లెక్కా పత్రం ఉంది. 
ఎక్కడ ఖర్చు పెట్టాం..ఎన్ని ఆస్తులు సృష్టించబోతున్నాం అనే లెక్క ఉంది. 
మీ హయాంలో ఒక్క పోర్టు నిర్మాణం చేశారా.? ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేశారా..? 
మీరిద్దరూ కలిసి ఐదేళ్లు పరిపాలన చేసి ఏం చేశారు..
ఆనాడు మీరిద్దరు కాపులను బీసీల్లో కలుపుతాం అని మోసం చేశారు. 
2019కి మీలో ఒక భయం వచ్చింది..అధికంగా ఉన్న కాపు ఓటర్లు  కసితో జగన్‌ గారికి ఓట్లేస్తారని భయపడి కుట్రలతో కుయుక్తులతో విడివిడిగా పోటీచేశారు. 
చివరి ఆరు మాసాలు చంద్రబాబును నెమలిపింఛంతో కొడుతూ చంద్రబాబుకు లబ్ధిచేకూరేలా పవన్‌ కళ్యాణ్‌ నడుచుకున్నాడు. 
కానీ కాపులు ఇది పసిగట్టారు. అందుకే మనోడు ఇంకా చంద్రబాబుకి వంతపాడుతున్నాడని కాపులంతా జగన్‌ గారికి అండగా నిలిచాడు. 
మళ్లీ నేడు కులాలు లేవంటూనే కులాల కుంపట్లు పెడుతున్నది, దాని ద్వారా అన్ని సర్కస్‌లు చేస్తున్నది పవన్‌ కళ్యాణ్‌. 

నువ్వు ఏకవచనంతో పిలిస్తే...మేం అనేక వచనాలతో పిలవగలం
జగన్‌ గారిని జగన్‌ అని ఏకవచనంతో పిలుస్తాననడంలో,  నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ విజ్ఞత ఎలాంటిదోనని ప్రజలు తెలుసుకుంటారు. 
చంద్రబాబు కాళ్లు మొక్కండి...ఆయనను నెత్తిమీద పెట్టుకోండి..
ఆయన్ని సార్‌...అయ్యా..దొరా అని పిలుచుకోండి మాకు అభ్యంతరం లేదు. 
జగన్‌ గారిని ఏకవచనంతో మాట్లాడితే..  మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమని గుర్తుంచుకోండి. 
నువ్వు ఏకవచనంతో పలికి చూడు...నిన్ను ద్వివచనం, త్రివచనం... ఏ వచనం కావాలంటే ఆ వచనంతో పలకడం ఖాయం. 
పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడికే నోరు లేదు..నాలుక లేదు...వైఎస్సార్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి కూడా నాలుక, నోరు ఉంది. 
అట్టుకు అట్టు పెట్టడం ఖాయం... అని తెలుసుకోండి. 
చంద్రబాబును అందలం ఎక్కించడం కోసం తప్పుడు మాటలు మాట్లాడటం కట్టిపెట్టి ధర్మంగా ఓట్లు అడుక్కొండి. 
చిరంజీవి గారికి, ఈయనకీ నక్కకీ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. 
నా తమ్ముడితో నేను వేగలేను... అని చిరంజీవి గారు అప్పుడు ఎందుకన్నారో ఇప్పుడు అర్ధం అవుతుంది. 

ఇది కూడా చదవండి: ‘కరోనా టైమ్‌లో ఎక్కడున్నావ్‌.. ఫాంహౌస్‌లో పడుకున్నావ్‌ కదా పవన్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement