![PM Modi suggests panel of NDA spokespersons for united face on important issues](/styles/webp/s3/article_images/2024/07/3/modi_9.jpg.webp?itok=jwDfSDjE)
ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ సూచన
చాయ్‌వాలా ప్రధాని కావడం విపక్షాలకు ఇష్టం లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం సభలో అనుచితంగా మాట్లాడారని, ఆయనలాగా ఎవరూ ప్రవర్తించకూడదని, మాట్లాడకూడదని బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం ఎన్డీయే పక్షాల ఎంపీల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, విధివిధానాలను ప్రతి ఒక్కరూ తూ.చా. తప్పకుండా పాటించాలని, సభలో స్రత్పవర్తన కలిగి ఉండాలని తెలిపారు.
సభలో అనుసరించాల్సిన ఉత్తమ విధానాల గురించి సీనియర్ ఎంపీల నుంచి నేర్చుకోవాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సూచించారు. కాంగ్రెస్సేతర నాయకుడు, అందులోనూ ఒక సాధారణ చాయ్‌వాలా మూడోసారి ప్రధానమంత్రి కావడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని, సభకు తప్పనిసరిగా హాజరు కావాలని, నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రభావవంతంగా ప్రస్తావించాలని పేర్కొన్నారు.
ఏదైనా అంశంపై మీడియాతో మాట్లాడాలనుకుంటే తొలుత దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. నియోజకవర్గాలతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండాలని, మనకు మద్దతు ఇచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పడం మన బాధ్యత అని వివరించారు. పార్లమెంట్ సభ్యులుగా దేశ సేవకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియాన్ని ఎంపీలందరూ సందర్శించాలని, భారత ప్రధానమంత్రుల జీవిత ప్రస్థానం గురించి అక్కడ తెలుసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment