బండ్లగూడ, నాంపల్లి: అక్రమంగా అరెస్టులు చేసి తమను భయపెట్టాలని చూస్తే మరింత ఉవ్వెత్తున ఉద్యమిస్తామని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. గ్రూప్–2 పరీక్షలను రద్దు చేయాలని కోరతూ నిరసన చేపట్టేందుకు వెళ్తున్న ఆయనను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఉదయమే బండ్లగూడలోని ఆయన నివాసంలో సత్యగ్రహ దీక్షకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అర్థరాత్రి పోలీసులు అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. తమకు ఆదేశాలు ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బీఎస్పీ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం పోలీసులను నమ్ముకొని పాలన చేస్తున్నారని, భవిష్యత్‌లో ఇదే కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లోనే బందోబస్తు చేస్తారని ధ్వజమెత్తారు. గ్రూప్–2 ఉద్యోగాల్లో కొన్ని తమ అనుచరులకు కావాలని ముందుగానే పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు చెప్పారనీ అందుకే నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్ బోర్డులో కొంత మంది దొంగలను సీఎం నియమించారని విమర్శించారు.
లీకేజీ కారకులను అరెస్టు చేయకుండా పరీక్షలు ఎలా?
పేపర్ లీకేజీ కారకులను ఇంతవరకూ అరెస్టు చేయకుండా, తిరిగి వెంటనే పరీక్షలు నిర్వహించడం సరికాదని ప్రవీణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఉద్యో గ నియామకాలు చేపట్టకుండా 2022లో ఒకేసారి నోటి ఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులపై తీవ్ర భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల కోసమే ఆగమేఘాల మీద ఉద్యోగ పరీక్షలు నిర్వహిస్తున్నారని నిందించారు.
ఇప్పటి వరకు డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. నియంత, నిరంకుశ కేసీఆర్ వల్ల ఒక తరం నాశనం అయ్యిందని ప్రవీణ్ ధ్వజమెత్తారు. టీచర్ ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్లు గ్రూప్ పరీక్షలు రాయకూడదనేది కేసీఆర్ కుట్రగా పేర్కొన్నారు. ’’ముఖ్యమంత్రి కొడుకు, మనుమడు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాశారా... ఆరునెలల్లో పరీక్ష సిలబస్ మార్చి మెటీరియల్ ఇవ్వకుండా వాళ్లు పరీక్ష రాయగలరా..’’అని నిలదీశారు.
ఫేక్ యూనివర్సిటీలు
యూనివర్సిటీలు బాగు చేయమంటే ఫేక్ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్, సకల జనుల సమ్మె, ఇలా ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ఎలాంటి అణచివేత ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంగా మారిందని విమర్శించారు. పేపర్ లీకేజీలో రమేష్, రాజశేఖర్‌రెడ్డి దొరికిన వెంటనే కేటీఆర్ దొంగ అని తేలిపోయిందనీ, అందుకే కేటీఆర్ ట్విట్టర్‌లో కూడా నిరుద్యోగ సమస్యలపై మాట్లాడడం లేదని ప్రవీణ్ విమర్శించారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీఎస్పీ నేతల సత్యాగ్రహ దీక్ష భగ్నం
గ్రూపు–2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం నగరంలోని గన్‌పార్కు వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగన బీఎస్సీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చేతుల్లో ప్లకార్డులను పట్టుకుని జైభీమ్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్డు నుండి గన్‌పార్కులోనికి పరుగులు తీసిన వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లారు. గన్‌పార్కు వైపునకు వచ్చినవారిని వచి్చనట్లుగానే అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముషీరాబాదు, నాంపల్లి పోలీసుస్టేషన్లకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment