జైపూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతూ సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంధన ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై రాజస్థాన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు రాముడు భక్తులు కాదు.. రావణుడి భక్తులు అంటూ వివాదాస్పద వ్యాఖ‍్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతల రాముడి విధానాన్ని పాటించడం లేదని, వాళ్లు రావణుడి పాలసీని పాటిస్తున్నారని విమర్శలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. రాముడు అందరినీ సమానంగా చూశాడని.. అదే రావణుడు ఓ మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో బీజేపీ ఎలాగైతే.. కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం టికెట్లను పంచిపెడుతున్నారో అలాగే పెట్రోల్, డీజిల్ కోసం కూడా కూపన్లు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఎనిమిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏడుసార్లు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment