
పవన్ నిర్ణయంపై తిరుగుబాటు
రోడ్లపైకొచ్చి ఆందోళనలు
సాక్షి, అమరావతి/కడియం/గోకవరం/అమలాపురం/అంబాజీపేట: పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విదిల్చిన 24 సీట్లను తీసుకునేందుకు అంగీకరించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఈనెల 24న సీట్ల ప్రకటన తర్వాత హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడే ఉండిపోయారు. శ్రేణులకు ముఖం చాటేశారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం చల్లారడం లేదు. నాలుగు రోజులుగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ నిర్వహించిన టీడీపీ–జనసేన సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. అంబాజీపేటలో జరిగిన ఈ సమావేశాన్ని జనసేన కార్యకర్తలు ముట్టడించి వీరంగం సృష్టించారు. కుల్చిలను, బల్లలను గాల్లోకి ఎగరేశారు. టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గంటి హరీష్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. గతంలో సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు, కార్యకర్తలను బూతులు తిట్టిన రాజేష్కు మద్దతు తెలిపేది లేదని తేల్చిచెప్పారు
. ఈ విషయంమై గంటి హరీష్ ను రెండు రోజుల క్రితం పి.గన్నవరంలో జనసేన నాయకులు నిర్బంధించారు. రాజేష్ అభ్యర్థిత్వాన్ని టీడీపీ శ్రేణులూ అంగీకరించడం లేదు. దీంతో అధిష్టానం సూచనతో రాజేష్ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల జోనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో అంబాజీపేట వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మంటపంలో జరిగిన సమావేశపు హాలులోకి జనసైనికులు దూసుకువచ్చి ‘రాజేష్ గో బ్యాక్’ అని నినాదాలు చేశారు.
టీడీపీ నాయకులతో వాగ్వావాదానికి దిగడంతో గలాభా సృష్టించారు. పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం రంగారావు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల శ్రేణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతానన్నారు. చివరకు హరీష్ మాట్లాడుతూ ‘నా కారు అద్దాలు పగల కొట్టారా? ఆ విషయం నా దృష్టికి రాలేదే’అని చెప్పడం కొసమెరుపు.
కాకినాడ జిల్లా జగ్గంపేట సీటును టీడీపీకి
కేటాయించడాన్ని నిరసిస్తూ అక్కడి జనసేన ఇన్‌చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయినా పొత్తు ధర్మంగా కనీసం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ జనసేన నాయకుల వద్దకు రాకపోవడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు. నెహ్రూకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించేది లేదని సూర్యచంద్ర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ తీరును తప్పుబట్టారు. తమను పాలేరుల్లా చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సీటును టీడీపీకి కేటాయించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం జనసేన నాయకులు కడియం నుంచి రాజమండ్రి బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సీటును జనసేన నేత కందుల దుర్గేష్కే
కేటాయించాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సీటును టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానిక జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాసరావు మంగళవారం జరిగిన టీడీపీ–జనసేన ఉమ్మడి సమావేశానికి దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment