సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి లోక్‌సభ ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కూటమి అభ్యర్థుల కోసం ఆయన ఆదివారం ప్రచారం చేశారు. తిరునల్వేలిలోనూ పర్యటించారు. ‘కుటుంబరాజకీయం, అవినీతిమయ పాలనలో ఆరితేరిన డీఎంకే, కాంగ్రెస్‌లతో దేశానికి అరిష్టం. తమిళనాడులో జల్లికట్టు క్రీడపై నిషే«ధానికి కాంగ్రెస్ హయాంలో పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న జైరాం రమేష్ కారణం. ఆనాడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకే ఈ నిషేధంపై నోరుమెదపలేదు. 2జీ కుంభకోణమే డీఎంకే మౌనానికి కారణం. మోదీ ప్రధాని అయిన తరువాతనే తమిళుల సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం తొలగింది’అని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో రెండో విడత పోలింగ్‌లో బీజేపీ గాలి వీచిందని అన్నారు. కేరళలో స్వల్ప మెజార్టీతోనైనా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల్లోనూ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment