సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాజముద్ర వేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్, అనిల్‌కుమార్‌యాదవ్, చామల కిరణ్‌రెడ్డిలతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. తమ ఆరు గ్యారంటీలను సాధ్యం కాదని చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు తాజాగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత ఇక ఆ మాటలు మాట్లాడే అర్హత కోల్పోయారన్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ చిత్తుకాగితంగా చూస్తుందని, దానిపై పెద్దగా చర్చ అవసరం లేదని చెప్పారు.
సారా పాటల్లా ఉంది
మహాలక్ష్మి పథకం కింద తాము రూ.2,500 మహిళలకు ఇస్తామని చెపితే కేసీఆర్ రూ.3వేలు చెప్పారని, రూ.500కే గ్యాస్‌సిలెండర్ ఇస్తామంటే ఆయన రూ.400 చెప్పారని, పింఛన్లు రూ.4వేలు ఇస్తామని తాము చెపితే ఆయన రూ.5వేలు చెప్పారని, రైతుబంధు కింద తాము రూ.15వేలు ఇస్తామంటే కేసీఆర్ రూ.16వేలు చెప్పారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు చూస్తుంటే గతంలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టు సారా పాటల్లా చెప్పారని, మూడోసారి అనకుండానే పెద్దలోయలో పడిపోయారన్నారు.
రాష్ట్రమే కాదని, కేసీఆర్ బుర్ర కూడా దివాళా తీసిందని, బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లో చూపించినట్టు మేనిఫెస్టో ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్ లాగా తాము ఉత్తుత్తి హామీలను ఇవ్వలేమని, ఆరు గ్యారంటీలను అమలు చేయగలమనే నమ్మకంతోనే ప్రకటించామని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్‌హామీలు ఆచరణ సాధ్యమేనని కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ‘కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నా. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలి. ఈ పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఈనెల 17న మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలి. ఇద్దరం ప్రమాణం చేద్దాం.’అని అన్నారు.
కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలి
రాష్ట్రం నిజంగా దివాళా తీయకపోతే ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పింఛన్లను ఒకటో తేదీన ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను చూసిన తర్వాత కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ ముందుగానే అంగీకరించి కాడి కిందపడేశారని చెప్పారు. ‘కేసీఆర్ మీ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది. ఆలోచన శక్తిని కూడా మీరు కోల్పోయారు.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.’అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment