బాపూజీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడుతున్న సజ్జల, మంత్రులు, నేతలు
సాక్షి, అమరావతి : మహాత్మాగాందీని అవమానించే రీతిలో చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పవిత్ర ఉద్దేశ్యంతో దీక్షలు చేస్తే బాగుంటుంది కానీ, అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబు గురించి టీడీపీ నేతలు దీక్షలు చేయటం సిగ్గుచేటన్నారు.
దోపిడీ చేసి జైలుకెళ్లి బాబు దీక్షలు చేయటమేమిటని ఆయన ప్రశ్నించారు. మహాత్మాగాందీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలను సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వారిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట సాధనలో ఆ మహనీయుల త్యాగాలను, పోరాటాలను సజ్జల గుర్తుచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అడ్డంగా దొరికి జైలు ఊచలు లెక్కపెడుతున్న చంద్రబాబు సిగ్గులేకుండా గాంధీ జయంతి రోజున నిరాహారదీక్ష చేయడమేమిటి? మహాత్మాగాందీని అవమానించే రీతిలో ఆయన దీక్షలున్నాయి. బాబు ఆధారసహితంగా దొరికిపోవడంవల్లే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైలులో దీక్షలు చేయడం హాస్యాస్పదం. ప్రజల కోసం పోరాటంచేసి జైలుకెళ్తే వేరు. ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా దోచుకుని సత్యాగ్రహదీక్షలు ఎలా చేస్తారు. గాంధీ జయంతి రోజున ఉదాత్తమైన లక్ష్యాల కోసం దీక్షలు చెయ్యొచ్చు. కానీ ఒక అవినీతిపరుడు అడ్డంగా బుౖకై బరితెగింపుతో దీక్షలేంటి?
గాందీ, శాస్త్రీల ఆశయాలతో జగన్ ముందుకు..
అహింస, సహనం వంటివి ఉదాత్తమైన లక్షణాలు. వాటిని చెప్పే ముందు మనం ఆచరించాలి. వాస్తవ రూపంలో అది ఆచరించి చూపించటంవల్లే మన జాతిపిత మహానీయుడయ్యారు. లాల్‌బహుదూర్ శాస్త్రి స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేయడంతో పాటు విలువలతో కూడిన జీవితం గడిపారు. రాజకీయాల్లో ఆయన ఎందరికో మార్గదర్శకులు. వీరి వారి ఆశయాలను, ఆలోచనలను, స్ఫూర్తిని సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు.
కిందిస్థాయి నుంచి ఆయన మార్పులు తీసుకొస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిపాలనను ఎలా అందిస్తున్నారో వాటి ఫలితాలెలా ఉన్నాయో మనకు అర్థమవుతున్నాయి. అలాగే, గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సీఎం జగన్ పాలనలో కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలన్నీ గ్రామ, వార్డు సచివాలయాలవల్లే సాధ్యమవుతోంది. మరోవైపు.. రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ తయారవుతుంది. ప్రజలకు సంబందించిన ఆరోగ్యసేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయి. విద్యా, వైద్యరంగాలలో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే.
ప్రజల చేతుల్లోనే పాలన..
ఇక పేరుకు వైఎస్సార్‌సీపీ పాలన అయినా సీఎం జగన్ ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారు. వ్యవసాయరంగంలో కూడా రైతులకు మేలు చేసే విధానాలు అమలుచేస్తున్నాం. సీఎం జగన్ తన పరిపాలనతో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. అందుకే తన పాలనవల్ల మేలు జరిగితేనే తనకు మద్దతు ఇవ్వమని సీఎం జగన్ ధైర్యంగా చెప్పగలుగుతున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, శాసన మండలి చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీమంత్రులు శిద్ధా రాఘవరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment