సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నమ్మించి మోసగించడమే జన్మ లక్షణమైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా వెంటాడే సంఖ్య 23. నమ్మకద్రోహానికి ప్రజలు విధించిన శిక్ష ఈ 23. ఈ సంఖ్య వెనుక కథ చాలా పెద్దదే కాదు.. అత్యంత హేయమైంది కూడా. 2014లో... అన్నీ తానై.. తనవారిని గెలిపించుకున్న ఎంఎల్‌ఏల్లో 23 మంది, ఎంపీల్లో ముగ్గురు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు విసిరిన నోట్ల కట్టలకు లొంగిపోయారు. పదవులకు ఆశపడ్డారు. భవిష్యత్తును ఊహించుకుని పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019 నాటికి చంద్రబాబు కాటుకు వారంతా రాజకీయంగా బలయ్యారు. చంద్రబాబుకూ ఆ ఎన్నికల్లో 23 సంఖ్య శాపమై నిలిచి,, చరిత్రగా మారింది. ఆనాడు రాజకీయ వెన్నుపోటుకు పాల్పడిన వారు నేడేం చేస్తున్నారు? పశ్చాత్తాపం పడిన వారెందరు? రాజకీయంగా కనుమరుగైన వారెవరు? కుంగిపోయి కునారిల్లుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?.. వివరించే కథనమే ఇది.
23 మందిలో అద్దంకి నుంచి పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్ మినహా తక్కిన 22 మంది మాజీలయ్యారు. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన ఉప్పులేటి కల్పన (పామర్రు), పాలపర్తి డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), టి. జయరాములు (బద్వేలు), మణిగాంధీ (కోడుమూరు), మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ ఛాంద్‌బాషా (కదిరి), ఎస్వీ మోహన్‌రెడ్డి (కర్నూలు) వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు)కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు.
రాయలసీమలో గుర్తింపు కలిగిన భూమా నాగిరెడ్డి కుటుంబం పరిస్థితి రాజకీయంగా దుర్భరంగా మారింది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భూమా బ్రహ్మానంద రెడ్డిని కొన్ని నెలల కిందటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు ఎం.డి.ఫరూక్‌కు బాధ్యతలు అప్పగించారు. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సి.ఆదినారాయణరెడ్డి కుటుంబీకులదీ అదే దుస్థితి. గత ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన నాలుగు రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు.
ముగ్గురు ఎంపీల దుస్థితి అంతా ఇంతా కాదు
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన ఎంపీలలో ముగ్గురు ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ నిరాకరించడంతో జనసేన నుంచి నామినేషన్ వేశారు. ఆ తరువాత అనారోగ్యంతో మృతి చెందారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితీ అంతే. ఆమెకు టికెటు
దక్కకపోవడంతో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ అరకు లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. కర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.
కందుకూరు: పోతుల రామారావు
తన సామాజిక వర్గానికి చెందిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినందుకు పొగాకు, గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి చంద్రబాబు భారీగానే లబ్ధి చేకూర్చారన్నది బహిరంగ రహస్యం. 2019లో టికెట్ ఇచ్చినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో పోతుల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన క్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. పార్టీ అధిష్టానం సైతం రామారావును పూర్తిగా పక్కన పెట్టేసింది.
యర్రగొండపాలెం (ఎస్సీ): పాలపర్తి డేవిడ్‌రాజు
టీడీపీలోకి ఫిరాయించేందుకు పెద్దమొత్తంలో ముట్టజెపుతానని, వెలిగొండ ప్రాజెక్టులో ప్యాకేజీలిచ్చి భారీగా లబ్ధి చేకూర్చుతానని నమ్మబలికిన బాబు మాట తప్పారని డేవిడ్‌రాజు వాపోని రోజంటూ లేదని ఆయన సన్నిహితులు గుర్తుచేస్తుంటారు. 2019 ఎన్నికల్లో సీటు తిరస్కరించడంతో తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు అప్పట్లోనే డేవిడ్‌రాజు ప్రకటించుకున్నారు. బాబు మాటలను నమ్మి మోసపోయిన ఆయన తాజాగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించారనేది సమాచారం.
గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 79 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ జనసేనకు టికెట్ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి తానే పోటీ చేయనున్నట్లు ఆమంచి స్వాములు ప్రకటించుకోవడంతో ముత్తుముల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
పాడేరు (ఎస్టీ): గిడ్డి ఈశ్వరి
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చేతిలో దాదాపు 43 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు పనిచేస్తున్నాయి. గిడ్డి ఈశ్వరికి సీటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే.
పాతపట్నం– కలమట వెంకటరమణ
టీడీపీలోకి ఫిరాయించిన కలమట 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో టికెట్ అనుమానాస్పదమే. మామిడి గోవిందరావు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు.
అరకు (ఎస్టీ): శ్రావణ్‌కుమార్
2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన రెండేళ్ల తర్వాత మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌కు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి పోటీచేసిన శ్రావణ్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. రెండేళ్ల కిందట కిడారిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా తొలగించి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన సివేరి దొన్ను దొరను అరకు అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించారు. ఈయనే అసెంబ్లీ బరిలో ఉండవచ్చంటున్నారు.
రంపచోడవరం (ఎస్టీ): వంతల రాజేశ్వరి
టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరి 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో 39 వేలకు పైగా ఓట్లతో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న రాజేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తూ గొర్లె సునీత , కారం పోచమ్మ , మిరియాల శిరీష తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
గూడూరు (ఎస్సీ): పాశం సునీల్ కుమార్
టీడీపీ కండువా కప్పుకున్న పాశం సునీల్ కుమార్ 2019లో పోటీచేసి వి.వరప్రసాద్ చేతిలో 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా కొనసాగుతున్న సునీల్‌కు 2024 ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది.
జగ్గంపేట– జ్యోతుల నెహ్రూ
సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ జ్యోతుల చంటిబాబు చేతిలో 23 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా నెహ్రూ కొనసాగుతున్నప్పటికీ జగ్గంపేట నుంచి పోటీకి జనసేన పట్టుపడుతోంది. ఆ పార్టీ ఇన్‌చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రరావు సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు
టీడీపీ కండువా కప్పుకున్న వరుపులకు చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్ కాదుకదా కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వలేదు. సుబ్బారావును కాదని వరుపుల రాజా(గతేడాది చనిపోయారు)కు ఇచ్చారు. తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చిన వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
పలమనేరు– ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటేగౌడ చేతిలో 33 వేల ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
బొబ్బిలి– ఆర్‌వీఎస్‌కే రంగారావు (సుజయ్‌కృష్ణ రంగారావు)
టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రానున్న ఎన్నికల్లో ఆయన సోదరుడు బేబినాయనకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.
పామర్రు (ఎస్సీ): ఉప్పులేటి కల్పన
పామర్రు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
విజయవాడ వెస్ట్– జలీల్‌ఖాన్
టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ కుమార్తెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో జలీల్‌ఖాన్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కోరినా ఫలితం లేకుండా పోయింది.
జమ్మలమడుగు: సి.ఆదినారాయణరెడ్డి
వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 3.80 లక్షల ఓట్లు తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో రాష్ట్ర ఉపా«ధ్యక్షుడి హోదాలో ఉన్నారు.
బద్వేలు (ఎస్సీ) టి.జయరాములు
బద్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించిన తిరువీధి జయరాములుకు 2019లో టీడీపీ టికెట్ నిరాకరించింది. ఓబులాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ ఎన్నికల తర్వాత జయరాములు రాజకీయంగా కనుమరుగయ్యారు.
కదిరి– అత్తర్ చాంద్ బాషా
కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నారు.
శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్ రెడ్డి
టీడీపీలోకి వెళ్లిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమే. ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఆళ్లగడ్డ– భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన భూమా అఖిల ప్రియ టీడీపీలోచేరి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం భూమాకు పోటీ ఎదురవుతోంది. ఆళ్లగడ్డ కోసం జనసేన కూడా డిమాండ్ చేస్తోంది.
నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి
భూమా నాగిరెడ్డి చనిపోవడంతో 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కొన్ని నెలల కిందటి వరకు అతన్నే ఇన్‌చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఆయన్ను తప్పించి మాజీ మంత్రి ఎండీ ఫరూక్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.
కర్నూలు– ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు.
కోడుమూరు– మణిగాంధీ
మణిగాంధీ టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం ఇన్‌చార్జి పదవి కూడా కట్టబెట్టలేదు. తిరిగి వైసీపీలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment