సాక్షి, విజయవాడ: చంద్రబాబును మించిన 420 మరొకరు ఉండరని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం.. నగరంలోని పంజా సెంటర్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, అమరావతి పేరుతో వేల ఎకరాలు జేబులో పెట్టుకున్నారని, ప్రజలను ముంచే చంద్రబాబు రియల్టర్‌గా మారాడంటూ దుయ్యబట్టారు.
‘‘తన హయాంలో ప్రజల జీవితాలను చీకటిమయం చేశారు. తనను తాను తిట్టుకోవాల్సిన బాబు.. సీఎం జగన్‌ను తిడుతున్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలవుతుందని రాద్ధాంతం చేశారు. ఏపీలో మరో శ్రీలంక అవుతుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడేమో జగన్ రూపాయి ఇస్తే.. మేం రూ.100 ఇస్తామని హామీలు ఇస్తున్నారు. నాశనం చేయడంలో చంద్రబాబుకు వరల్డ్ రికార్డ్ ఇవొచ్చు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.
‘‘మరో తొమ్మిది నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు అండ్ ఆర్కెస్ట్రా టీమ్ జనంలోకి వస్తోంది. గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పడానికి చంద్రబాబు, లోకేష్ వద్ద సమాధానం లేదు. చంద్రబాబు తనను తాను అద్దంలో చూసుకుని తిట్టుకోవాలి. మొన్నటి వరకూ ఏపీని శ్రీలంక అయిపోతుందని విమర్శించారు. ఇప్పుడు తానొస్తే మరొక ఐదు వేలు ఎక్కువ ఇస్తానంటున్నాడు. గత ఐదేళ్లలో చెప్పిన అబద్ధాలే మళ్లీ చెబుతున్నాడు. మళ్లీ ఏ ధైర్యంతో చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నాడు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
‘‘ప్రజలను మళ్లీ భ్రమలో పెట్టి కొడుకును అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వసనీయత, చిత్తశుద్ధి ఎలా ఉండాలో లోకేష్ కు చంద్రబాబు నేర్పిస్తే బాగుంటుంది. తనలాగే చంద్రబాబు కొడుక్కి కూడా దొంగపనులే నేర్పిస్తున్నాడు. అడ్డదారులు తెలిసిన చంద్రబాబుకి అంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి. వైఎస్ జగన్ వచ్చాకే విజయవాడలో అసలైన అభివృద్ధి జరిగింది. గతంలో చంద్రబాబు విజయవాడను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్‌ను మధ్యలో నిలిపివేశాడు. బెజవాడలో సగం గోడలు లేపి ఫ్లై ఓవర్లను వదిలేశాడు. విజయవాడ, గుంటూరు అభివృద్ధి కాకుండా అమరావతి ఎలా అభివృద్ధి అవుతుంది కృష్ణాజిల్లా అంతా ఎడారిగా మారిపోవాలనేదే చంద్రబాబు ఆలోచన’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.
‘‘రాత్రికి రాత్రి వేల కోట్లు సంపాదించాలనుకునే 420 రియల్ ఎస్టేట్ బ్రోకర్ కే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. తనతో పాటు తన బ్రోకర్లు బాగుపడటానికి కృష్ణాజిల్లాకు అన్యాయం చేశాడు. తన వద్ద పెట్టుకున్న 30 వేల ఎకరాలు మాత్రమే డెవలప్ కావాలని చంద్రబాబు అనుకున్నాడు. చంద్రబాబు చేసిన పనులను జనం మర్చిపోలేదు. ఇదే బెజవాడ రోడ్లపై మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లేయమని అడిగితే జనం ఓటేయలేదు. జన్మభూమి కమిటీల్లో సూచించినట్లుగా పథకాలిచ్చే రోజులు పోయాయ్. అర్హులైన ప్రతీ ఒక్కరికీ మా ప్రభుత్వంలో పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్‌కి తెలిసిందల్లా విలువలతో కూడిన రాజకీయం. చంద్రబాబుకు, ఆయన ఇంట్లో పనిచేసే వారికి కూడా పథకాలు అందుతున్నాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: CM Jagan: గౌరవం చేతల్లోనూ..
‘‘దోపిడీ ముఠా మాదిరిగా... ఆర్కెస్ట్రా టీమ్‌లు రాష్ట్రమంతా తిరుగుతున్నాయి. మనిషనేవాడు ఎవడైనా పుంగనూరులో అలా చేస్తాడా. అంగళ్ల వద్ద చంద్రబాబు మాటలు వింటే సభ్యసమాజంలో ఎవరైనా మాట్లాడతారా అనిపిస్తుంది. పొరబాటున కాల్పులు జరిగి ఎవరైనా చనిపోతే ఎవరిది బాధ్యత. తన కార్యకర్తల ప్రాణాలు పోయినా చంద్రబాబుకు పర్వాలేదు. చంద్రబాబు నైజాన్ని ఆయన తోడల్లుడు ఎప్పుడో పుస్తకంలో రాశాడు. జగన్ వంటి నాయకుడు వచ్చాకే చిత్తశుద్ధి, విశ్వసనీయతకు అర్ధం దొరికింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ప్రజల వద్దకు ఓట్లడిగే హక్కు ఉంది. టీడీపీకి ఈసారి డిపాజిట్లు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి రావాలంటే మనమంతా కలిసి పనిచేయాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘పవన్ కల్యాణ్‌కు ఏమైంది. పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. పార్టీని బలోపేతం చేసుకోవచ్చు కదా.. ఎవరొద్దన్నారు. ముఖ్యమంత్రిని కావడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తాడు. పవన్, చంద్రబాబు భ్రమల సేజ్ దాటిపోయారు.. అహంకారం పెరిగిపోయింది. వారు ఏం అనుకుంటే అదే జరుగుతుందని అనుకుంటున్నారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో రెండింతల ఫలితాలతో విజయం సాధించాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment