సాక్షి, విజయవాడ: రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని.. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షర్మిల మాట్లాడిన ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు.
‘‘షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారు. రావటమే మాపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఆమెకి ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేదు. వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే. జగన్ కి చెల్లెలుగా, వైఎస్సార్ కి కూతురిగా మాత్రమే షర్మిళ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు. తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిళ స్పష్టంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
‘‘వైఎస్సార్‌టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టారు, తర్వాత తీసేశారు. మరి ఆ పార్టీ కోసం పని చేసినవారికి ఆమె ఏం చేశారు?. జగన్ కోసం లక్షలాది మంది ఆనాడు కదిలి వచ్చారు. ఓదార్పు యాత్ర వద్దన్నందుకు జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. సొంత బాబాయి వివేకానందరెడ్డితో ఎదురు పోటీ చేయించారు. 16 నెలలు జైల్లో పెట్టించారు. అక్రమ కేసులని అందరికీ తెలుసు. సీబిఐ అప్పటి అధికారి లక్ష్మీనారాయణ సైతం ఆ కేసుల్లో అవినీతి లేదని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని కూడా షర్మిల అంటున్నారంటే.. ఆ స్క్రిప్టు ఎవరి నుండి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు’’ అని సజ్జల దుయ్యబట్టారు.
షర్మిల అబద్దాలను ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా మేము విషెష్ చెప్పాం. సీఎం జగన్‌ని విమర్శించిన రోజే షర్మిలను ఎల్లోమీడియా భుజాన వేసుకుంటోంది. ఎల్లోమీడియా ఏనాడైనా అంతకుముందు ఎందుకు షర్మిళ గురించి గొప్పగా రాయలేదు?. వైఎస్సార్ గురించి ఆర్కే ఇష్టానుసారం మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు?. ఇవన్నీ షర్మిలకు ఎందుకు కనపడలేదు?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
‘‘ఏం ఆశించి అన్న కోసం తిరిగావో షర్మిల చెప్పాలి?. ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీవా?. మరెందుకని బీజేపీ కలిశామని ఆరోపణలు చేస్తారు?. స్టీల్ ప్లాంట్ గురించి మేము చేయాల్సిన పోరాటం చేశాం. కాబట్టే ప్రస్తుతం అది ఆగింది. పోర్టుల గురించి తలాతోక షర్మిళ మాట్లాడటం సబబు కాదు. మణిపూర్ విషయం గురించి షర్మిల పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?. ఏపీలోకి వచ్చాకే ఎందుకు మాట్లాడుతున్నారు?. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు షర్మిళను తెచ్చారు. చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిళ మాట్లాడుతోంది. అంతకంటే ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకోడు. ఈ 56 నెలల్లో చేసిన అభివృద్ధి గురించి జగన్ మాట్లాడితే దాన్ని ఎల్లోమీడియా వక్రీకరించింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందున నా జన్మధన్యం అయిందని చెప్పిన మాటలను కూడా ఎల్లోమీడియా వక్రీకరించింది’’ అని సజ్జల పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టార్గెట్ 175.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం: సజ్జల
‘‘ప్రజలకు అవసరమైన అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. చంద్రబాబులాగా పనికిమాలిన గోబెల్స్ ప్రచారం కోసం మేము ఖర్చు చేయటం లేదు. చంద్రబాబు మాట్లాడే మాటలే షర్మిల ఎలా మాట్లాడుతోంది?. వారి మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో చెప్పాలి’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment