
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం పట్టని చంద్రబాబు జూమ్ యాప్‌లోనే ఎక్కువగా కనబడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను రెచ్చగొచ్చేలా బాబు ప్రయత్నిస్తున్నారని, అమరావతి అభివృద్ధి చెందితే రాష్ర్టం అభివృద్ధి చెందినట్లు కాదా అంటూ సజ్జల ప్రశ్నించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని సరికాదని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా అమరావతి అంశం లేవనెత్తలేదని , కేవలం ఆయన స్వప్రయోజనాలకే రాష్ర్టంలో గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల బాబు పాలనలో అమరావతిలో మాయాబజార్ చూపించారని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే రాజధానిగా అమరావతిని ఎంచుకున్నారు. బాబు నిర్ణయంతో ఎంతోమంది అమరావతి రైతులు నష్టపోయారని తెలిపారు. ('చంద్రబాబును నమ్మితే రాజకీయ సమాధి ఖాయం')