
సాక్షి, అమరావతి: బీసీ కులాల ప్రతినిధులతో పాటు అన్ని వర్గాలకు ఏ సాయం కావాలన్నా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సంప్రదించవచ్చని, తక్షణమే ముందుండి సాయమందిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం బొందిలి కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశం బొందిలి కార్పొరేషన్ చైర్మన్ ఎస్.కిషోర్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ‘సజ్జల’ మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా పథకాలకు సంబంధించి సాయం కావాలంటే రాష్ట్ర బీసీసంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ సైతం అందుబాటులో ఉంటారన్నారు.
టీడీపీ లాంటి దుర్మార్గ, దౌర్భాగ్యకరమైన పార్టీ దేశంలో ఎక్కడా ఉండదని దుయ్యబట్టారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంటే కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గ వైఖరి టీడీపీ వారు అవలంబిస్తున్నారని విమర్శించారు. ఏ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నదన్నారు. బీజేపీ సైతం చిన్న ఘటనలను భూతద్దంలో చూపుతూ మతప్రాతిపదికన విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా.. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చనే విధానం సీఎం జగన్ తీసుకొచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment