సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల వివరాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తోందని.. ఆ సర్వేలోనే దొంగ ఓట్లు, అసలు ఓట్ల సంగతేంటో తెలిసిందని.. అలాంటిది టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై కొత్తగా డ్రామాలాడటమేంటని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక డ్రామా ఆడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈసీకి లేఖలు, ఢిల్లీ పర్యటనలు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డేటాను టీడీపీ చౌర్యం చేసి, ఎలా దొరికిపోయిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన మాటలు నమ్మే పరిస్థితిలేదు. బౌన్సర్లతో, కిరాయి జనంతో, రాజకీయ కూలీలతో లోకేశ్ చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది?
ధర్మ ప్రచార పర్యవేక్షణకు ఏడుగురితో కమిటీ..
సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈనెల 6న అన్నవరంలో ప్రారంభమైన ధర్మ ప్రచార కార్యక్రమం అన్నిచోట్లా కొనసాగుతాయి. ఈ ధర్మ ప్రచార కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాం. అలాగే, ఐదు లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటివరకు వంశపారంపర్య ధర్మకర్తలు లేదా అర్చకుల నుంచి 37 దరఖాస్తులు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment