
ముంబై: లఖిమ్‌పుర్ సంఘటనను తాను జలియన్‌వాలాబాగ్ ఘటనతో పోల్చినందుకే కక్ష కట్టి తమ పార్టీనేత అజిత్ పవార్ బంధువుల ఆస్తులపై ఐటీ దాడులు చేశారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ దుయ్యబట్టారు. దేశంలో వాక్‌స్వాతంత్య్రం ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. అజిత్, ఆయన బంధువులకు చెందిన పలు ఆస్తులపై గురువా రం ఐటీ శాఖ విస్తృతదాడులు జరిపింది.
అంతకుముందు మంగళవారం లఖిమ్‌పూర్ ఘటనను జలియన్‌వాలాబాగ్ ఘటనతో పోలుస్తూ శరద్ పవార్ ఆరోపణలు చేశారు. వీటి వల్లనే అజిత్‌పై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని తాజాగా విమర్శ లు చేశారు. తమ మహాఅఘాఢీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అన్ని రకాలుగా యత్ని స్తోందని పవార్ ఆరోపించారు. రాష్ట్రానికి పన్నుల్లో రావాల్సిన సక్రమవాటాను కూడా ఇవ్వడంలేదన్నారు. బీజేపీ రైతు వ్యతిరేకమని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని నిప్పు లు చెరిగారు. లఖిమ్‌పూర్ ఘటనను నిరసిస్తూ ఈనెల 11న చేపట్టే మహారాష్ట్ర బంద్‌కు అంతా సహకరించాలని పిలుపునిచ్చారు.