లక్నో: అయిదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో దేశంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికల, ప్రచార వ్యూహాలతో జిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న యూపీ ఎన్నికలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శివసేన పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకుగాను 50 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో తాము కూడా బరిలో దిగబోతున్నామని చెప్పారు.
యూపీలో రాజకీయ అనిశ్చితి ఉందన్న ఆయన.. యోగి పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. బీజేపీని గద్దె దించేందుకు ఎస్పీ, బీఎస్పీ సహా అన్ని పార్టీలు ఏకీకృతం కావాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అటు ఎన్నికలకు ముందు కార్మికశాఖ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య సహా నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని సంజయ్ రౌత్ అన్నారు.
చదవండి: 10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'.. ప్లాన్ రెడీ చేసిన అరవింద్ కేజ్రీవాల్
కాగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఇప్పటికే యూపీలో అధికార బీజేపీ విపక్ష ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఎస్పీ, స్థానిక చిన్న పార్టీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎంఐఏం కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఇదిలా ఉండగా మార్చి 10వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి.
చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో..
Comments
Please login to add a commentAdd a comment