సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే..
పంచుతున్నాడంటున్నారే గానీ..
గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్‌విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు.
కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు. – రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
సీఎం జగన్‌కు చెడు తలపెట్టాలని కుట్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు.
సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. – ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
సీఎం జగన్‌ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు
పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ దేశంలో నంబర్ వన్ నాయకుడు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం.
– భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ప్రతి ఒక్కరూ సైన్యమై కదలాలి
జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి.
పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్‌సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి. – మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
అంబేడ్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక సీఎం జగన్
పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు.
ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్‌నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి. – పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
Comments
Please login to add a commentAdd a comment