తెలంగాణలో తొలి నియోజకవర్గం అయిన సిర్పూర్ కాగజ్‌నగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కోనేరు కోనప్ప 2018లో మరోసారి విజయం సాదించారు. ఆయన గత ఎన్నికలలో బహుజన సమాజవాది పార్టీ తరపున పోటీచేసి గెలుపొంది, తదుపరి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో టిఆర్‌ఎస్ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుపై 24144 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సిర్పూర్‌లో బిజెపి అభ్యర్ధి శ్రీనివాసులు 5813 మూడోస్థానంలో ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ఐ పక్షాన కూడా కోనప్ప గెలిచారు.
ఈయన కమ్మ సమాజిక వర్గానికి చెందినవారు. కాగా ఓటమి చెందిన హరీష్‌బాబు తల్లిదండ్రులు పురు షోత్తంరావు, రాజ్యలక్ష్మీ ఇద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కోనప్ప మూడుసార్లు గెలవగా, గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన కెవి నారాయణ రావు రెండుసార్లు గెలిచారు. దాంతో ఐదుసార్లు కమ్మ నేతలు గెలిచినట్లయింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణ అంతటా 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం బలంగా వీచి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని తొలి నియోజకవర్గం అయిన సిర్పూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోవడం ఒక సంచలనం అయితే బిఎస్పి పార్టీ గుర్తుపై కోనేరు కోనప్ప 8837 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం మరో సంచలనంగా చెప్పాలి. 2014లో సిర్పూరులో కోనప్పకు 31359 ఓట్లు రాగా, టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కావేటి సమ్మయ్యకు40196 ఓట్లు రాగా, కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్ రావుకు 26956 ఓట్లు, టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధి రావి శ్రీనివాసరావుకు 19359 ఓట్లు వచ్చాయి. కోనప్ప రెండువేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు.
తదుపరి జరిగిన వివిధ పరిణామాలలో ఆయన మొదట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐలో తిరిగి చేరినా, టిక్కెట్ రాని నేపధ్యంలో బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసి గెలుపొందడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఈయనతో సహా ఐదుసార్లు కమ్మ నేతలు గెలుపొందగా, వెలమ నేతలు మూడుసార్లు గెలిచారు. బీసీ నేతలు నాలుగుసార్లు, రెడ్డి నేతలు రెండుసార్లు, దళిత నేతలు మూడుసార్లు విజయం సాధించారు. రెండువేల తొమ్మిదిలో గెలుపొందిన సమ్మయ్య తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒకసారి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా కావేటి సమ్మయ్య తిరిగి పదిహేనువేలకుపైగా మెజారిటీతో రెండోసారి గెలిచారు. ఆ ఉప ఎన్నికలో ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఐ సీనియర్ నేత మాజీ ఎం.పి ఇంద్రకరణ్‌రెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే పి.రాజ్యలక్ష్మి ఓడిపోయారు.
తదుపరి ఇంద్రకరణ్ రెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 1952 నుంచి సిర్పూరు నియోజకవర్గం ఉంది. తొలి రోజుల్లో ఈ ప్రాంతంలో సోషలిస్టు ప్రభావం అధికంగా ఉండేది. 1952, 57లలో సోషలిస్టు అభ్యర్దులు గెలుపొందారు. 1957లో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గం ఉండేది. అంటే అప్పట్లో ఒకే నియోజకవర్గం నుంచి ఒక జనరల్ అభ్యర్ధిని, ఒక రిజర్వుడు కేటగిరి అభ్యర్దిని ఎన్ను కోవాలన్నమాట. విశేషం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్దులు ఎస్.సి అభ్యర్థులే గెలుపొందారు. వీరిద్దరూ ఆ తరువాత కాలంలో ప్రముఖ నేతలుగా ప్రసిద్ధిగాంచారు. కోదాటి రాజమల్లు ప్రజాసోషలిస్టు పార్టీ అభ్యర్దిగా గెలుపొందితే, మరొకరు జి. వెంకటస్వామి కాంగ్రెస్ పక్షాన గెలిచారు. ప్రముఖ కార్మిక నేత జి. సంజీవరెడ్డి రెండుసార్లు, ఇంకో ప్రముఖ స్వాతంత్య్రయోధుడు కె.వి.కేశవులు రెండుసార్లు గెలుపొందగా, టిడిపి ఆవిర్భావం తరువాత కె.వి.నారాయణరావు రెండుసార్లు, పాల్వాయి పురుషోత్తంరావు రెండుసార్లు ఇండిపెండెంటుగా గెలుపొందగా, పురుషోత్తంరావు భార్య పి. రాజ్యలక్ష్మి ఒకసారి టిడిపి తరపున గెలిచారు.
తొలిసారి 1983లో టిడిపి అక్కడ గెలిచింది. అప్పటి నుంచి 2004లో కోనప్ప కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచేవరకు అక్కడ కాంగ్రెస్ ఐకి అవకాశం రాలేదు. మళ్ళీ 2009లో టిఆర్‌ఎస్ గెలవడం విశేషం. అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, సోషలిస్టు ఒకసారి, ప్రజాసోషలిస్టు పార్టీ ఒకసారి, టిఆర్‌ఎస్ మూడుసార్లు గెలవగా, టిడిపి మూడుసార్లు గెలిచింది. ఇండిపెండెంట్ రెండుసార్లు గెలిచారు. కోదాటి రాజమల్లు ఇక్కడ ఒకసారి, లక్సెట్టిపేటలో సోషలిస్టుగా ఒకసారి, చిన్నూరు నుంచి కాంగ్రెస్ తరుఫున మూడుసార్లు మొత్తం ఐదుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. ఒకసారి అసెంబ్లీకి ఎన్నికైన వెంకటస్వామి ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు.
రాజమల్లు, కె.వి.కేశవులు గతంలో జలగం వెంగళరావు క్యాబినెట్‌లో మంత్రి పదవులు నిర్వహించారు. కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్‌లో జి.సంజీవరెడ్డి మంత్రిగా ఉన్నారు. వెంకటస్వామి రాష్ట్రంలోను, కేంద్రంలోను మంత్రిగా పనిచేశారు. వెంకటస్వామి ఎమ్మెల్సీగా కూడా కొంతకాలం ఉన్నారు. ఇండిపెండెంట్‌గా రెండుసార్లు గెలిచిన పాల్వాయి పురుషోత్తంరావు 1999 నాటికి టిడిపిలో చేరిపోయారు. అయితే ఎన్నికలు జరగడానికి ముందే పురుషోత్తంరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆయన భార్యకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఒకసారి గెలిచిన ఆమె ఆ తరువాత 2004లో పోటీచేసి ఓడిపోయారు.
సిర్పూరులో ఎవరెవరు.. ఎప్పుడు.. ఎలా గెలిచారంటే..
Comments
Please login to add a commentAdd a comment