
కర్నూలు కల్చరల్: బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని, రెండు పార్టీల పెద్దలు చర్చించుకుని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలతో సమాన దూరంలో వెళ్లాలని అమిత్‌షా నిర్ణయించి దిశా నిర్దేశం చేశారని తెలిపారు. కర్నూలులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్‌సీ జీవోను వెంటనే రద్దుచేయాలని, ఉద్యోగులను మళ్లీ చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ పోరాడుతుందని, వారి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఎస్‌డీపీఐ నేత అతావుల్లాను అరెస్ట్ చేయాలని, రాష్ట్రంలో ఎస్‌డీపీఐని నిషే«ధించాలని డిమాండ్ చేశారు. ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసిన నిధులపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు