ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అకృత్యాలకు జనం బలి అవుతున్నారు. తమ ప్రచార యావ ముందు ఏదీ కనిపించదని వారు పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కందుకూరు వద్ద జరిగిన ఘటనలో ఎనిమిది మంది మరణించిన ఘటనను మరవక ముందే గుంటూరులో మరో దారుణం జరిగింది.
ఇక్కడ ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. రెండు చోట్ల టీడీపీకి ఒకటే లక్ష్యం. జనాన్ని పోగు చేయడం, భారీగా తరలివచ్చారని తమ మీడియాలో డ్రోన్ షాట్ల ద్వారా భ్రమలు కల్పించడం. జనం రారేమో అనుకున్న చోట వారికి తాయిలాలు ఇస్తామని ఊరించడం, సభలకు జనాన్ని తరలించడం అన్నది కొత్తగా జరిగేది కాదు.
కాని దానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించాలి. కాని ఇందులో కూడా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది విలక్షణ శైలి. ఆయనకు ఈ విద్య కొత్తగా వచ్చింది కాదు. ఆయన రాజకీయాలలోకి వచ్చింది మొదలు ఇలాంటివి ఎన్నో చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కొత్త పుంతలు తొక్కించారు. జనానికి డబ్బులు ఇవ్వవచ్చని, డ్వాక్రా మహిళలను, ఇతర లబ్దిదారులను సభలకు తరలించవచ్చని కనిపెట్టింది ఆయనే.
పార్టీ పరంగా ఏదైనా సభ జరిపితే హైదరాబాద్ నుంచి పార్టీ స్థానిక నేతలకు పెద్ద ఎత్తున డబ్బు పంపించడం ఆయనకు అలవాటే. వచ్చిన వారికి మందు పోయించడం మామూలే. కాని ఇటీవలికాలంలో తెలుగుదేశం కాని, చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు చాలా అధమ స్థాయికి చేరుతున్నాయని అనడానికి కందుకూరు, గుంటూరు సభల విషాదాలే ఉదాహరణగా నిలుస్తాయి. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూనో, ఇతరత్రానో సభలు పెట్టినప్పుడు లేదా రోడ్ షోలు నిర్వహించినప్పుడు విపరీతంగా జనం వచ్చేవారు.
అయితే టీడీపీ మీడియా వారు ఏమనుకున్నారంటే పై నుంచి ఫోటోలు తీయడం వల్ల జనం బాగా వచ్చినట్లు కనిపిస్తున్నారని అనుకుని టీడీపీ వారికి కూడా ఇదే సలహా ఇచ్చారు. అందులోను చంద్రబాబు ఇలాంటి ప్రచారాలలో మరీ ముందంజలో ఉంటారు. వెంటనే ఆయన అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని పార్టీ వారిని పురమాయిస్తుంటారు. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత, స్థానిక ఎన్నికలలో ఓటమి తర్వాత ఈ ప్రచార పిచ్చి బాగా పెరిగింది. ఇటీవలి కాలంలో రకరకాల పేర్లతో చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కర్నూలు రోడ్డులో సభ పెట్టి, ఇంత జనం తన జీవితంలో చూడలేదని అన్నారు. ఆయన మాటలకు కర్నూలు వారు కాదు కాని, ఇతర ప్రాంతాలవారు అవునా నిజమా అని ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఒక రోడ్డు మీద జనాన్ని పోగు చేసి, పైనుంచి ఫోటో తీసి అబ్బో అనుకుంటే ఏమి ఉపయోగం. నిజంగా జనం పెద్ద ఎత్తున స్వచ్చందంగా రావాలి.. వచ్చిన ప్రజలలో అభిమానం ఉండాలి కాని. అక్కడ నుంచి టీడీపీకి ఈ డ్రోన్‌ల పిచ్చి ముదిరింది. ఒక వైపు ముఖ్యమంత్రి జగన్ తన సభలను విశాలమైన మైదానాలలో పెడుతుంటే చుట్టు పక్కల కూడా జనం కిక్కిరిసి కనబడుతుంటారు. మరో వైపు చంద్రబాబు సభలేమో ఇరుకు రోడ్లలో పెట్టి డ్రోన్ ఫోటో తీసి వారికి వారే మురిసిపోతున్నారు.
వారు మురిస్తే ఇబ్బంది లేదు. కాని జనాన్ని చావ కొడుతున్నారు. పైగా అలా మరణించిన వారు ఫలానా కులం అని, రాష్ట్రం కోసం త్యాగం చేశారని దిక్కుమాలిన ఫిలాసఫీ చెప్పి ప్రజలను మరింతగా అవమానిస్తున్నారు. కందుకూరులో నిర్దిష్ట చోట కాకుండా ఇరుకు రోడ్డులో సభ పెట్టారు. అక్కడ తొక్కిసలాట జరిగి, కొందరు చనిపోతే, అక్కడ ఉన్న సభికులను తాను వెళ్లి చూసి వస్తానని, తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండని చంద్రబాబు చెప్పడం పరాకాష్టగా భావించాలి. ఆ తర్వాత ఆ కార్యక్రమాలను వాయిదా వేసుకోకుండా కావలి, కోవూరు తదితర చోట్ల కూడా ఇవే షోలు నడిపారు. అక్కడితో ఆగలేదు. గుంటూరులో మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు వస్తున్నారు.
సంక్రాంతి కిట్‌లు ఇస్తారు అంటూ పది రోజుల నుంచే ప్రచారం చేశారట. ఏదో గతంలో డబ్బిచ్చి జనాన్ని మళ్లించడం చూశాం. కాని ఇప్పుడు సంక్రాంతి సరుకులు ఇస్తాం సభకు రండి అని పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం చూస్తున్నాం. పాపం.. వారంతా సభకు నాలుగు గంటల ముందు వచ్చారట. చాలామంది నిలబడే ఉండాల్సి వచ్చిందట. చంద్రబాబు స్పీచ్ అయ్యేవరకు ఓపికగా ఉన్న జనానికి తమకు సంక్రాంతి కిట్లు అందడం లేదని తెలుసుకుని ఒక్కసారిగా తోసుకు రావడంతో ముగ్గురు మరణించడం, పలువురు గాయపడడం జరిగింది.
ఈ రెండు ఘటనలకు కారణం తెలుగుదేశం నేతల నిర్వాకం. కాని టీడీపీ మీడియా, పార్టీ నేతలు దీనిని పోలీసులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈనాడు మీడియా అయితే ఈ వార్తల కవరేజీలో ఇంతగా దిగజారి పోతుందని అనుకోలేదు. గుంటూరు ఘటన లో స్థానికులదే తప్పన్నట్లుగా, వేలాది కిట్లు ఉన్నా సరిగా నిర్వహించలేకపోయినట్లు ప్రచారం చేశారు. అసలు ఈ ఘటన వార్తను ఏదో మొక్కుబడిగా ఇచ్చారు తప్ప, జర్నలిజం ప్రమాణాలకు తగినట్లుగా ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. ఏదో షాపుల వారు తమ ప్రచారం కోసం చీరలు ఇస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించడం, అందరికి ఇవ్వలేక చేతులు ఎత్తివేయడం, దాంతో పోలీసులు జోక్యం చేసుకోవల్సి రావడం జరుగుతుంటాయి.
సరిగ్గా అదే రీతిలో తెలుగుదేశం పార్టీ కూడా జనాన్ని తరలించడానికి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్స్ వేస్తుంటే, వాటి గురించి రాయవలసిన ఈనాడు మీడియా, మిగిలిన టీడీపీ మీడియా మాదిరే మరీ నగ్నంగా కనిపించడానికి సిగ్గుపడడం లేదు. కందుకూరులో బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు ఉవాచ. రాష్ట్రం కోసం ఆయన ఉద్యమం చేస్తున్నారట. ఆయన తంటాలన్నీ ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధలుగా మారారని ఆయన చెబుతున్నారు.
చదవండి: కాటేసిన కానుక!
ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే, అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?. కుంభమేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. ఆ మధ్య మాచర్లలో ఒక టీడీపీ కార్యకర్త స్థానిక గొడవల్లో హత్యకు గురైతే దానికి రాజకీయం పులిమి, అతని పాడె కూడా మోసి చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నించారు. మరి ఈ ఘటనలలో చనిపోవడానికి టీడీపీనే కారణం. అయినా మరి డబ్బు ఇచ్చి ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైనవారిపై కేసులు పెట్టవలసి ఉంటుంది. అలా చేసిన వెంటనే అక్రమ కేసులు అంటూ మళ్లీ వీరే ప్రచారం చేస్తుంటారు. ఏది ఏమైనా టీడీపీ ప్రచార పిచ్చి ఏపీ ప్రజలకు కర్మగా మారుతోంది.
-హితైషి
Comments
Please login to add a commentAdd a comment