కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఘటనను ఖండిస్తూ వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడు. దాంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైనా కాల్పులు జరపాలంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైనా తానేమీ నిరుత్సాహపడబోనని సదరు స్టూడెంట్ రాసుకొచ్చాడు.
ఈ పోస్టును చూసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు బీకాం సెకండియర్ చదువుతున్న కీర్తిశర్మగా పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థి బెదిరింపు పోస్టు.. రెచ్చగొట్టేదిగా, వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేదిలా ఉందని తెలిపారు.
అంతేకాదు, ఈ నెల 9న కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో హత్యాచారానికి గురైన బాధితురాలి పేరు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. దీంతో సీఎంపై హత్యాయత్నానికి, అల్లర్లకు రెచ్చగొట్టడం, అత్యాచార బాధితురాలి వివరాలను బయటపెట్టడం తదితర నేరాల కింద స్టూడెంట్ ను అరెస్టు చేసినట్లు కోల్ కతా పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment