చెన్నై: ప్రముఖ తమిళ నటుడు, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) అధినేత విజయకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీట్ల కేటాయింపు అంశంలో విభేదాలు తలెత్తడంతో అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి వైదొలిగారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సమావేశం అనంతరం.. ‘‘రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు దశల్లో అన్నాడీంఎకేతో చర్చలు జరిగాయి. అయితే మేం కోరిన స్థానాల్లో, కోరినన్ని సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే నిరాకరించింది. మా చర్చలు సఫలం కాలేదు. వెంటనే డీఎండీకే జిల్లా సెక్రటరీలతో మాట్లాడాను. కూటమి నుంచి వైదొలిగాం. నేటి నుంచి ఇక డీఎండీకే, అన్నాడీఎంకేతో కలిసి ముందుకు సాగదు’’ అని విజయకాంత్ ప్రకటన విడుదల చేశారు. అయితే, తదుపరి కార్యాచరణ ఇంకా ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా గత శాసన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమితో జట్టుకట్టిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయిప్పటికీ, తాజా ఎన్నికల్లో తమకు 23 సీట్లు ఇవ్వాలని డీఎండీకే పట్టుబట్టినట్లు సమాచారం. కానీ, అన్నాడీఎంకే మాత్రం కేవలం 15 సీట్లు ఇచ్చేందుకే మొగ్గు చూపడం, అది కూడా వాళ్లు కోరిన స్థానాల్లో కాకుండా వేరే చోట్ల కేటాయిస్తామనడంతో విజయకాంత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, డీఎండీకే బలం తగ్గినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మేర అయినా ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు 23 సీట్లు, బీజేపీకి 20 సీట్లను కేటాయించినట్టు సమాచారాలు వెలువడ్డా, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ కూటమిలోని జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పపదిహేను మేరకు సీట్లను వాసన్ ఆశిస్తుండగా, పీఎంకేతో సమానంగా సీట్లు కేటాయించాలని పట్టుబట్టిన డీఎండీకే వైదొలగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment