పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు' TDP Chandrababu Govt Demolished YSRCP Party Office | Sakshi
Sakshi News home page

పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'

Published Sun, Jun 23 2024 4:27 AM | Last Updated on Sun, Jun 23 2024 7:31 AM

తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పొక్లెయిన్‌లతో  కూల్చివేయిస్తున్న అధికారులు

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్‌  

శనివారం ఉదయం 5:30 గంటలకు పొక్లెయిన్‌లు, బుల్‌డోజర్లతో కూల్చివేసిన సీఆర్‌డీఏ అధికారులు 

అంతకుముందే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ 

చట్టాన్ని మీరి వ్యవహరించ వద్దని హైకోర్టు ఆదేశం  

ఆ సమాచారాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌కు తెలియజేసిన వైఎస్సార్‌సీపీ న్యాయవాది 

అయినప్పటికీ ప్రొసీడింగ్స్‌ అందలేదన్న పేరుతో కూల్చివేత

సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్‌ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్‌ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. 

నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్‌డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్‌డీఏ అధికారులు, మున్సిపల్‌ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు.   

పక్కాగా లీజున్నా దౌర్జన్యం 
గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్‌ యార్డు వద్ద సర్వే నంబర్‌ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్‌ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్‌ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. 

ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్‌డీఏకు లేఖ రాశారు. 
 


ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్‌ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్‌ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్‌డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్‌ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్‌డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్‌డీఏ కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఫోన్‌ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్‌డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు.  

నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం 

రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మ­కూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూ­మి­ని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయా­న్ని నిర్మించింది. 

టీడీపీ రాష్ట్ర కార్యాలయం  

మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.­వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్‌ప్రసాద్‌.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశా­రు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్‌సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement