బంగారు కడియం ఆశ చూపించి బాటసారులను బురదలోకి దించి వాళ్ళు అందులో చిక్కుకోగానే తన అసలు రూపం చూపించి గుటుక్కున మింగేసే కథను ఎన్నిసార్లు వింటున్నా ఇంకా బాటసారులు అలాంటి పులినోటికి చిక్కుతూనే ఉన్నారు. కాకుంటే వాళ్లంతా నిజమైన పెద్ద పులి నోటికి చిక్కితే ఇప్పుడు కొంతమంది రాజకీయ బాటసారులు ఇలాగే రాజకీయ పులి నోటికి చిక్కుతున్నారు.
ఇక్కడ ఆ రాజకీయ పులిగా చంద్రబాబు తనను తాను అనుకోగా.. ఆ బాటసారులు ఉండవల్లి శ్రీదేవి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఆనం రామనారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంకా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వీళ్లంతా అలా చంద్రబాబు నోటికి చిక్కారు. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు.. ఎండుచేప ముక్కకు ఆశపడి బోనులో ఎలుకలు చిక్కుకున్నట్టు ఆ నాయకులంతా చంద్రబాబు ట్రాపులో పడిపోయారు. ఇప్పుడు బోనులోనుంచి బయటకు రాలేరు.. అందులో ఉంటే బతుకు లేదు. వాస్తవానికి ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఏడాది క్రితమే కసరత్తు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గాల నుంచి నివేదికలు రప్పిస్తూ వారి పనితీరును మదింపు చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న అనం రామనారాయణ రెడ్డి ( వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర రెడ్డి( ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( నెల్లూరు రూరల్) ఉండవల్లి శ్రీదేవి( తాడికొండ)లకు టిక్కెట్స్ ఇవ్వలేమని అప్పుడే సూచనప్రాయంగా చెప్పారు. సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడే 2023 మార్చిలో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా ఈ నలుగురిలో ఉన్న అసంతృప్తిని గుర్తించిన చంద్రబాబు.. వారిని డబ్బు.. రానున్న ఎన్నికల్లో టికెట్స్ ఇస్తామని నమ్మబలికి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేయించుకుని ఆమెను గెలిపించుకున్నారు.
దీంతో సీఎం జగన్ ఈ నలుగురూ పార్టీ నియమావళి ధిక్కరించారు అని గుర్తించి తమ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక వారు వేరే గత్యంతరం లేక టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో ఈ నలుగురికి టిక్కెట్లు ఇస్తామని అప్పట్లో నమ్మబలికిన చంద్రబాబు ఇప్పుడు వీళ్లకు టిక్కెట్లు లేవని చెబుతున్నారని అంటున్నారు. నెల్లూరు రూరల్ - శ్రీధర్ కి బదులు గిరిధర్ రెడ్డికి.. ఉదయగిరి - మేకపాటికి బదులు రామారావుకి.. వెంకటగిరి - ఆనం ను కాదని రామకృష్ణ కు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తాడికొండ శ్రీదేవికి సైతం టిక్కెట్ లేదని.. ఇంకోసారి చూద్దాం అని చెప్పినట్లు తెలిసింది.
ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా వాడకం ముగిశాక వీరిని ఎంగిలాకును విసిరేసిన తీరున చంద్రబాబు పక్కన పడేస్తున్నారు. అప్పట్లో సందర్భానుసారం వాడుకున్నాము తప్ప టిక్కెట్లు ఎలా ఇస్తాం అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంతో మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నం దేవుడా అని కొందరు వాపోతుండగా మిగతావాళ్ళు పోయాం మోసం.. పోయాం మోసం అని నిర్వేదంగా విషాద గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్లకు టిక్కెట్లు ఇస్తే ఎన్నాల్లనుంచో పార్టీని కాపాడుతూ వస్తున్న మేమేం కావాలి.. ఎంత ఖర్చు పెట్టాం.. మాకు ఏదీ భరోసా అని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. దీంతో ఈ కొత్త చుట్టాలకు నేల మీద చాపలు వేసి.. ఆల్రెడీ అక్కడున్న తమ పార్టీ సీనియర్లకు పట్టె మంచాలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆయనకు టిక్కెట్ ఇస్తే మేం పోటీ చేయం..
మరోవైపు రఘురామ కృష్ణంరాజు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీడీపీ వైపు చూస్తూ ఇప్పుడు మళ్లీ తిడుతున్నారు. ఇదంతా టీడీపీ, దాని అనుబంధ మీడియాలో కవరేజీ వరకు బాగానే ఉన్నా ఆయనకూ నరసాపురం టికెట్ దక్కేలా లేదు. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఆ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గోవిందా అయిపోతాయి అని భయపడిన టీడీపీ నేతలు రఘురామకు టిక్కెట్ ఇస్తే మేము పోటీ చేయం అని తేల్చి చెప్పేశారు. దీంతో రఘురామకు సైతం టీడీపీ టిక్కెట్ రావడం లేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు వీళ్లంతా ఎక్కినకొమ్మను నరుక్కుని.. తింటున్న అన్నంలో అగ్గిపోసుకున్నట్లుగా మారిందని అంటున్నారు.
✍️సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment