చంద్రబాబు హయాంలో ఆయన రేంజే వేరు. బాస్ తర్వాతే తానే అన్నట్లుగా బిల్డప్‌లు ఇచ్చేవారు. శిలాఫలకాలు, శంకుస్థాపనలు మినహా నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. గత ఎన్నికల్లో జనం తుక్కు కింద ఓడించేశారు. ఇక కేడర్, ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అయితే ఇప్పుడా నేత సానుభూతి రాజకీయాలకు తెరదీస్తున్నాడు. ప్రజల కోసం తానేదో చేస్తున్నట్లు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు.
మైలవరం గుర్తుకొచ్చింది.!
దేవినేని ఉమామహేశ్వరరావు.. తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల్లో తానే పెద్ద సూపర్ స్టార్ అని ఓవర్ బిల్డప్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తనంత గొప్పోడు లేడంటూ.. ప్రజలకు దూరంగా ఉంచుతూ.. కనీసం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా లెవెల్ చూపించే ఉమకు గత ఎన్నికల్లో ప్రజలు ఆయన అసలు స్థానం ఏంటో చూపించారు. ఓడాక ఆయన్ను కేడర్ పట్టించుకోవడంలేదు. ప్రజలు అసలే మర్చిపోయారు. గతంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో తళుక్కున మెరిసి మాయమైపోయే దేవినేని ఇప్పుడు మైలవరంలో అసలు కనిపించడమే మానేశారట. మరోవైపు ఆయన వ్యతిరేక వర్గం వేరు కుంపటి పెట్టడంతో ఇన్నాళ్లు మైలవరం నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యాడట దేవినేని. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు మళ్లీ మైలవరం గుర్తుకొచ్చింది.
డ్రామా@టిడ్కో
పార్టీలో, ప్రజల్లో తన మైలేజ్ పడిపోతుందని భావించిన దేవినేని ఉమ.. ఇప్పుడు కొత్తగా ప్రజాసమస్యలన్నీ తన భుజాన వేసుకున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారట. తాజాగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి కాలనీలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాల వద్ద నిరసన దీక్ష పేరుతో ఓ కొత్త డ్రామాకు తెరతీశారు దేవినేని ఉమ. నివాసయోగ్యమైన గృహాలను పేదలకు కేటాయించినందుకుగాను నిరసన తెలియచేస్తున్నా.. జగన్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తా అంటూ వీరావేశంలో స్పీచ్‌లు ఇచ్చారట. అయితే క్షేత్రస్థాయిలో ఉమాతో పాటు నిరసనలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందట.
ఇల్లు ఇస్తే ఎంత ఇస్తావు..?
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2018లో జక్కంపూడి కాలనీలో కొన్ని ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో టిడ్కో ఇల్లు కావాలంటే 25 వేలు కట్టాలంటూ లబ్ధిదారుల నుంచి వీఎంసీ ద్వారా రూ.15కోట్ల 90 లక్షలు వసూలు చేశారు. ఇవి కాకుండా అనధికారికంగా టీడీపీ నేతలు అందిన కాడికి లబ్ధిదారుల నుంచి దోచుకున్నారు. ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.90 కోట్లు ఖర్చుచేసి 20 శాతం మాత్రమే ఇళ్లు పూర్తి చేసి.. రూ.69 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగిన పనులతో కలిపి ప్రస్తుతం 67 శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
గతంలో టీడీపీ ఎగ్గొట్టిన 21 కోట్లతో పాటు ఇప్పటి వరకూ జరిగిన పనులకు రూ.270 కోట్లు వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇక టీడీపీ హయాంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులో 10 కోట్లను ఇప్పటికే వీఎంసీకీ తిరిగి ప్రభుత్వం చెల్లించేసింది. మిగిలిన రూ. 5కోట్ల 90 లక్షలు త్వరలో చెల్లించనుంది. అలాగే జక్కంపూడి లే అవుట్ లో 423 కోట్లతో హౌసింగ్, 139 కోట్లతో మౌలిక సదుపాయాలు మొత్తం 570 కోట్ల రూపాయలతో మార్చి నాటికి నిర్మాణాలన్నింటినీ పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని సీఎం జగన్ ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉంది. ఈ వాస్తవాలన్నింటినీ పక్కన పెట్టేసి పబ్లిసిటీ కోసం దేవినేని ఉమ టిడ్కో ఇళ్ల వద్ద నిరసన దీక్ష పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు .
డ్రామా చేస్తే నమ్మాలి కదా..!
తమ ప్రభుత్వంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయిందని.. ఈ ప్రభుత్వం మూడేళ్లైనా ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని బురద జల్లే ప్రయత్నం చేశారు పచ్చ పార్టీ నేత దేవినేని ఉమ. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అక్కడ పనులు జరుగుతుంటే.. ఇళ్లు పూర్తైనా ఇవ్వడం లేదంటూ ఈయన నిరసన చేపట్టడం వింతగా ఉందంటూ నిరసనలో పాల్గొనేందుకు వెళ్ళినవారు బాహాటంగానే చర్చించుకున్నారట. తన ఉనికిని కాపాడుకునేందుకు దేవినేని చేస్తున్న ప్రయత్నాలు చూసి సైకిల్ పార్టీ శ్రేణులు తల బాదుకుంటున్నారట.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment