తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ నిర్ణయాలు టీడీపీ నేతలకు నచ్చడం లేదా.. ? చంద్రబాబు, లోకేష్ కార్యక్రమాలకు రాబిన్ శర్మ సూచించే పేర్లు టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారాయా? రాబిన్ శర్మ సూచించిన యువగళం, ఇదేం కర్మ పేర్లు మార్చాలని పార్టీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఒత్తిడి తెస్తున్నారా..? ఇటీవల కాలంలో టీడీపీలో మొదలైన పేర్ల పంచాయితీ గొడవ ఏమిటి...?
తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ నాయకులకు రుచించడం లేదు. రాబిన్ శర్మ పార్టీకి ఇచ్చే సలహాలు సూచనలు, తీసుకునే నిర్ణయాలపై టీడీపీ సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారు. వ్యూహకర్తగా ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించి రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించడం వల్ల టీడీపీకి ఎటువంటి లాభం కలగడం లేదంటున్నారు.
పైగా రాబిన్ శర్మ తీసుకునే నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరేలా ఉంటున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాబిన్ శర్మ నిర్ణయాలు పార్టీకి.. ప్రజలకి మధ్య అనుబంధం పెంచేలా.. అంతరాలు తగ్గించేలా లేవంటున్నారు. ఇటీవల కాలంలో పార్టీకి సంబంధించి రాబిన్ శర్మ తీసుకున్న రెండు నిర్ణయాలపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ కావడంతో దాని స్థానంలో కొత్త కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టారు. కొత్త కార్యక్రమానికి ఇదేం ఖర్మ అంటూ రాబిన్ శర్మ పేరు ఖరారు చేశారు. ఈ పేరుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పేరు అస్సలు బాగోలేదంటూ టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఇదేం ఖర్మ పేరు స్థానంలో మరొక పేరు పెట్టాలని సూచించారు.
ఇదేం ఖర్మ పేరుతో ప్రజల్లోకి చంద్రబాబు వెళ్ళక ముందే సోషల్ మీడియా, అధికార వైఎస్‌ఆర్‌సీపీ టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నాయని వివరించారు. ఈ పేరు చాలా ఇబ్బందిగా ఉందని ఇదేం ఖర్మ టైటిల్ మార్చాలన్నారు. ఇదేమి ఖర్మ పేరు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందని రాబిన్ శర్మకు వివరించారు.
త్వరలో నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి యువగళం పేరును రాబిన్ శర్మ ఖరారు చేశారు. ఈ పేరు పైన కూడా టీడీపీ సీనియర్ నేతలు అభ్యంతరం తెలిపారు. యువ గళం అనేది కేవలం యువతను మాత్రమే టార్గెట్ చేసుకొని చేసే పాదయాత్రలా ఉందని, అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించే పాదయాత్రలా పేరు పెట్టాలని సూచించారు. పాదయాత్రకు ప్రజా గళం లేదా జనగళం పేరు పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయినా సరే వారి అభ్యర్థనను రాబిన్ శర్మ ఏ మాత్రం లెక్క చేయలేదు. టీడీపీ నేతలు చివరికి చేసేది ఏమీ లేక ఈ రెండు పేర్లు మార్చాలని చంద్రబాబు, లోకేష్ వద్ద కూడా ప్రస్తావించారు. ఈ రెండు పేర్లుకు, చేసే కార్యక్రమాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీ సీనియర్ నేతలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. రాబిన్ శర్మ ఏవైతే పేర్లను సూచించారో.. ఆ పేర్లకే తండ్రి కొడుకులు జై కొట్టారు.
తండ్రి కొడుకుల తీరుతో విసిగి పోయిన పార్టీ సీనియర్ నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది సగం రాబిన్ శర్మ అయితే, మిగతా సగం చంద్రబాబు.. లోకేష్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. గతంలో పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు ఎటువంటి వ్యూహకర్తలు లేకుండానే యువగర్జన, వస్తున్నా మీకోసం వంటి పేర్లు పెట్టిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి మరింత పతనం కాక తప్పదని పచ్చ పార్టీ నాయకులే వాపోతున్నారు.
చదవండి: లోకేష్ పాదయాత్రకు ఎందుకింత హైప్.. ‘ఈనాడు’ భయం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment