సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్‌సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు.
నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment