సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా బరితెగిస్తామని టీడీపీ మరోసారి రుజువు చేసింది. విద్యార్థులు, యువతను పావులుగా వాడుకుని రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు పథకం రూపొందించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ప్రజాధనం లూటీకి పాల్పడ్డ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయ్యి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
తమ అవినీతి బండారం బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ విధ్వంస కాండకు సిద్ధపడుతోంది. ఆ కుట్రను పక్కాగా అమలు చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో అతి పెద్ద హింసాత్మక సంఘటన ఏదైనా జరగాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడి శాంతిభద్రతల సమస్య సృష్టించాలని పన్నాగం పన్నింది.
జాతీయ రహదారులు వేదికగా..
ప్రధానంగా జాతీయ రహదారులపై విధ్వంసం సృష్టించాలని టీడీపీ తమ పార్టీ నేతలకు ఆదేశాలు పంపింది. జాతీయ రహదారులను దిగ్బంధించి వాహనాలపై దాడులకు తెగబడటంతోపాటు దుకాణాలు, హోటళ్లు, దాబాల్లో విధ్వంసం సృష్టించాలన్నది పన్నాగం. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టించాలని పేర్కొంటూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల టీడీపీ శ్రేణులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. చెన్నై–బెంగళూరు జాతీయ రహదారితోపాటు కడప, అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారులపై దాడులకు తెగబడాలని అల్లరి మూకలను పురిగొల్పింది.
సామాన్యులపై దాడులు చేసి అల్లకల్లోలం సృష్టించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తద్వారా పోలీసులు అనివార్యంగా లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి సృష్టించి వీలైతే పోలీసు కాల్పుల వరకు పరిస్థితిని తీసుకెళ్లాలని పథకం వేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోతే దేశవ్యాప్తంగా మీడియాలో చర్చకు తెరతీసి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని పన్నాగం పన్నింది.
సోషల్ మీడియా సాధనం..
ప్రధానంగా సోషల్ మీడియా వేదికల ద్వారా రెండు రోజులుగా యువత, విద్యార్థులను టీడీపీ రెచ్చగొడుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు స్వయంగా ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు వెళ్లి విద్యార్థులను రెచ్చగొడుతుండటం గమనార్హం. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీకి తరలి రావాలని విద్యార్థులను కోరారు. ర్యాలీ, ఫ్లాష్ మాబ్... అంటూ విద్యార్థులు, యువతను సమీకరించేందుకు సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్నారు. అందరూ జాతీయ రహదారులపైకి రావాలని అందులో నిర్దేశించడం గమనార్హం.
ఒకసారి జాతీయ రహదారులపైకి చేరుకున్నాక టీడీపీ రౌడీలు, గూండాలు, అల్లరి మూకలంతా విద్యార్థుల్లో కలసిపోయి విధ్వంసానికి పాల్పడాలన్నది పన్నాగం. విజయవాడ, విశాఖతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులను భారీగా తరలించేందుకు యత్నించారు. అందుకోసం వివిధ జిల్లా కేంద్రాలకు శుక్రవారం ఉదయం నుంచి శనివారం సాయంత్రం వరకు వేర్వేరు సమయాలను కేటాయించడం గమనార్హం. అంటే ఒకచోట విధ్వంసానికి పాల్పడిన కొద్దిసేపటికే మరో జిల్లా కేంద్రానికి చేరుకుని రాష్ట్రం అంతా అల్లకల్లోలం సృష్టించాలన్నది టీడీపీ కుయుక్తి.
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..
టీడీపీ పన్నాగాన్ని గుర్తించిన నిఘా వర్గాలు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అన్ని జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీలను సందర్శించి ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లతో చర్చించారు. అల్లర్ల కేసుల్లో చిక్కుకుంటే భవిష్యత్ దెబ్బతింటుందని విద్యార్థులకు కౌన్సెలింగ్ చేశారు.
కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కపోవడంతోపాటు పాస్‌పోర్ట్, వీసా జారీకి అడ్డంకులు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ నంబర్లు తీసుకుని వాట్సాప్ సందేశాలు కూడా పంపారు. తాము విధ్వంసకర కార్యక్రమాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు చెప్పడంతో మధ్యాహ్నం నుంచి వారిని ఇళ్లకు పంపించారు. కుట్రకు నేతృత్వం వహిస్తున్న టీడీపీ నేతలనుæ నిర్బంధంలో ఉంచారు. పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి రాష్ట్రంలో శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ çఘటనలు జరగకుండా కట్టడి చేయగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment